logo

అక్కాచెల్లెమ్మలకు అందని సొమ్ము

జగనన్న బటన్‌ నొక్కి నెలరోజులు దాటినా అక్కాచెల్లెమ్మల బ్యాంకు ఖాతాలకు ఆసరా సొమ్ము జమ కాలేదు. జనవరి  23న ఆసరా సాయం విడుదల చేసినా, నేటికీ 40 శాతం డ్వాక్రా సంఘాల సభ్యులకు డబ్బులు అందలేదు.

Published : 01 Mar 2024 02:38 IST

జిల్లాలో 13వేల సంఘాలకు దక్కని ‘ఆసరా’
బటన్‌ నొక్కి అయిదు వారాలైనా రాని రూ.116 కోట్లు
న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్‌

జనవరి 23న నమూనా చెక్కు అందజేసిన కలెక్టర్‌

జగనన్న బటన్‌ నొక్కి నెలరోజులు దాటినా అక్కాచెల్లెమ్మల బ్యాంకు ఖాతాలకు ఆసరా సొమ్ము జమ కాలేదు. జనవరి  23న ఆసరా సాయం విడుదల చేసినా, నేటికీ 40 శాతం డ్వాక్రా సంఘాల సభ్యులకు డబ్బులు అందలేదు. వీటి కోసం డ్వాక్రా మహిళలు బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. 2019, ఏప్రిల్‌ 11 నాటికి డ్వాక్రా సంఘాలకు ఉన్న రుణాన్ని.. నాలుగు విడతలుగా చెల్లించడానికి ఆసరా పథకాన్ని వైకాపా ప్రభుత్వం ఆమల్లోకి తెచ్చింది. రెండు పర్యాయాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సొమ్ము మహిళల ఖాతాలకు జమ చేసినా.. మూడు, నాలుగు విడతల్లో వీటి విడుదలకు చుక్కలు చూపించారు. ఎన్నికల వేళ నాలుగో విడత సాయాన్ని విడుదల చేసినా.. ఇంకా వేల సంఖ్యలో సంఘాల ఖతాలకు సొమ్ము వేయలేకపోయారు.

ఆది నుంచీ అవాంతరాలే..?:

కాకినాడ జిల్లాలో మూడు విడతలుగా 37,525 డ్వాక్రా సంఘాలకు వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా రూ.902 కోట్ల మేర రుణమాఫీని అమలు చేశారు. 2020-21 నుంచి ఈ సాయాన్ని ఏటా చెల్లిస్తున్నారు. అప్పటి నుంచి 2022-23 వరకు ప్రతిసారీ చాలా సంఘాలకు వివిధ కారణాలతో సొమ్ము జమ కావడంలేదు. ఒక సంఘం సొమ్ము మరో  సంఘానికి వెళ్లిపోవడం, సాంకేతిక కారణాలతో కొన్ని నిలిచిపోవడం, సభ్యులు మరణిస్తే నామినీకి చెల్లించే క్రమంలో ఇబ్బందులు, ఈకేవైసీ, బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ సంఖ్య అనుసంధానం కాకపోవడం వంటి కారణాలతో చాలా మందికి ఆసరా సొమ్ము దక్కలేదు. ఇలా పొరపాట్లు జరిగిన వాటిని సరిదిద్ది.. ఏడాదికి ఒకసారి ఆగిపోయిన అన్ని పథకాలతో పాటు ఆసరాకు చెల్లింపులు చేసే క్రమంలోనూ అనేక అవరోధాలు ఎదురవడంతో కొంత మంది డ్వాక్రా సభ్యులకు ఇవి దక్కలేదు. మొదట్లో సంఘం ఖాతాకు సొమ్ము జమ చేసిన క్రమంలో కొందరే వీటిని వాడేసుకున్నారు. దీన్ని దిద్దుబాటు చేసి సంఘం ఖాతాకు సొమ్ము పడగానే, సంఘ తీర్మానంతో సభ్యుల వ్యక్తిగత ఖాతాలకు చెల్లింపులు జరిగేలా చర్యలు చేపట్టడంతో ఉపశమనం కలిగింది.

  • కాకినాడ గ్రామీణం మండలంలో తొమ్మది సంఘాలకు గత రెండు పర్యాయాలు ఆసరా సొమ్ము దక్కలేదు. ఈ సంఘాల ఐడీ నంబర్లు వేరొక సంఘాలకు ట్యాగింగ్‌ కావడంతో ఇప్పటికీ సమస్యను పరిష్కరిచక, వీరంతా ఆసరా సొమ్ము కోల్పోయారు.
  • 2022-23కు సంబంధించి వివిధ కారణాలతో నిలిచిపోయిన 170 డ్వాక్రా సంఘాలకు ఆసరా సొమ్ము నిలిచిపోగా, వీటికి ఈ ఏడాది జనవరిలో సొమ్ము విడుదల చేయగా, కేవలం 122 సంఘాలకు రూ.2.57కోట్లు మాత్రమే విడుదల చేశారు. మిగతా సంఘాలకు ఇప్పటికీ ఆసరా దక్కలేదు.

ఇదీ పరిస్థితి..

కాకినాడ జిల్లాలోని 20 మండలాల పరిధిలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న 29,477 డ్వాక్రా సంఘాలకు నాలుగో విడత సాయం కింద రూ.242 కోట్లు మంజూరు చేశారు. జనవరి 23న ఈ ప్రక్రియ ప్రారంభించారు. సీఎం బటన్‌ నొక్కిన తర్వాత జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వైకాపా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా రూ.లక్షలు ఖర్చు చేసి సభలు పెట్టి మరీ మండలాల వారీగా నమూనా చెక్కులు అందజేసి ఎన్నికల ప్రకారం చేసుకున్నారు. ఇప్పటి వరకు 16,135 సంఘాలకు రూ.125 కోట్లు జమ చేశారు. ఇంకా 13,342 సంఘాలకు రూ.116కోట్లు మేర చెల్లింపులు ఆగిపోయాయి. ఎన్నికల కోడ్‌ వస్తే ఈ సొమ్ము వస్తుందో.. రాదోనని అంతర్మథనం చెందుతున్నారు.

దశల వారీగా విడుదల

జిల్లాలో వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత ఆర్థిక సాయం దశల వారీగా విడుదలవుతోంది. రోజుకు కొన్ని సంఘాలకు సొమ్ము జమ చేస్తున్నారు. ఇప్పటికే 60 శాతం సంఘాలకు చెల్లించారు. మిగతా సంఘాలకు వీలైనంత త్వరగా అందిస్తారు.

 బీవీ పద్మావతి, డీపీఎం (బ్యాంకు లింకేజీ), డీఆర్‌డీఏ, కాకినాడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని