logo

ఓపీ చూస్తే బీపీ !

నగరంలోని సీతంపేట ప్రాంతానికి చెందిన యువకుడు ఊపిరితిత్తుల సంబంధిత ఇబ్బందితో ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. సాధారణ ఓపీ రాయించగా రూ.700 తీసుకున్నారు.

Updated : 01 Mar 2024 06:26 IST

ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో వసూళ్లు

నగరంలోని సీతంపేట ప్రాంతానికి చెందిన యువకుడు ఊపిరితిత్తుల సంబంధిత ఇబ్బందితో ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. సాధారణ ఓపీ రాయించగా రూ.700 తీసుకున్నారు. దూరం నుంచి వైద్యుడు చూసి మందులిచ్చి పంపేశారు. పది రోజుల తరువాత మళ్లీ ఆసుపత్రికి వెళ్లగా మళ్లీ రూ.700 చెల్లించాలన్నారు. ఇదేమని ప్రశ్నించగా ఓపీ కాలపరిమితి వారం రోజులే అని చెప్పడంతో చేసేదిలేక మళ్లీ చెల్లించి వైద్య సేవలు పొందారు.


గ్రామీణంలోని ధవళేశ్వరానికి చెందిన వ్యక్తి మధుమేహం, అధిక రక్తపోటు (బీపీ) తదితర వ్యాధులతో నగరంలోని దానవాయిపేటలో ఓ ఆసుపత్రికి వెళ్లారు. ఓపీ రూ.700 చెల్లించగా రెండు గంటలు దాటినా వైద్యుడి వద్దకు పంపలేదు. ఆలస్యమవుతుందని అత్యవసర కార్డు మరో రూ.300 చెల్లించి తీసుకున్నారు. వెంటనే వైద్యుడి వద్దకు పంపినా కనీసం నాడి పట్టకుండా పరీక్షలు రాసి మందులిచ్చి పంపేశారు. మొత్తం వైద్యసేవలకు రూ.4 వేలు దాటింది. పది రోజుల్లోనే మళ్లీ వెళ్లినా ఓపీ రుసుం చెల్లించాలన్నారు.

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం వైద్యం

వైద్యో నారాయణో హరి అంటాం.. కొందరు ప్రైవేటు వైద్యులు దాతృత్వంతో సేవలందిస్తున్నా.. మరికొందరు వైద్యులు, యాజమాన్యాల తీరు అందరికీ మచ్చ తెస్తోంది. రోగం నయం చేయడం సంగతి అటుంచితే.. ఓపీ రుసుములతో పీల్చి పిప్పి చేస్తున్నారు. జిల్లాలోని రాజమహేంద్రవరం నగరంతోపాటు వివిధ ప్రాంతాల్లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ రుసుములు చూస్తే రోగులకు బీపీ వస్తోంది. జాతీయ వైద్య మండలి నిబంధనలు బేఖాతరు చేస్తూ ఇష్టారీతిన అవుట్‌పేషెంట్‌(ఓపీ) కార్డు రుసుం వసూలు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 400 వరకు చిన్నా పెద్దా ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. దాదాపు వీటన్నింటిలోనూ నిర్దేశిత కాలపరిమితిని పక్కనపెట్టి రుసుములు వసూలు చేస్తున్నారు.

కాలపరి‘మితమే’..

గతంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో తీసుకున్న ఓపీ కాలపరిమితి నెల రోజులు ఉండేది. ఇప్పుడు గరిష్టంగా 15 రోజులే ఉంది. ఓపీ కాలపరిమితి పది రోజులైతే 15 రోజులకు మందులు ఇచ్చి మళ్లీ ఆసుపత్రికి రమ్మంటున్నారు. ఈలోపు మళ్లీ ఓపీ కార్డుకు డబ్బు చెల్లించాల్సి వస్తోందని రోగులు, వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒకసారి ఓపీ కార్డుకు చెల్లిస్తే రెండుసార్లు వైద్యుడిని సంప్రదించేందుకు అవకాశం ఉండేదని, ప్రస్తుతం అలా జరగడం లేదని వాపోతున్నారు. కనీసం నాడి కూడా సరిగా పట్టుకోకుండా వివిధ పరీక్షలు, మందుల పేరిట రూ.వేలల్లో బిల్లులు లాగేస్తున్నారు.

నిబంధనలు బేఖాతరు..

ప్రైవేటు ఆసుపత్రులపై జిల్లా వైద్యఆరోగ్యశాఖ పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. జాతీయ వైద్యమండలి నిబంధనల ప్రకారం ఆసుపత్రుల్లో ఓపీ రుసుములు, వైద్యసేవలు, పరీక్షలు, ఇతర వసూళ్లకు సంబంధించి అన్నీ రోగులకు తెలిసేలా బోర్డులు పెట్టాలి. ఆ మొత్తమే వసూలు చేయాలి. జిల్లాలోని చాలా ఆసుపత్రుల్లో ఆ ఊసేలేదు. కొన్నిచోట్ల నామమాత్రంగా పట్టికలో చూపుతున్నా, అందులో సూచించినట్లు వసూలు చేయడం లేదు. ఓపీలో భాగంగా వైద్యులు రోగిని కనీసం పది నిమిషాలైనా పరీక్షించాలనే నిబంధన ఉన్నా అలా జరగడం లేదు. గతంలో నిశితంగా పరిశీలించిన తరువాత అవసరమైతేనే పరీక్షలు రాసేవారు. ఇప్పుడు రోగి చెప్పేది పూర్తిగా వినకుండానే, కనీసం నాడి పట్టకుండానే పరీక్షలు, మందులు సూచిస్తున్నారు.

ఒకేసారి వందశాతం పెంపు

నేడు చిన్న రోగమొచ్చినా వైద్యులను సంప్రదిస్తున్నారు. దీంతో అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ పెరిగింది. ఇదే అదనుగా ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు అమాంతం ఓపీ రుసుములు పెంచేశాయి. సాధారణంగా ఓపీ రుసుము రూ.200-300 ఉండేవి. ప్రస్తుతం కనీస రుసుము రూ.500, అత్యవసర కార్డు తీసుకుంటే మరో రూ.200 అదనంగా వసూలు చేస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో ఓపీ కార్డే రూ.1,000 వసూలు చేస్తున్న దాఖలాలు ఉన్నాయి. చిన్నారుల ఆసుపత్రులకు సంబంధించి ఒకప్పుడు రూ.200 మాత్రమే ఓపీ రుసుము ఉంటే ఇప్పుడు రూ.300-500 తీసుకుంటున్నారు. ఎమర్జెన్సీ కార్డు పేరిట మరో రూ.100-200 అదనంగా తీసుకుంటుండడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు