logo

నగదు లావాదేవీలపై ఓ కన్నేయండి

సార్వత్రిక ఎన్నికల్లో నగదు అక్రమ వినియోగం, తరలింపు, భారీ నగదు లావాదేవీలపై ఎన్నికల వ్యయ పరిశీలకులు దృష్టి సారించాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ తేజ్‌భరత్‌ ఆదేశించారు.

Published : 01 Mar 2024 04:21 IST

ఎన్నికల వ్యయపరిశీలకులకు సూచనలిస్తున్న జేసీ తేజ్‌భరత్‌

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): సార్వత్రిక ఎన్నికల్లో నగదు అక్రమ వినియోగం, తరలింపు, భారీ నగదు లావాదేవీలపై ఎన్నికల వ్యయ పరిశీలకులు దృష్టి సారించాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ తేజ్‌భరత్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల నియోజకవర్గ వ్యయ పర్యవేక్షణ అధికారుల శిక్షణ కార్యక్రమంలో జేసీ పాల్గొని పలు సూచనలు చేశారు. ఎన్నికల ఖర్చుపై రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మార్గదర్శకాలు, ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన ప్రవర్తనా నియమావళి పాటించేలా వ్యయ పరిశీలకులు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళి అమలుపై ఎంసీసీ బృందాలు, ఏఈఆర్‌వోలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌, వ్యయ పరిశీలకులు, పోలీసు అధికారులు, ఇతర ముఖ్య సిబ్బందికి మాస్టర్‌ ట్రైనర్‌ల ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఎన్నికల్లో ప్రలోభాలకు తావులేకుండా ఓటర్లు తమ హక్కును పూర్తి పారదర్శకంగా వినియోగించుకునేలా చూడాలని, ఖర్చుల నియంత్రణపై క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే పరిశీలకుల బృందాలు పూర్తిస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎన్నికల్లో మితిమీరిన ఖర్చులే అవినీతికి మూలకారణమన్నారు. భారీగా నగదు లావాదేవీలు జరిపే వారు దానికి సంబంధించిన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని, సరైన కారణాలు చూపకుండా భారీగా నగదు తరలిస్తూ చిక్కితే ఆదాయ పన్ను శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు. నిబంధనలు, ఆదాయ పన్ను చట్టాలు, ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా పాటించాలన్నారు. కోడ్‌ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి సిబ్బంది కేంద్ర ఎన్నికల సంఘం ఆధీనంలోనే పనిచేస్తారని, కమిషన్‌ ఇచ్చిన నిబంధనల మేరకు పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మాస్టర్‌ ట్రైనర్‌లు సి.హెచ్‌.భరద్వాజ శ్రీనివాస్‌, ఎ.నాగేశ్వరరావు, ఎ.ఉషాశ్రీలు చట్టపరమైన నిబంధనల ఆధారంగా ఎన్నికల వ్యయాన్ని వర్గీకరించారని వివరించారు. బహిరంగ సమావేశాలు, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాలు తదితర చట్టపరమైన వ్యయం పరిధిలోకి, డబ్బు, మద్యం, బహుమతుల పంపిణీ ఓటర్లను ప్రలోభపెట్టే ఉద్దేశంతో ఏదైనా వస్తువుల పంపిణీ అక్రమ వ్యయంలోకి వస్తాయన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించే వ్యయ పరిశీలన బృందాలు ఇలాంటి వ్యవహారాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు