logo

అన్నవరానికి ‘ప్రసాద్‌’!

అన్నవరం దేవస్థానానికి కేంద్ర ప్రభుత్వ పథకం ‘ప్రసాద్‌’ ద్వారా రూ.20 కోట్లు మంజూరైందని సమాచారం.

Updated : 01 Mar 2024 06:26 IST

కేంద్రం నుంచి రూ.20 కోట్ల నిధులు
7న వర్చువల్‌గా శంకుస్థాపన చేసే అవకాశం?

అన్నదాన భవనం నమూనా

అన్నవరం, న్యూస్‌టుడే: అన్నవరం దేవస్థానానికి కేంద్ర ప్రభుత్వ పథకం ‘ప్రసాద్‌’ ద్వారా రూ.20 కోట్లు మంజూరైందని సమాచారం. ఈ నిధులతో నిత్యాన్నదాన భవనం, క్యూ కాంప్లెక్స్‌, మరుగుదొడ్ల నిర్మాణం సహా విద్యుత్తు వాహనాలూ సమకూర్చనున్నారు.

గత అయిదేళ్లుగా ‘ప్రసాద్‌’ పథకం ఊరిస్తోంది. 2018 జనవరిలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ద్వారా రూ.54.62 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపారు. రత్న, సత్యగిరులు, కొండ దిగువన భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు వివరణాత్మక అంచనాలు (డీపీఆర్‌) సిద్ధం చేశారు. రూ.50 కోట్లు మంజూరయ్యే అవకాశముందని కేంద్ర అధికారులు చెప్పడంతో ప్రతిపాదిత అంచనాల్లో మిగిలిన రూ.4.62 కోట్లు డిపాజిట్‌ చేసేందుకు దేవస్థానం అంగీకరించి 2022 నవంబరులోనే లేఖ ఇచ్చింది. కానీ కేంద్రం నిధులు కేటాయించలేదు. ముందుగా రూ.10 కోట్లు కేటాయిస్తామని చెప్పినట్లు తెలిసింది. పనులపై కేంద్రం దృష్టికి మరోసారి తీసుకువెళ్లడంతో ఎట్టకేలకు రూ.20 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈనెల 7న వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారని తెలుస్తోంది. ప్రధాని మోదీ చేతులమీదుగా జరుగుతుందా? కేంద్ర మంత్రుల ద్వారానా అనేది ఇంకా స్పష్టత రాలేదు.

ఈ పనులు పూర్తయితే..

నిత్యాన్నదాన భవనాన్ని ఆలయానికి దగ్గరలో తొలగించిన తితిదే భవన స్థలంలో నిర్మించాలని ఇటీవల నిర్ణయించారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ రూపొందించిన ప్రణాళిక ప్రకారం రెండు అంతస్తుల్లో ఇది రూపొందనుంది. ఒక్కో అంతస్తులో రెండేసి హాళ్లు ఉంటాయి. ఒకేసారి 1400-1500 మంది భోజనం చేసేందుకు వీలుంటుంది. సుమారు రూ.12.50 కోట్లతో పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న భవనం ఎటూ చాలకపోవడంతో భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. క్యూకాంప్లెక్స్‌ నిర్మాణం కూడా ప్రస్తుతం ఉన్న అన్నదాన భవనం వద్ద సుమారు రూ. 6 కోట్ల నుంచి 7 కోట్ల వ్యయంతో నిర్మించి అక్కడ నుంచి ఆలయ ప్రాంగణానికి క్యూలైన్లు అనుసంధానం చేయాలని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని