logo

విద్యార్థులూ విజయీభవ

విద్యార్థుల భవితను నిర్దేశించే ఇంటర్మీడియట్‌ పరీక్షలు నేటి నుంచి ఆరంభం కానున్నాయి. శుక్రవారం నుంచి ఈ నెల 20 వరకు పరీక్షలు జరగనున్నాయి.

Published : 01 Mar 2024 04:26 IST

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు
మూడు జిల్లాల్లో పటిష్ట ఏర్పాట్లు
నిమిషం దాటినా అనుమతి నిరాకరణ
న్యూస్‌టుడే, శ్యామలాసెంటర్‌, అమలాపురం కలెక్టరేట్‌, కాకినాడ నగరం

విద్యార్థుల భవితను నిర్దేశించే ఇంటర్మీడియట్‌ పరీక్షలు నేటి నుంచి ఆరంభం కానున్నాయి. శుక్రవారం నుంచి ఈ నెల 20 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. 9 గంటల తరువాత నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించరు. కేంద్రాలకు ఉదయం 8.30 గంటల కల్లా చేరుకోవాలని అధికారులు సూచించారు. అన్ని ఏర్పాట్లు పూర్తిచేసామని ఇంటర్‌ బోర్డు ప్రాంతీయ అధికారి ఎన్‌ఎస్‌వీఎల్‌ నరసింహం తెలిపారు.

ఆర్‌ఐవో నరసింహం

పకడ్బందీగా నిర్వహణ

ఇంటర్‌ పరీక్షలను ఈ దఫా మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కేంద్రాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటుచేశారు..144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. ప్రతీ విద్యార్థి హాజరును ఆన్‌లైన్‌లో తీసుకుంటారు. పరీక్ష పత్రాలకు క్యూఆర్‌ కోడ్‌ను జోడించారు. పేపర్‌ ఎక్కడ ఫొటో తీసినా.. స్కాన్‌ చేసినా తెలిసిపోతుంది. పరీక్ష కేంద్రాల ఆవరణలోకి చరవాణులు అనుమతించరు. పేపర్లను భద్రపరిచే స్టేషన్లలో కూడా ఇంటర్‌ బోర్డు అందించే ప్రత్యేకమైన ఫోన్లను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ఇది కేవలం బోర్డు నుంచి పరీక్షల విభాగ అధికారులకు వచ్చిన సందేశాలను చూసేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. పైగా ఈ ఫోన్‌ పరీక్షకు 15 నిమిషాల ముందు మాత్రమే పనిచేస్తుంది. ప్రతీ 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటరును నియమించారు.

అమలాపురం ఎస్‌కేబీఆర్‌ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఇంటర్మీడియట్‌ అధికారులు

సమస్యాత్మక కేంద్రాల వద్ద చర్యలు

తూర్పుగోదావరి జిల్లాలో కడియం మండలం మురముండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను, కాకినాడలో శంఖవరం కేంద్రాన్ని సమస్యాత్మక కేంద్రాలుగా పరిగణించారు. అలాగే 600మంది విద్యార్థులు దాటిన చోట ప్రత్యేక బృందాలను నియమిస్తున్నారు.. వాటిలో తూర్పులో పరిశీలిస్తే రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల (950), రంగంపేట కళాశాల (680), వీటీ జూనియర్‌ కళాశాల, నిడదవోలు వికాస్‌ జూనియర్‌ కళాశాల (622), ఎస్‌కేఆర్‌ మహిళా కళాశాల (688)ఉన్నాయి. అలానే కేంద్రాల వద్దకు ఎటువంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకెళ్లరాదని ఆర్‌ఐఓ తెలిపారు. కాలిక్యులేటర్‌, చేతి గడియారం, స్మార్ట్‌ వాచ్‌ పెట్టుకొని వెళ్లినా సిబ్బంది తీసివేయాలని నిబంధనలు పెట్టినట్లు తెలిపారు. పరీక్షల సమయంలో ఏ కళాశాల సిబ్బంది అయినా విద్యార్థికి హాల్‌టిక్కెట్‌ ఇవ్వకపోతే నేరుగా నెట్‌సెంటర్లో పేరు, పుట్టినతేదీ వివరాలతో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. కేంద్రాల్లో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ ఇంటర్‌ విద్యాశాఖాధికారి జీజీకే నూకరాజు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని