logo

దళితుల భూముల్లో ధ్వంస రచన

ఇసుక..మట్టి కనిపిస్తే చాలు అధికార పార్టీ నేతలు అడ్డంగా మేసేస్తున్నారు. నిబంధనలతో పనిలేదు.. అధికారం మనదే కదా ఏమైనా చేసేయొచ్చనే ధీమా.

Updated : 01 Mar 2024 06:25 IST

గోదావరిలో అడ్డుకట్టలు వేసి మరీ వైకాపా అరాచకాలు
అడ్డగోలుగా లంక మట్టి, ఇసుక దోపిడీ

శివాయిలంకలో మట్టి అక్రమ తవ్వకాల వద్ద దళితుల నిరసన

పి.గన్నవరం, న్యూస్‌టుడే: ఇసుక..మట్టి కనిపిస్తే చాలు అధికార పార్టీ నేతలు అడ్డంగా మేసేస్తున్నారు. నిబంధనలతో పనిలేదు.. అధికారం మనదే కదా ఏమైనా చేసేయొచ్చనే ధీమా. గోదావరి తీరంలో దళితులకు కేటాయించిన లంక భూములనూ వారు వదల్లేదు. అక్కడి మట్టి, బొండు ఇసుకను అక్రమంగా తవ్వేస్తూ నిత్యం తరలిస్తున్నారు. ఇదేమని ప్రశ్నించినవారిని కేసులతో బెదిరిస్తున్నారు.

ఇష్టానురంగా తవ్వేయడంతో చెరువులా ఇలా..

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం మానేపల్లి రెవెన్యూ గ్రామపరిధిలో శివాయిలంక గ్రామం ఉంది.. ఇక్కడి దళితులకు వైనతేయ గోదావరితీరం వెంట లంక భూములను మూడు దశాబ్దాల క్రితం పట్టాలిచ్చి పంపిణీ చేశారు. పెరుగు లంకల్లో వీరు సేద్యం చేసుకుంటున్నారు. ప్రస్తుతం అధికార పార్టీ ప్రజాప్రతినిధితో పాటు కొందరు వైకాపా నాయకుల అండతో ఎటువంటి అనుమతులు లేకుండానే ఒక ప్రైవేటు సంస్థ ఈ లంక భూముల్లో ఇష్టానుసారంగా యంత్రాలతో మట్టిని తవ్వేస్తోంది. అనంతరం టిప్పర్లలో తరలిస్తున్నారు. అలానే ఇక్కడి నదీతీరం వెంట ఇసుక, బొండు ఇసుక దోచేస్తున్నారు. ఒక సంస్థకు గంపగుత్తగా ఆర్డరు ఉందంటూ అధికారులు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. తక్షణమే తవ్వకాలు నిలుపుదల చేయాలని డిమాండు చేస్తూ గురువారం శివాయిలంక గ్రామానికి చెందిన దళితులు అక్కడకు చేరుకుని అడ్డుకున్నారు.


కేసుల పేరుతో భయపెడుతున్నారు

గతంలో దళితులకు ఇచ్చిన పట్టా భూములతోపాటు పెరుగులంక భూముల్లో ఇసుక, మట్టి అక్రమంగా తవ్వేస్తున్నారు. అడ్డుకుంటుంటే కేసుల పేరుతో భయపెడుతున్నారు. ఈ కారణంగా చాలామంది ముందుకు రాలేకపోతున్నారు. పట్టాభూమి చెంతన ఉన్న శ్మశానాన్ని సైతం వదలడంలేదు. ఇప్పటికైనా అడ్డుకట్టవేయాలి.

 పుచ్చకాయల సాయిబాబు, శివాయిలంక


అడ్డుకట్టలు.. ఆపై బాటలు

గోదావరి నదీ పాయకు అక్రమార్కులు వేసిన అడ్డుకట్ట

దళితుల భూముల్లో రేయింబవళ్లు సాగిపోతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సిన అధికారులు కార్యాలయాలకు పరిమితం అవుతున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. మట్టి, ఇసుకను తరలించేందుకు అక్రమార్కులు వేసిన రవాణా మార్గాలను చూస్తే మతి పోవాల్సిందే. వైనతేయ గోదావరి ప్రధానపాయతో పాటు కిలోమీటరున్నర దూరంలో కందాలపాలెం, శివాయిలంక, పల్లిపాలెం ప్రాంతాల్లోని చిన్నపాటి నదీపాయలకు అయిదు వరకు అడ్డుకట్టలు వేశారు. పల్లిపాలెం వద్ద ఏకంగా డ్రెడ్జర్‌ వినియోగించారు. నదీపాయల సహజ ప్రవాహాన్ని అడ్డుకోవడం చట్టరీత్యా నేరం. రక్షణకు వీలుగా ప్రత్యేకంగా మద్రాస్‌ రివర్‌ కన్జర్వెన్సీ యాక్టు ఉంది. అయినా అక్రమార్కులకు పట్టడంలేదు. మత్స్యకారుల వేట పడవలు నదీపాయల్లో వెళ్లేందుకు సైతం వీలులేకుండా పోతుంది. పి.గన్నవరం ఇన్‌ఛార్జి తహసీల్దార్‌ దేవళ్ల శ్రీనివాసరావు స్పందిస్తూ ‘‘శివాయిలంక పరిధిలో లంకమట్టి తవ్వకాలను ఆ ప్రాంతానికి చెందిన దళితులు అడ్డుకున్నారని సమాచారం వచ్చింది. సిబ్బందిని అక్కడకు పంపాం. వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామ’ని తెలిపారు.


గ్రామం కనుమరుగు

వైనతేయ గోదావరి ఒడ్డున శివాయిలంక ఉంది. పూర్తిగా వరద తాకిడి ప్రాంతమిది. ఏటా ఇక్కడ అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. ఇలాగే తవ్వేస్తుంటే భవిష్యత్తులో గ్రామం కనుమరుగవుతుంది. ఇప్పటికే వరదలకు నదీకోత బారినపడుతుంది.

ఉండ్రు భాస్కరరావు, శివాయిలంక

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని