logo

అంతా ఆయనే.. ఇంతలో ఈయన

వైకాపాలో పీఠాలు కదులుతున్నాయ్‌.. ఇప్పటికే పలువురు సిట్టింగులకు సెగ తగిలింది. కొందరిని ఎటూ కాకుండా చేస్తే.. ఇంకొందర్ని ఇతర నియోజకవర్గాలకు సాగనంపారు.

Updated : 02 Mar 2024 09:03 IST

వైకాపా సమన్వయకర్తల మార్పుపై కీలక నేతల పట్టు
ఎవరు అభ్యర్థిగా ఉంటారో తెలియక శ్రేణుల్లో గందరగోళం

ఈనాడు, కాకినాడ: వైకాపాలో పీఠాలు కదులుతున్నాయ్‌.. ఇప్పటికే పలువురు సిట్టింగులకు సెగ తగిలింది. కొందరిని ఎటూ కాకుండా చేస్తే.. ఇంకొందర్ని ఇతర నియోజకవర్గాలకు సాగనంపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త సమన్వయకర్తలను తెరమీదికి తెచ్చారు. వీరే రాబోయే ఎన్నికల్లో అభ్యర్థులని ప్రకటించారు. తాజా పరిణామాలు చూస్తే వీరు కూడా ఉంటారో.. లేదో.. చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీనికితోడు స్థానికంగా కొందరు నేతల రాజకీయ వ్యూహాలు, వ్యక్తిగత ప్రాబల్యం కోసం పావులు కదుపుతున్న తీరు చూస్తే ఫ్యాను పార్టీలో గందరగోళం నెలకొంది.


రాజకీయాల ‘కాక’నాడ..

కాకినాడ జిల్లాలో పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో సిట్టింగులకు బదులు కొత్తవారిని అధిష్ఠానం దింపింది. తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం నగరం, గ్రామీణ నియోజకవర్గాలతోపాటు.. కొవ్వూరు, గోపాలపురంలోనూ కొత్తవారు కొలువుదీరారు. కోనసీమలోని రామచంద్రపురం, పి.గన్నవరంలోనూ ఇదే పరిస్థితి. ఇన్నాళ్లూ పార్టీకోసం కష్టపడితే తమకు చేసిన సామాజిక న్యాయం ఇదా అని వారు వాపోతున్నారు. సీఎం జగన్‌ నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే ఏకంగా జనసేన అధినేతతో భేటీ అయితే.. మిగిలిన ఇద్దరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ అదునుకోసం చూస్తున్నారు. తాజాగా నియమితులైన సమన్వయకర్తల్లో కొందర్ని మార్చొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఏమంటిరి.. ‘‘సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నా.. ఎంపీగా ఉన్నా.. ఇప్పటివరకు మేము మార్పులు, చేర్పులు చేసినా సరే వారు సమన్వయకర్తలే.. ఒకసారి జాబితా ప్రకటించాక అప్పుడు అభ్యర్థులుగా మారిపోతారు... అంటూ వైవీ సుబ్బారెడ్డి సెలవివ్వడం దుమారం రేపింది. ‘ఎమ్మెల్యే అభ్యర్థుల టికెట్లన్నీ దాదాపు ఖరారైనట్లే.. మార్చాల్సిన వాటిలో 99 శాతం చేసేశా.. ఒకటో అరో ఉంటాయంతే.. అని పార్టీ నేతల సమావేశంలో చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌ మరుసటిరోజే మాట మార్చారు. వివిధ జిల్లాల్లోని అయిదు నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను మార్చేయడం గందరగోళానికి తెరలేపింది.


వాళ్లు నచ్చలే.. వీళ్లు వద్దులే..

కాకినాడ లోక్‌సభ స్థానం పరిధిలో వైకాపా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఇప్పటికే ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరు కీలక నేతల పట్టుదల అధిష్ఠానానికి శిరోభారంగా మారింది. అంతా నేనే అనుకుని ఇన్నాళ్లూ జిల్లాలో చక్రం తిప్పిన ఓ నాయకుడికి కొత్తగా వచ్చిన మరో నేతకూ మధ్య పొసగడం లేదు.

  • కాకినాడ జిల్లాలో మట్టి రుచి మరిగిన ఓ నేత అన్ని నియోజకవర్గాల్లో కొండలు, చెరువులపై కన్నేశాడు. సొంత సైన్యంతో తలదూర్చి ఇష్టారీతిన తవ్వకాలు మొదలుపెట్టాడు. దీంతో అక్కడి ఎమ్మెల్యేలు..నీ పెత్తనం ఏంటని ఎదురుతిరిగారు. వారందరికీ ఇప్పుడు టికెట్లు లేకుండా పోయాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మూడు నియోజకవర్గాల్లో కొత్త సమన్వయకర్తలను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. మరో నియోజకవర్గంలో ఓ నాయకుడిని మార్చాలని చూసినా.. ఆయన బలమైన అభ్యర్థి కావడంతో సాధ్యపడలేదు.
  • కాకినాడ జిల్లాకు కొత్తగా వచ్చిన ఓ అభ్యర్థి.. ఇప్పుడున్న బృందం అనుకూలంగా లేదంటూ ఇన్నాళ్లూ చక్రం తిప్పిన నేతతోపాటు, మరికొందరిని మార్చాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఆ అభ్యర్థి మాట కొంతలో కొంతైనా వినకపోతే మొండికేస్తాడనే తర్జనభర్జనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. ఓ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే అభ్యర్థి అయితే ఓకే.. ఇప్పుడు నియమించిన సమన్వయకర్తను ఉంచితే ఇబ్బందని ఈ కొత్త అభ్యర్థి వాదన వినిపించారు. మరోచోట ఎప్పట్నుంచో సమన్వయకర్తగా ఉన్న వ్యక్తిని మార్చి 2014 ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థిని బరిలోకి దింపితే గెలిపించుకుంటానని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. మెట్టలోని ఓ నియోజక వర్గంలో కొత్తగా నియమించిన నాయకుడితో పనికాదని.. ఆయన ఆరోగ్యం అంత బాగాలేదని.. ఎన్నికల్లో ఎలా గ్రామాలకు వెళ్తారని ఆక్షేపణ వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. తన అనుచరుడికి ఇక్కడ అవకాశం ఇవ్వాలని పట్టుబట్టినట్లు సమాచారం. ఇంకోచోట వయసు మీరిన అభ్యర్థినీ పక్కన పెట్టాలని ఈయన ప్రతిపాదించగా మన్యంలోని నేత అడ్డుతగిలినట్లు తెలుస్తోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని