logo

భార్య వరకట్న మరణం కేసులో..ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌కు ఏడేళ్లు జైలు

అదనపు కట్నం కోసం వివాహితను వేధించి.. ఆమె మరణానికి కారణమైన ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌కు ఏడేళ్లు, అతడి కుటుంబీకులైన మరో నలుగురికి మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ రాజమహేంద్రవరం ప్రిన్సిపల్‌ అసిస్టెంట్‌ సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి మంగళవారం తీర్పు వెల్లడించారు.

Updated : 03 Apr 2024 02:47 IST

రాజమహేంద్రవరం నేరవార్తలు, న్యూస్‌టుడే: అదనపు కట్నం కోసం వివాహితను వేధించి.. ఆమె మరణానికి కారణమైన ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌కు ఏడేళ్లు, అతడి కుటుంబీకులైన మరో నలుగురికి మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ రాజమహేంద్రవరం ప్రిన్సిపల్‌ అసిస్టెంట్‌ సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి మంగళవారం తీర్పు వెల్లడించారు. సీఐ వి.శ్రీనివాసరావు వివరాలు మేరకు.. శ్రీకాకుళం జిల్లా సింగుపురం గ్రామానికి చెందిన శ్రిదంతా నరసింహమూర్తి తన రెండో కుమార్తె లక్ష్మీ లావణ్య(27)ను శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం రొట్టవలన గ్రామానికి చెందిన గుజ్జల రవికి ఇచ్చి 2019లో వివాహం చేశారు. రవి రాజమహేంద్రవరం ఆర్పీఎఫ్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేసేవాడు. వివాహం అనంతరం నూతన దంపతులు నగరంలోని రైల్వే క్వార్టర్స్‌లో కాపురం పెట్టారు. పెళ్లైన ఆరు నెలల నుంచి అదనపు కట్నం తీసుకురావాలని లావణ్యను వేధించడం మొదలు పెట్టాడు. ఆమెను పుట్టింటికి పంపేవాడు కాదు. 2021 లావణ్య సోదరికి పెళ్లిచూపులు జరుగుతున్నా ఆమెను పంపలేదు. దీంతో దంపతుల మధ్య వివాదం జరిగి తీవ్ర మనస్తాపం చెందిన లావణ్య ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తన కుమార్తె మృతికి భర్త రవితోపాటు అత్తమామలు రాములు, రమణమ్మ, వారి కుటుంబీకులైన బొమ్మిడి సుందరమ్మ, తుంగాన జయలక్ష్మిలే కారణమని నరసింహమూర్తి రాజమహేంద్రవరం రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాటి సీఐ ఎ.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేశారు. కేసులో పలు వాదనలు విన్న రాజమహేంద్రవరం ప్రిన్సిపల్‌ అసిస్టెంట్‌ సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ మంగళవారం తీర్పు వెల్లడించారు. వివాహిత మృతికి ప్రధాన కారకుడైన భర్త రవికి ఏడేళ్లు జైలు శిక్షతోపాటు రూ.10 వేలు జరిమానా, వివాహితను వేధింపులకు గురిచేసిన రాములు, రమణమ్మ, సుందరమ్మ, జయలక్ష్మిలకు మూడేళ్లు జైలు శిక్ష విధించారు.

మరో కేసులో భర్తకు మూడేళ్ల జైలు

నిడదవోలు: భార్యను వేధించిన భర్తకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ నిడదవోలు జూనియర్‌ సివిల్‌ జడ్జి జి.రామకృష్ణ మంగళవారం తీర్పునిచ్చినట్లు సమిశ్రగూడెం ఎస్‌ఐ రమేష్‌ తెలిపారు. పురుషోత్తపల్లికి చెందిన అడుసుమిల్లి శశ్య శ్రావణికి 2010 మే 20న విశాఖకు చెందిన అడుసుమిల్లి వెంకటేశ్వరరావుతో వివాహమైందని తెలిపారు. ఆ సమయంలో నగదు, బంగారం, కొంత భూమి కట్నంగా ఇచ్చినా ఆయన భార్యను శారీరకంగా, మానసికంగా వేధించి, భూమి విక్రయించి డబ్బు తీసుకురావాలని పుట్టింటికి పంపించినట్లు వివరించారు. దీంతో రూ.32 లక్షలు మళ్లీ ఇవ్వగా మద్యానికి బానిసైన భర్త ఇంకా డబ్బు తీసుకురావాలని వేధిస్తుండడంతో ఆమె ఫిర్యాదు చేసిందన్నారు. కోర్టులో నేరం రుజువుకావడంతో భర్త వెంకటేశ్వరరావుకు మూడేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించినట్లు తెలిపారు. ప్రాసిక్యూషన్‌ తరఫున ఏపీపీ గంగాధర్‌ వాదించగా సీఐ కె.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్‌ కె.సోమరాజు సహకారం అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని