logo

పేపరు మిల్లులో కార్మికుల మెరుపు సమ్మె

: రాజమహేంద్రవరం ఆంధ్రా పేపరు మిల్లులో కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. యాజమాన్యం వెంటనే వేతన ఒప్పందం(అగ్రిమెంట్‌) చేయాలని డిమాండ్‌ చేశారు.

Published : 03 Apr 2024 02:49 IST

వేతన ఒప్పందం అమలుకు డిమాండ్‌ 

మిల్లు లోపల బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం ఆంధ్రా పేపరు మిల్లులో కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. యాజమాన్యం వెంటనే వేతన ఒప్పందం(అగ్రిమెంట్‌) చేయాలని డిమాండ్‌ చేశారు. వేతన ఒప్పంద కాలపరిమితి పూర్తయి నాలుగేళ్లైనా కొత్త వేతన ఒప్పందం చేయకుండా యాజమాన్యం మొండి వైఖరి అవలంబించడాన్ని నిరసిస్తూ మంగళవారం సాయంత్రం మిల్లు లోపల.. పర్మినెంట్‌, కాంట్రాక్టు కార్మికులు బైఠాయించి ఆందోళన చేశారు. పాత వేతన ఒప్పందం 2020 జూన్‌ 30తో ముగిసినప్పటికీ ఆ తర్వాత కొత్త వేతన ఒప్పందం చేయకుండా యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. చట్టబద్ధంగా అనేక పద్ధతుల్లో పోరాడిన కార్మికులు నెల కిందట మిల్లులో ఉన్న 11 రిజిస్టర్డ్‌ కార్మిక సంఘాలు కలిసి సమ్మె నోటీసు ఇచ్చాయి. ఆ తరువాత ఏలూరు కార్మిక శాఖ జాయింట్‌ కమిషనర్‌ వద్ద యాజమాన్యానికి కార్మిక సంఘాలకు జరిగిన సంయుక్త సమావేశం(జాయింట్‌ మీటింగ్‌)లో కార్మిక శాఖ అధికారులు, యాజమాన్యం చేసిన సూచన మేరకు 11 సంఘాలు ఉమ్మడిగా వేతన ఒప్పందానికి సంబంధించిన డిమాండ్స్‌ అందజేశారు. అయినప్పటికీ యాజమాన్యం చర్చలకు పిలిచి వేతన ఒప్పందం చేయలేమని స్పష్టం చేసినట్లు కార్మికులు చెబుతున్నారు. దీంతో మళ్లీ కార్మిక శాఖ అధికారులను  ఆశ్రయించగా వేతన ఒప్పందం చేయమని యాజమాన్యానికి కార్మిక శాఖ జాయింట్‌ కమిషనర్‌ సూచించినప్పటికీ మిల్లు యాజమాన్యం పెడచెవిన పెట్టడంతో గత్యంతరం లేక ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని