logo

భోజనం పెట్టేదెలా జగనన్నా..!

వసతి గృహాల్లో భోజన బిల్లులు పేరుకుపోయాయి.దుకాణాల వద్ద సరకులు అరువు తెచ్చి వార్డెన్లు వంటావార్పు చేస్తున్నారు. కొందరైతే తమ జీతం డబ్బులను సైతం ఖర్చు చేయాల్సి వస్తోంది.

Published : 03 Apr 2024 03:06 IST

అరువు తెచ్చి వసతి గృహాల్లో వంటా, వార్పు 
రూ.90 లక్షల మేర బిల్లుల బకాయి

కాకినాడలో ఓ వసతి గృహంలో పిల్లలు

న్యూస్‌టుడే, కాకినాడ నగరం:  వసతి గృహాల్లో భోజన బిల్లులు పేరుకుపోయాయి.దుకాణాల వద్ద సరకులు అరువు తెచ్చి వార్డెన్లు వంటావార్పు చేస్తున్నారు. కొందరైతే తమ జీతం డబ్బులను సైతం ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో వసతి గృహాల నిర్వహణ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. కాకినాడ జిల్లాలో సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో కళాశాలకు చెందిన 12, పాఠశాలలకు చెందినవి 21 వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 1,780 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు.

ఇలా ఎన్నాళ్లు నెట్టుకొస్తారు..

వసతి గృహాల నిర్వహణకు బియ్యాన్ని ప్రభుత్వమే పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేస్తోంది. మిగతా వంట ఖర్చును బిల్లుల రూపంలో వసతి గృహాధికారులకు మంజూరు చేస్తోంది.  కొన్ని వసతి గృహాలకు గత ఏడాది సెప్టెంబరు నుంచి మరి కొన్నింటికి డిసెంబరు నుంచి బిల్లులు రావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా రూ.90 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. మరో 20 రోజుల్లో పాఠశాలలకు సెలవులు ఇస్తారు. ఈలోగా బిల్లులు మంజూరు కాకుంటే సరకులు తెచ్చిన దుకాణ యజమానుల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొనకతప్పదని వార్డెన్లు వాపోతున్నారు.

తెదేపా హయాంలో పెంపు..

2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం మెనూ ఛార్జీలను 40 శాతానికి పైగా పెంచింది. మూడు నుంచి నాలుగో తరగతి విద్యార్థులకు రూ.550 నుంచి రూ.1000కు, అయిదు నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ.750 నుంచి రూ.1,250కు, ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు రూ.800 నుంచి రూ.1400కు పెంచింది. అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్‌   మెనూ ఛార్జీలను పెంచుతామంటూ ఊరించి ఏడాది క్రితం నామ మాత్రంగా పెంచారు.  సరాసరి రూ.150 నుంచి రూ.200 వరకు మాత్రమే పెంపుదల చేశారు. పెరిగిన ధరలకు ఈ ఛార్జీలు ఏ మాత్రం చాలడం లేదని వార్డెన్లు వాపోతున్నారు.

ఇవీ లెక్కలు..

కాకినాడ జిల్లాలో మూడు సహాయ సాంఘిక సంక్షేమశాకాధికారుల (ఏఎస్‌డబ్ల్యూవో) పరిధిలో 33 వసతి గృహాలున్నాయి. కాకినాడ ఏఎస్‌డబ్ల్యూవో పరిధిలో 12 వసతి గృహాలున్నాయి. ఇందులో 7 కళాశాల, 5 పాఠశాల వసతి గృహాలున్నాయి. ఇందులో 600 మంది పిల్లలు వసతి పొందుతున్నారు. ఈ వసతి గృహాలకు ఈ ఏడాది జనవరి నుంచి బిల్లులు రావాల్సి ఉంది. రూ.20 లక్షల వరకు బిల్లులు రావాలి. తుని ఏఎస్‌డబ్ల్యూవో పరిధిలో 9 హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో 3 కళాశాల, 6 పాఠశాలల వసతి గృహాలు. ఇక్కడ 380 మంది పిల్లలు వసతి పొందుతున్నారు. జనవరి నుంచి రూ.20 లక్షల మేర బిల్లులు రావాలి. పెద్దాపురం ఏఎస్‌డబ్ల్యూవో పరిధిలో 12 వసతి గృహాలున్నాయి. ఇందులో 2 కళాశాల, 9 పాఠశాల, ఒక ఆనంద నిలయం వసతి గృహాలున్నాయి. వీటికి గతేడాది సెప్టెంబరు నుంచి రూ.50 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది.


ఎదురుచూస్తున్నాం..

భోజన ఖర్చుల(మెనూ ఛార్జీల) బిల్లుల బకాయిలు రావాల్సి ఉంది. సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా బిల్లులు అప్‌లోడ్‌ చేశాం. వాటి కోసం ఎదురు చూస్తున్నాం. బిల్లులు సకాలంలో విడుదల కాకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. అప్పులు, అరువులతో నెట్టికొస్తున్నాం.

-బాన్‌బాబు, సత్యనారాయణ, వాణి, (కాకినాడ, తుని, పెద్దాపురం) సాంఘిక సంక్షేమశాఖ సహాయ సంక్షేమాధికారులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని