logo

అక్రమంగా తవ్వి.. యథేచ్ఛగా అమ్మి

ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినా మండలంలో అక్రమంగా ఇసుక, తువ్వఇసుక, లంకమట్టి తవ్వకాలు అడ్డూఆపూ లేకుండా సాగిపోతున్నాయి.

Published : 03 Apr 2024 03:10 IST

ఎన్నికల కోడ్‌లోనూ ఆగని వైకాపా నాయకుల ఆగడాలు

పోతవరంలో ప్రైవేటు స్థలంలో ఇసుక నిల్వలు

పి.గన్నవరం, న్యూస్‌టుడే: ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినా మండలంలో అక్రమంగా ఇసుక, తువ్వఇసుక, లంకమట్టి తవ్వకాలు అడ్డూఆపూ లేకుండా సాగిపోతున్నాయి. ఇలా తవ్విన వనరులను బహిరంగంగానే నిల్వచేసి విక్రయిస్తున్నా పట్టించుకునే అధికారులే లేరు. మొండెపులంక వద్ద రేయింబవళ్లు లంకమట్టి తవ్వకాల పేరుతో గోదావరి ఒడ్డున ఇసుక తవ్వేస్తున్నారు. దీంట్లో కొందరు వైకాపా నాయకుల పాత్ర ఉందని బాహాటంగా విమర్శలున్నాయి. ఓ చోటా నాయకుడైతే తనకున్న జేసీబీలను మొండెపులంక వద్ద తవ్వకాల్లో పెట్టి తనస్థాయిలో చక్రం తిప్పుతున్నాడు. తవ్విన తువ్వ, నాణ్యమైన ఇసుక పోతవరం, ముంగండ గ్రామాల్లో అక్రమంగా నిల్వపెడుతూ విక్రయిస్తున్నారు. ఎన్నికలకోడ్‌ రాకముందు వరకు అక్రమాలకు రాజకీయ నాయకుల పైరవీలతో అధికారులు ముందుకెళ్లలేని పరిస్థితి. కోడ్‌ వచ్చాక కూడా అక్రమాలు జరుగుతుంటే అధికారయంత్రాంగం కనీసం అటువైపు కన్నెత్తిచూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇటీవల రెవెన్యూశాఖకు చెందిన ఓ ఉద్యోగి ముంగండ వద్ద అక్రమంగా పెట్టిన తువ్వ ఇసుక లారీని అడ్డుకుంటే బిల్లులు ఉన్నాయంటూ అక్రమ వ్యాపారం చేస్తున్న చోటా వైకాపా నాయకుడు చెప్పినట్టు తెలిసింది. ఇదికూడా ఎన్నికల కోడ్‌ వచ్చిన తరువాతే జరిగిన పరిణామం. అంబాజీపేట-గన్నవరం ర.భ.శాఖ రహదారిని చేర్చి ముంగండలో భారీగా తువ్వఇసుక నిల్వలుపెట్టి అమ్మకాలు చేస్తున్నారు. పోతవరం వద్ద రెండు వేర్వేరు ప్రైవేటు లేఔట్‌లలో అనుమతులు తీసుకోకుండా ఇసుక నిల్వచేసి విక్రయిస్తున్నారు. ఇప్పటికైనా ఆపాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.


అనుమతులు ఇవ్వలేదు

మండలంలో ఇసుక, లంకమట్టి, తువ్వ  ఇసుక నిల్వపెట్టేందుకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు. ఉంటే స్వాధీనం చేసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా చట్టప్రకారం చర్యలు తప్పవు.

  హుస్సేన్‌, తహసీల్దారు, పి.గన్నవరం

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని