logo

ప్రజాగళమై ముందుకు..

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు రెండ్రోజులపాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.

Published : 03 Apr 2024 03:12 IST

నేడు రావులపాలెం, ద్రాక్షారామల్లో తెదేపా అధినేత సభలు 

ఈనాడు, రాజమహేంద్రవరం: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు రెండ్రోజులపాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం కొత్తపేట, రామచంద్రపురం.. గురువారం కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగసభల్లో పాల్గొంటారు. అంతకుముందు పార్టీ అభ్యర్థులు అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణ, అంతర్గత సర్దుబాట్లు తదితర అంశాలపై నియోజకవర్గాల వారీగా నాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు.

పర్యటన ఇలా...: హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు రాజమహేంద్రవరం చేరుకోనున్న చంద్రబాబు అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఈతకోట ప్రాంతానికి చేరుకుంటారు. రోడ్డు మార్గంలో రావులపాలెం తెదేపా కార్యాలయం కూడలికి సాయంత్రం 3 గంటలకు వస్తారు. 3.30 గంటల నుంచి 5 వరకు అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగసభలో ప్రసంగిస్తారు. ్య 5.15 గంటలకు ద్రాక్షారామ వెళ్లి అక్కడ బోస్‌ కూడలిలో 7 గంటలకు నిర్వహించే సభలో ప్రసంగిస్తారు. రాత్రికి రామచంద్రపురంలోని వీఎస్‌ఎం కళాశాల ఆవరణలో బస చేస్తారు.

రెండోరోజు..: గురువారం ఉదయం రామచంద్రపురంలోని వీఎస్‌ఎం కళాశాల ఆవరణలో పార్టీ నాయకులతో చంద్రబాబు సమావేశమవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్‌లో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పయనమవుతారు. 2.30 గంటలకు అక్కడి లక్ష్మీ వేంకటేశ్వర రైస్‌మిల్‌ సమీపంలో దిగి రోడ్డు మార్గంలో స్థానిక విజయ్‌ విహార్‌ సెంటర్‌కు చేరుకుంటారు.సాయంత్రం 3 నుంచి 4.30 గంటల వరకు బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగిస్తారు.

అనంతరం రోడ్డు మార్గంలో గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల చేరుకుని బహిరంగసభలో సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు మాట్లాడతారు. అనంతరం స్థానిక ప్రియాంక కన్వెన్షన్‌లో రాత్రి బస చేస్తారు. శుక్రవారం స్థానిక నాయకులు, క్యాడర్‌తో సమావేశమవుతారు. తర్వాత ఏలూరు జిల్లాకు వెళ్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని