logo

కోడ్‌ ఉంటే మాకేంటీ!

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు పక్కాగా జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాధవీలత ఓ పక్క చెబుతుండగా క్షేత్రస్థాయిలో మాత్రం అంతా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు.

Published : 03 Apr 2024 03:14 IST

చర్యలు లేనప్పుడు!

సీతానగరం, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు పక్కాగా జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాధవీలత ఓ పక్క చెబుతుండగా క్షేత్రస్థాయిలో మాత్రం అంతా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. రాజానగరం నియోజకవర్గంలో ఇప్పటికీ స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చిత్రాలతో పాటు వైకాపాలో రాష్ట్ర మంత్రుల పేర్లు దర్శనమిస్తూనే ఉన్నాయి. వీటన్నింటినీ తొలగించాల్సిన సిబ్బంది చూసీచూడనట్లుగా వ్యవహరిస్తూ ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజానగరం నియోజకవర్గంలో సాక్షాత్తు ఆర్డీవోనే ఆర్వోగా ఉన్నారు.

ప్రధాన రోడ్డు పక్కనే..: సీతానగరం మండలం రఘుదేవపురం పంచాయతీలో ఇటీవలే 30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో పాటు వైకాపాలోని పలువురు పేర్లతో పాటు రూ.కోట్ల వివరాలు శిలాఫలకంపై ఉన్నాయి. రాజమహేంద్రవరం-సీతానగరం ర.భ.శాఖ ప్రధానరోడ్డు పక్కనే ఆ శిలాఫలకాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు. కనీసం దీనికి కాగితాలు కూడా అంటించలేదు. అదే పంచాయతీలోని రైతుభరోసా కేంద్రం-3 వద్ద ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చిత్రం కనిపించేలా శిలాఫలకం మొత్తం వదిలేశారు. పైన కాగితం అంటిస్తే పీకేసినట్లుగా ఉంది. ముగ్గళ్ల పంచాయతీలో జల్‌జీవన్‌ మిషన్‌ పథకంలో చేసిన పనులకు ఎమ్మెల్యే పేరుతో ఏర్పాటు చేసిన శిలాఫలకంపై కాగితాలు అంటించారు. పెరుగుతున్న ఎండలకు మైదాపిండి అట్టలా వచ్చి అంటించిన కాగితాలు ఊడిపోయాయి. ఆయా పంచాయతీ కార్యదర్శులకు వీటిపై విన్నవిస్తున్నా ప్రయోజనం లేకపోతోందని స్థానికులు అంటున్నారు. ఎవరైనా సి-విజిల్‌ యాప్‌లో ఫిర్యాదు చేస్తే ఎంసీసీ, ఎఫ్‌ఎస్టీ, వీఎస్టీ బృందాలు నేరుగా రంగంలోకి దిగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని