logo

Annavaram: అన్నవరం కొండపై పెళ్లిళ్లకు రుసుముల బాదుడు

ప్రముఖ పుణ్య క్షేత్రం అన్నవరానికి భక్తుల తాకిడి నిత్యమూ ఉంటుంది. సత్యదేవుని సన్నిధికి జనం పోటెత్తడానికి పలు అంశాలు దోహదం చేస్తున్నాయి.

Updated : 03 Apr 2024 08:42 IST

దేవస్థానంలో వివాహాలకు మండపాలు

న్యూస్‌టుడే - అన్నవరం: ప్రముఖ పుణ్య క్షేత్రం అన్నవరానికి భక్తుల తాకిడి నిత్యమూ ఉంటుంది. సత్యదేవుని సన్నిధికి జనం పోటెత్తడానికి పలు అంశాలు దోహదం చేస్తున్నాయి. ఆధ్యాత్మిక ప్రాధాన్యం సహా.. కోస్తా జిల్లాల్లో అన్నవరం కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి, రైలు మార్గంలోనూ అన్నవరం రాకపోకలకు వీలుగా ఉండటం, పేద, మధ్య తరగతి, ధనిక కుటుంబాలవారూ సత్యదేవుని సన్నిధిలో వివాహాలు, విధిగా సత్యనారాయణస్వామి వ్రతానికి మక్కువ చూపడం కద్దు. ధనికేతర కుటుంబాల వారైతే.. వివాహం ఈ కొండమీద చేసుకుంటే ఖర్చు బాగా తగ్గుతుందనే ఆర్థికాంశంకూడా ఇక్కడ ఎక్కువ వివాహాలకు కారణం. అయితే క్రమంగా వివాహం అన్నవరంలోనైనా ఖర్చు రకరకాలుగా తడిసి మోపెడవుతుందనే అసంతృప్తి భక్తుల్లో ఉంది. ఇందుకు దేవస్థానం విధి విధానాలను ఆసరాగా చేసుకుని, సంబంధం ఉన్నా లేకున్నా కొందరు జలగల్లా భక్తులను వేధిస్తున్నారనేది బహిరంగ రహస్యమే. ఇటీవల కీలక అధికారుల దృష్టికీ రావడం గమనార్హం.

 అన్నవరంలో ఇదీ తంతు..

కొండపై వివాహాలు లేదా ఉపనయనాలు చేసుకునేవారు తమతో కొండ దిగువ నుంచి లేదా ఇంటి నుంచే భోజనాలు, అల్పాహారం వంటివి పైకి తీసుకెళ్లాలంటే టోల్‌ రుసుం చెల్లించాలి. ఆయా పదార్థాలు 20 మందికి తీసుకువెళ్లినా.. వందల మందికి తీసుకువెళ్లినా ఈ రుసుం కట్టాల్సిందే. ఓ కుటుంబం 50 మంది అతిథులతో  ఉపనయనం చేసుకుంటే, కొండ దిగువ నుంచి అల్పాహారం తీసుకువెళ్లడానికి రూ.1,500 రుసుం చెల్లించాలి. అంటే ఒకరు తినే అల్పాహారానికి రూ.30 చొప్పున టోల్‌ రుసుం కట్టాలన్నమాట. 50 మందికి భోజనాలు తీసుకెళితే ఒక్కో భోజనానికి రూ.60 చొప్పున
రూ.3000 రుసుం చెల్లించాలి. వేలం ద్వారా కొండపై వ్యాపార హక్కులు దక్కించుకున్నవారికి సహకరించేందుకు దేవస్థానం అనుసరిస్తున్న విధానమిది. అన్నవరం కొండపై సగటున ఏటా వేలాది వివాహాలవుతుంటాయి. అక్కడ ఈ తంతు ఆర్థిక భారం అనుకుంటే భక్తుల ప్రత్యామ్నాయాలకు అవకాశాలెన్నో ఉంటాయి. జగన్‌ సీఎంగా వైకాపా పాలనలో గత రెండేళ్లలో తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమై, వాటిని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది కూడా.

ఆహారం రోడ్డుపై పారేసిన పరిస్థితి

కొండపైకి ఆహారం తీసుకువెళ్తే చెల్లించాల్సిన రుసుం భారీగా గత ఏడాది జూన్‌లో పెంచారు. టిఫిన్లు తెచ్చుకుంటే రుసుం రూ. 1,500 నుంచి రూ.3 వేలకు, భోజనాలకు రూ. 3 వేలు నుంచి రూ.5 వేలకు పెంచారు. దీంతో దుమారం రేగింది. అప్పట్లో కాకినాడకు చెందిన ఓ పెళ్లిబృందం వారి ఇంటి పులిహోర, సాంబారుతో భోజనాలు కొండపైకి తీసుకువెళ్తుండగా ఘాట్‌రోడ్డు టోల్‌గేటు వద్ద సిబ్బంది అడ్డుకున్నారు. రూ. 6 వేలు రుసుం చెల్లించాలని ఒత్తిడి చేశారు. పిల్లల కోసం అతి తక్కువ భోజనాలు తీసుకువెళ్తున్నామని చెప్పినా సిబ్బంది వినిపించుకోలేదు. ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు వారు తెచ్చుకున్న ఆహారాన్ని టోల్‌గేటు వద్దే పడేసి నిరసన తెలిపి వెళ్లిపోయారు. అనకాపల్లికి చెందిన ఓ పెళ్లి బృందం పెళ్లికి వచ్చిన వారికి అల్పాహారం కొండ దిగువున కొనుగోలు చేసుకున్నారు. రూ. 3,200కు అల్పాహారాన్ని తీసుకుని క్యారేజీల్లో తీసుకువస్తుండగా టోల్‌గేటు వద్ద సిబ్బంది అడ్డుకున్నారు. కొండపైకి తీసుకువెళ్లాలంటే రూ. 3 వేలు చెల్లించాల్సిందేనని సిబ్బంది తేల్చిచెప్పారు. దీంతో ఆర్థిక భారమవుతుందని అల్పాహారం తీసుకువెళ్లలేదు. దీంతో ఆ వివాహ వేడుకలో కుటుంబసభ్యులు ఆహారం లేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. దీంతో అధికారులు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అల్పాహారానికి రూ 1,500, భోజనానికి రూ. 3 వేలు యథావిధిగా అమలు చేస్తున్నారు. పెళ్లిబృందాలు కొండపై భోజనాలు తయారు చేసుకుంటే రూ.18 వేలు చెల్లించాలని నిబంధన పెట్టారు.  

వివాహ రిజిస్ట్రేషన్ల నిలిపివేత

దేవస్థానంలో వివాహం చేసుకునే వారికి వివాహ రిజిస్ట్రేషన్లు గత ఏడాది ఏప్రిల్‌ నుంచి నిలుపుదల చేశారు. కొండపై వివాహాలు చేసుకునేవారు వివాహం సమయంలోనే దేవస్థానం నిబంధనలకు అనుగుణంగా ధ్రువీకరణలు ఇచ్చి రుసుం చెల్లిస్తే రిజిస్ట్రేషన్‌ చేసేవారు. న్యాయపరమైన ఇబ్బందులు, దేవస్థానం నుంచి ఇచ్చే ధ్రువీకరణలకు చట్టబద్ధత లేదనటంతో ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియనే నిలిపి వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని