logo

అధికారులూ.. హద్దుమీరితే అంతే సంగతి

ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినా కొందరు అధికారులు వైకాపా ప్రజాప్రతినిధులకు అనుకూలంగా వ్యవహరిస్తూ మొట్టికాయలు తింటున్నారు.

Published : 03 Apr 2024 03:20 IST

 ఈసీ కొరడా నేపథ్యంలో చర్చ
 ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల వైకాపాకు అనుకూలంగా యంత్రాంగం

 ఈనాడు, రాజమహేంద్రవరం; న్యూస్‌టుడే, అమలాపురం గ్రామీణం: ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినా కొందరు అధికారులు వైకాపా ప్రజాప్రతినిధులకు అనుకూలంగా వ్యవహరిస్తూ మొట్టికాయలు తింటున్నారు. రాష్ట్రంలో తాజాగా ముగ్గురు ఐఏఎస్‌, అయిదుగురు ఐపీఎస్‌ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల విధుల నుంచి తప్పించింది. ఉమ్మడి జిల్లాలోనూ పలుచోట్ల కోడ్‌ ఉల్లంఘనలు వెలుగులోకి వస్తున్నా చర్యలు చేపట్టే విషయంలో అధికారులు మిన్నకుంటున్నారు. వీరంతా అప్రమత్తమవ్వాల్సిన పరిస్థితిని ఈసీ చర్యలు సూచిస్తున్నాయి.

ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా వాలంటీర్లు, ఇద్దరు ఒప్పంద సిబ్బంది, ఇతర విభాగాలకు చెందిన ప్రభుత్వ సిబ్బంది ఒకరిద్దరిపై వేటు పడింది. ప్రతి నియోజకవర్గంలో నియమావళి సక్రమంగా అమలు చేయకపోయినా.. పార్టీలు, నాయకులకు అనుకూలంగా వ్యవహరించినా ఆధారాలతో ఫిర్యాదులొస్తే చర్యలు తప్పవని ఎన్నికల సంఘం స్పష్టమైన సంకేతాలిచ్చింది.

మన వద్ద పరిశీలిస్తే..

  • జిల్లాలో వైకాపా నాయకుల కనుసన్నల్లోనే నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో గోదావరిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఉన్నతాధికారులు చూసినా నేటికీ చర్యలు లేవు.
  •  రాజమహేంద్రవరం నగరంలో వైకాపా అభ్యర్థి ఇంటింటి ప్రచారంలో మీకు చీర అందిందా... బాగుందా..? మీ ప్రాంతంలో రోడ్డు పనులు మరో వారంలో ప్రారంభమవుతాయి... మాకే ఓటేయండంటూ ప్రచారం చేస్తున్నారు. తాయిలాలు పంచి వాటి గురించి ప్రచారంలో ప్రస్తావించడం ఓటర్లను ప్రలోభానికి గురిచేయడమేన్న వాదన వినిపిస్తోంది. వీటిపైనా అధికారులు స్పందించడం లేదు.
  •  ప్రభుత్వ పథకాల గురించి అధికారిక కార్యక్రమాల్లో పూర్వపు కలెక్టర్‌ ప్రసంగాలను వాహనంపై ప్రచారం చేస్తూ కాకినాడ గ్రామీణ వైకాపా అభ్యర్థి కురసాల కన్నబాబు లబ్ధి పొందేందుకు చేస్తున్న ప్రయత్నం ఇటీవల వెలుగుచూసింది. వాహనానికి ఎటువంటి అనుమతులు లేవని ఆర్‌వో స్పష్టంచేసినా నేటికీ చర్యలు లేవు. ఇక్కడ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘనలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. 
  •  కాకినాడ అర్బన్‌ రెండో డివిజన్‌లో వైకాపా ప్రచార సామగ్రిని మంగళవారం రాత్రి పోలీసులు, జËనసేన నాయకులు పట్టుకున్నారు. సామగ్రితోపాటు అందులో తాయిలాలు ఉన్నాయని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. అక్కడికి భాజాపా నాయకులు చేరుకోవడంతో అధికారపక్షం, కూటమి నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి.
  • డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం కూనవరంలో ఆదివారం మంత్రి విశ్వరూప్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొందరు చిన్నారులు ప్రమాదకరంగా ఆయన ప్రచార వాహనానికి వేలాడుతూ వెళ్లినా వైకాపా నాయకులు వారించలేదు. ఓ కన్నేసి ఉంచాల్సిన అధికారులు మిన్నకుండిపోయరు. స్థానిక ఎంపీడీవో దృష్టికి వెళ్లినా చిన్నారులు స్వచ్ఛందంగా పాల్గొంటే తామేం చేస్తామని, సి-విజిల్‌ యాప్‌లో ఫిర్యాదులొస్తే స్పందిస్తామనే కోణంలో మాట్లాడారు. 
  •  కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రభుత్వ వాహనమనే స్టిక్కర్‌ ఉండే కారులో సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్‌కు వచ్చారు. ఆయన అనుచరుల కారుపై అధికార పార్టీ సిద్ధం లోగో, సీఎం జగన్‌, జగ్గిరెడ్డి చిత్రాలున్నాయి. సుమారు గంటసేపు ఈ కార్లు అక్కడి ఆవరణలోనే ఉన్నాయి. అయిప్పటికీ అధికారులు పట్టించుకున్న దాఖలాల్లేవు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు