logo

పాడి పరిశ్రమకు గడ్డుకాలం

జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతులు పాడి పరిశ్రమపై ఆధార పడి జీవిస్తున్నారు. వారికి గత అయిదేళ్లుగా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. అందాల్సిన రాయితీ పథకాలు ఒక్కొక్కటిగా దూరమయ్యాయి. ఫలితంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Published : 03 Apr 2024 04:40 IST

పథకాలను తొలగించిన ప్రభుత్వం
పోషకుల రాయితీపైనా వేటు

ఇలా ట్రాక్టర్‌తో గడ్డి లోడు కావాలంటే రూ.వేలు కట్టాల్సిందే..

పార్వతీపురం పట్టణం, గ్రామీణం, న్యూస్‌టుడే :  జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతులు పాడి పరిశ్రమపై ఆధార పడి జీవిస్తున్నారు. వారికి గత అయిదేళ్లుగా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. అందాల్సిన రాయితీ పథకాలు ఒక్కొక్కటిగా దూరమయ్యాయి. ఫలితంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వెంటాడుతున్న అవస్థలు..

జిల్లాలో పశుపోషకులు లక్షల్లో ఉన్నారు. చాలా కుటుంబాలు గొర్రెలు, మేకలు, పశువులు, గేదెలను పెంచి వాటి ద్వారా ఆదాయం పొందుతున్నారు. ఎక్కువ మందికి పచ్చిక బయళ్లు, వరి గడ్డి అవసరం. వరి చేను నూర్పు అనంతరం వచ్చే గడ్డిని ఏడాది పొడుగునా నిల్వ ఉంచి పశుగ్రాసంగా వాడేవారు. కొన్నేళ్లుగా యంత్రాలతో కోత, నూర్పు తదితర కారణాలతో కొరత ఏర్పడింది. మరోవైపు చెరువులు, వాగులు, గుంతలు ఎండిపోయి నెర్రలు చాచడంతో నీరు సైతం దొరకడం లేదు.

పెరిగిన గ్రాసం ధరలు..

వేసవి రావడంతో పొలాల్లో ఎక్కడా పచ్చగడ్డి అందుబాటులో లేదు. దీంతో పశువులు విలవిల్లాడుతున్నాయి. ప్రభుత్వం రాయితీపై పాతర గడ్డి ఇవ్వని కారణంగా పల్లెల్లో వరి గడ్డే దిక్కైంది. ప్రస్తుతం ట్రాక్టరు రూ.16 వేల నుంచి రూ.18 వేల వరకు పలుకుతోంది. కేవలం దానిపైనే ఆధారపడడం, ఇతర సౌకర్యాలు లేకపోవడంతో పాల దిగుబడి సైతం తగ్గిందని పోషకులు వాపోతున్నారు. మొక్కజొన్న, ఇతర జొన్నలు, అలసందలు, సజ్జలు ఇచ్చామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.

గతంలో అండ ఇలా..

  •  తెదేపా ప్రభుత్వ హయాంలో పాల ఉత్పత్తి పెంపునకు ఏటా పశుపోషకులకు పాతర గడ్డి(సైలేజ్‌) దాణా అందించేవారు.
  •  ఏటా టన్నుల కొద్దీ పాతర గడ్డిని నేరుగా గ్రామాల్లో ఇచ్చేవారు. 75 శాతం రాయితీపై కిలో రూ.2కే సరఫరా అయ్యేది. పశు దాణా కూడా 75 శాతం రాయితీపై కిలో రూ.4 చొప్పున పంపిణీ జరిగేది.
  •  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధుల కింద పశువుల సంరక్షణ కోసం గోకులం, మినీ గోకులాల పేరిట షెడ్లు నిర్మించారు. 2019 తర్వాత వైకాపా ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసింది.
  •  అప్పట్లో ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో పశు గ్రాసం సాగు చేయించారు. అధిక సంఖ్యలో రైతులు దీన్ని సద్వినియోగం చేసుకొని వేసవిలో ఉపయోగించేవారు.
  •  వేసవిలో పశువుల దాహార్తి తీర్చేందుకు పొలాల్లో అందుబాటులో ఉండే చేతి పంపుల వద్ద తొట్టెలు నిర్మించేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక కొత్తవాటిని ప్రారంభించకపోగా.. అప్పటికే ప్రారంభమైన వాటిని సైతం ఆపేసింది. తెదేపా ప్రభుత్వం కిలో దాణామృతం రూ.3 చొప్పున ఇవ్వగా.. వైకాపా ఆ ధరను రూ.6.50కి పెంచింది.

    ఇబ్బంది లేకుండా చూస్తున్నాం..

పశు గ్రాసం కొరత లేదు. ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాం. 2.23 మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్న విత్తనాలు, 0.96 మెట్రిక్‌ టన్నుల అలసందలు, 3.74 మెట్రిక్‌ టన్నుల జొన్న రకాలు, సజ్జలు 0.126 మెట్రిక్‌ టన్నులను 75 శాతం సబ్సిడీపై అందజేశాం. టీఎంఆర్‌ దాణా 20 మెట్రిక్‌ టన్నులను 60 శాతంపై ఇచ్చాం.

- మన్మధరావు, పశుసంవర్ధక శాఖాధికారి

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని