logo

ఆడిందే ఆట.. పాడిందే ‘వైకాపా’ పాట

ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్ము నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు చేసి ఖజానాను ఖాళీచేశారు.

Updated : 13 Apr 2024 09:22 IST

అధికార పార్టీ ప్రజాప్రతినిధి చెప్పిందే వేదం

కాకినాడ నగరపాలికలో ఏడాదిన్నరపాటు ఇష్టారాజ్యం

 న్యూస్‌టుడే, బాలాజీచెరువు(కాకినాడ): ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్ము నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు చేసి ఖజానాను ఖాళీచేశారు. చివరకు పొరుగుసేవల విధానంలో పారిశుద్ధ్య సేవలందిస్తున్న కార్మికులకు అయిదు నెలలుగా జీతాలివ్వలేని దుస్థితికి దిగజార్చారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధి చెప్పిందే వేదంగా అడ్డగోలు పనులకు జీహుజూరు అన్నారు. ప్రత్యేక అధికారి పాలనలో కాకినాడలో నష్టమే తప్పా.. ఒరిగిందేమీ లేదని నగర వాసులు వాపోతున్నారు.

కాకినాడ నగరపాలక సంస్థ పాలకమండలి పదవీ కాలం 2022, సెప్టెంబర్‌ 15తో ముగిసింది. నాటి నుంచి కాకినాడ జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఆరునెలలకోసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారి పాలనను పొడిగిస్తోంది. ప్రత్యేక అధికారి పాలనలో 18 నెలలుపాటు సుమారు రూ.50 కోట్ల మేర వివిధ అభివృద్ధి పనులకు నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు చేశారు.

సంత చెరువు వద్ద సాధారణ నిధులతో నిర్మించిన దుకాణ సముదాయం

కన్నెత్తి  చూడలే!

కాకినాడ నగరపాలక సంస్థకు గతంలో ఆరుగురు ఐఏఎస్‌లు ప్రత్యేక అధికారులుగా వ్యవహరించారు. దాన కిషోర్‌ హయాంలో చలానా కుంభకోణం వెలికితీశారు. కోన శశిధర్‌, ముద్డాడ రవిచంద్ర వంటి ఐఏఎస్‌ అధికారులు ప్రత్యేక పాలనలో తమదైన ముద్ర వేశారు. 18 నెలలపాటు పనిచేసిన ప్రత్యేక అధికారి... నగరపాలక సంస్థ వైపు కన్నెత్తి చూడలేదు. స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ వ్యవహారాలనూ పట్టించుకోలేదు.

  • నగరంలో పారిశుద్ధ్యం నిర్వహణను ఒక్కరోజు కూడా పరిశీలించలేదు. దీంతో పారిశుద్ధ్యం గాడి తప్పి వాహనాలన్నీ మూలకు చేరాయి. ఇలాంటి కీలకమైన పనులకు నిధులు వెచ్చించలేదు.
  • వీధి దీపాల నిర్వహణ గాలికి వదిలేశారు. ఒక ప్రైవేటు సంస్థ నిర్వహణ కాలం ముగియడంతో వెళ్లిపోయింది. కొత్త సంస్థకు
  • అప్పగించాలని దస్త్రం తయారు చేసినా దానికీ అతీగతీ లేదు.  
  • రూ.100 కోట్లతో సిద్ధం చేసిన స్మార్ట్‌సిటీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను రెండేళ్లుగా పునరుద్ధరించలేదు.

ఆ ఇద్దరిదే పెత్తనం

నగరపాలక సంస్థలో ఇద్దరు కీలక అధికారులు చక్రం తిప్పుతున్నారు. వీరిలో ఒకరు ఆరేళ్లుగా ఇక్కడే తిష్ఠవేశారు. మరో అధికారిణి నాలుగేళ్లకు పైగా కీలక విభాగానికి అధిపతిగా ఉన్నారు. వీరు అధికార పార్టీ నేత చెప్పిన పనే చేస్తారు. అది నిబంధనలకు విరుద్ధమైనా వెనక్కితగ్గరు. ఆమోదించేలా దస్త్రాలు తయారు చేస్తారు. వీరిని బదిలీ చేయాలని ప్రతిపక్షాలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.

ఇదీ  పరిస్థితి

  • సంతచెరువు పార్కు వద్ద రూ.3 కోట్ల సాధారణ నిధులతో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించారు. పార్కు స్థలాన్ని కొల్లగొట్టి, అధికారం అడ్డం పెట్టుకుని.. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేపట్టారు. దుకాణాల కేటాయింపునకు వేలం పాట నిర్వహించకుండా వ్యాపారుల నుంచి రూ.లక్షలు దండుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
  • జగన్నాథపురంలోని ఒక మాజీ కార్పొరేటర్‌ ప్రాతినిధ్యం వహించిన డివిజన్‌లో ఇష్టానుసారంగా ఆలయాల నిర్మాణానికి సాధారణ నిధులు కేటాయించి, పనులు పూర్తి చేశారు. ఆ మాజీ కార్పొరేటర్‌ బినామీ గుత్తేదారు అవతారమెత్తి అధికార పార్టీ నేత అండదండలతో సాధారణ నిధులు కొల్లగొట్టారు.
  • నగర శివారు ప్రతాప్‌ నగర్‌లో ఎస్‌.అచ్యుతాపురం రైల్వేగేటు వద్ద ఆలయ సింహద్వారం నిర్మాణానికి రూ.8.50 లక్షల  సాధారణ నిధులు వెచ్చించారు.
  • సాధారణంగా ఎంపీ ల్యాడ్స్‌, సీఎండీఎఫ్‌, ప్రభుత్వ గ్రాంటుల నుంచి వివిధ వర్గాలకు సామాజిక భవనాలు నిర్మిస్తారు. నగరపాలక సంస్థ సాధారణ నిధులను వీటికి పెద్ద ఎత్తున కేటాయించేశారు. ఎన్నికలు కోడ్‌ రాకుండానే కొన్నింటిని ప్రారంభించారు. కొన్నింటికి శంకుస్థాపనలు చేశారు.
  • టీడీఆర్‌ బాండ్ల కుంభకోణానికి ఈ కాలంలోనే తెరతీశారు. స్థానిక ప్రజాప్రతినిధి చెప్పిందే వేదంగా స్థలాల కొనుగోలు దస్త్రం ఆమోదించేశారు. ఏకంగా రూ.500 కోట్ల విలువైన టీడీఆర్‌ బాండ్లను జారీ చేశారు. విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణం, పారిశుద్ధ్య నిర్వహణ కేంద్రాల ముసుగులో ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములను ఎక్కువ ధరకు కొన్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై ఒత్తిడి తెచ్చి భూముల మార్కెట్‌ విలువ పెంచేశారు. ఇంత జరుగుతున్నా.. ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా.. పట్టించుకునే నాథుడే లేడు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని