logo

బస్తా సిమెంట్‌కే దిక్కులేదు.. వీళ్లా ఊళ్లు నిర్మించేది..!

జగనన్న కాలనీల్లో లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి 100 బస్తాల సిమెంటు అందిస్తున్నారు. దీన్ని పునాధి స్థాయిలో 30 బస్తాలు, తర్వాత కట్టుబడికి 20.. ఇలా ప్లాస్టరింగ్‌ పూర్తి చేసే సమయానికి పూర్తిగా అందించాలి.

Updated : 15 Apr 2024 09:20 IST

రెండు నెలలుగా నిలిచిన సరఫరా
పాలకుల తీరుపై లబ్ధిదారుల ఆగ్రహం

పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. నవరత్న పథకాల్లో భాగంగా అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తాం.. అందుకోసం పెద్ద ఎత్తున భూమి సేకరించి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాం. కాలనీలు కాదు.. ఏకంగా ఊళ్లు నిర్మిస్తున్నాం. దీనికి అన్నిరకాలుగా సాయం అందిస్తున్నాం..’

ఇవి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సభల్లో చెప్పే మాటలు..

సెంటున్నర భూమిలో ఇల్లు నిర్మించుకోవాలంటే ప్రస్తుతం రూ.7.5 లక్షలు ఖర్చవుతోంది. ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలు పునాధి స్థాయికి మాత్రమే  వస్తున్నాయి. తర్వాత అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకోవాల్సిన పరిస్థితి. రెండు నెలల క్రితమే ఇంటి నిర్మాణం పైకప్పు స్థాయి వరకు వచ్చింది.. శ్లాబు వేద్ధామంటే సిమెంటు లేదు. త్వరలో వస్తుందని అధికారులు చెబుతున్నారు. అన్నీ సక్రమంగా సరఫరా చేస్తే ఏదోలా అప్పోసొప్పో చేసి ఇళ్లు కట్టుకుంటాం..

ఐ.పోలవరం మండలంలో ఓ లబ్ధిదారుడి ఆవేదన..

ముమ్మిడివరంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం ఇలా..

న్యూస్‌టుడే, ముమ్మిడివరం: జగనన్న కాలనీల్లో లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి 100 బస్తాల సిమెంటు అందిస్తున్నారు. దీన్ని పునాధి స్థాయిలో 30 బస్తాలు, తర్వాత కట్టుబడికి 20.. ఇలా ప్లాస్టరింగ్‌ పూర్తి చేసే సమయానికి పూర్తిగా అందించాలి. అయితే గత రెండు నెలలుగా గృహ నిర్మాణశాఖ గోదాముల్లో సిమెంటు నిల్వలు నిండుకోవడంతో లబ్ధిదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. గృహ నిర్మాణ లబ్ధిదారులకు సిమెంటు బస్తా రూ.267లకు అందిస్తుండగా.. బయట మార్కెట్‌లో రూ.300 నుంచి రూ.320 వరకు ధర పలుకుతోంది. సిమెంటు సరఫరా నిలిచిపోవడంతో లబ్ధిదారులు.. ప్రైవేటు మార్కెట్‌లో బస్తాకు రూ.50 వరకు అదనంగా చెల్లించి కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అసలే ప్రభుత్వం ఇచ్చే అరకొర సాయం సరిపోక అప్పులపాలవుతుంటే.. సిమెంటు సరఫరా లేక లబ్ధిదారులపై అదనపు భారం పడుతోంది.

ముమ్మిడివరం నగర పంచాయతీ, గ్రామీణ మండలంలో 1,605 ఇళ్లు మంజూరు కాగా.. 643 గృహాలు పునాధి నుంచి స్లాబుస్థాయి వరకు ఉన్నాయి. వీటి నిర్మాణానికి లబ్ధిదారులు సిమెంటు కోసం ఎదురు చూస్తున్నారు. రెండు నెలలుగా గోదాములు ఖాళీ అవడంతో లబ్ధిదారులు సిమెంటు కోసం వచ్చి వెళ్తున్నారు. మండలంలో 108 మెట్రిక్‌ టన్నుల సిమెంటు అవసరమని అధికారులు ఇండెంట్‌ పెట్టి రెండు నెలలు గడుస్తున్నా.. నేటికీ రాలేదు. ఇలా అయితే ఇళ్ల నిర్మాణం ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు.

ఎందుకీ పరిస్థితి..

జిల్లాలో గృహ నిర్మాణాలకు సంబంధిత అధికారులు 1,950 మెట్రిక్‌ టన్నుల వరకు సిమెంటు అవసరమని ఇండెంట్‌ పెట్టారు. అయితే రెండు నెలలుగా సరఫరా నిలిచిపోవడంతో గృహ నిర్మాణశాఖ కార్యాలయాలకు వచ్చే లబ్ధిదారులకు సమాధానం చెప్పలేక వారు తలలు పట్టుకుంటున్నారు. సిమెంటు కంపెనీలకు నిధులు చెల్లించకపోవడంతో సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. సిమెంటు ఎప్పుడు వస్తుందనేది ఎవరికీ అంతుచిక్కక.. అంతిమంగా లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.

అంతా మాయ..

జిల్లాలో 320 లేఔ ట్లలో 56 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. వీటిలో తొలి విడతగా 25,038 ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో 5,500 ఇళ్లు నిర్మాణం చేపట్టకపోవడంతో ఎన్నికల నేపధ్యంలో అవి రద్దయ్యాయి. మరో 27 వేల ఇళ్ల నిర్మాణానికి లేఔట్లలో  లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు. ఫేజ్‌-2లో వీటికి అవకాశం కల్పిస్తామని చెప్పి.. లోతట్టుగా ఉన్న వాటిని అభివృద్ధి చేయక.. ఇళ్ల నిర్మాణానికి అవకాశం లేకుండా చేశారు. ఇటీవల ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడడానికి ముందు లబ్ధిదారులను మభ్య పెట్టడానికి ఇచ్చిన ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ల పేరుతో కొత్త నాటకానికి తెరలేపి.. హడావుడిగా రిజిస్ట్రేషన్లు చేసి.. పాత పట్టాలనే కొత్తగా ఇచ్చినట్లు మాయ చేశారు. అయితే వీటిలో చాలా మందికి నేటికీ తమ ఇళ్ల స్థలాలు ఎక్కడ ఉన్నాయో అర్ధంకాని పరిస్థితి. ఇవి జగనన్న నవరత్నాల చిత్రాలు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని