logo

ఓటీఎస్‌ పేరిట వంచన.. మాయమాటలు చెప్పి రూ. కోట్లు గుంజుకున్న జగన్‌..!

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన ఐదేళ్ల కాలంగా పేదలకు గృహాలకు సంబంధించి ఒక్క పైసా రుణమివ్వక పోగా వారికి మాయమాటలు చెప్పి, వినక పోతే బెదిరింపులకు పాల్పడి వారి  వద్ద నుంచి ఓటీఎస్‌ పథకం పేరుతో రూ.కోట్లు దండుకున్నారు.

Updated : 16 Apr 2024 08:30 IST

జిల్లాలో ఓటీఎస్‌ పథకానికి అర్హులు: 1,14,697
సొమ్ములు చెల్లించేందుకు ముందుకు వచ్చినవారు: 47,834
మొత్తం సొమ్ము వసూలు లక్ష్యం ఫ రూ.48.34 కోట్లు
వసూలు చేసిన మొత్తంఫ రూ.14.56 కోట్లు

అమలాపురం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన ఐదేళ్ల కాలంగా పేదలకు గృహాలకు సంబంధించి ఒక్క పైసా రుణమివ్వక పోగా వారికి మాయమాటలు చెప్పి, వినక పోతే బెదిరింపులకు పాల్పడి వారి  వద్ద నుంచి ఓటీఎస్‌ పథకం పేరుతో రూ.కోట్లు దండుకున్నారు. గతంలో ఎప్పుడో దశాబ్ధాల క్రితం తీసుకున్న ఇంటి రుణాల నుంచి విముక్తి కల్పిస్తామని చెప్పి తమకు వైకాపా ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోనీ సొమ్ములు చెల్లించిన  వారికి అయినా పూర్తిగా రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇచ్చారా అంటే అదీలేదు. కేవలం దనార్జనే ధ్యేయంగా ఈ  పథకం ప్రవేశ పెట్టిందని విపక్షాల సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఒక్క రుణం కూడా ఇవ్వలేదు

2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మించుకుందామనుకున్న వారికి ఒక్క రుణం కూడా ఇవ్వలేదు. గ్రామాల్లో జగనన్న లేఔట్లలో ఇళ్లు కాదు ఊళ్లను ఏర్పాటు చేస్తున్నామని గొప్పలు చెప్పి లబ్ధిదారులను ఎంపిక చేసి గ్రామాల్లో రెండు సెంట్లు, పట్టణాల్లో సెంటున్నర చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వాటిలోనే ఇళ్లు నిర్మించుకోవాలని నిబంధన విధించారు. ఇవి గ్రామాలకు శివారు ప్రాంతాల్లో ఉండటం, ప్రభుత్వం ఇచ్చిన లేఔట్లలో ఏవిధమైన మౌలిక వసతులు లేక పోవడంతో అనేక మంది ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వం పట్టాదారులను బెదిరించి మరీ ఇక్కడ నిర్మాణాలను ప్రారంభించేలా చేశారు. నిర్మాణ వ్యయం పెరగడంతో అనేక ఇళ్లు మధ్యలోనే నిలిచి మొండి గోడలతో దర్శనం ఇస్తున్నాయి. వీరందరి పేర్లు గృహ నిర్మాణ శాఖ పరిధిలో రుణ గ్రస్తులుగా నమోదై ఉంటాయి. వీరికి మళ్లీ రుణం మంజూరు అయ్యే పరిస్థితి లేదు. దీంతో ఇక తమకు సొంతింటి నిర్మాణం కళగానే మిగిలిపోతుందేమోనని ఈ లబ్ధిదారులు వాపోతున్నారు.

నమ్మించి మోసం

జిల్లా వ్యాప్తంగా గృహ నిర్మాణ శాఖ ద్వారా 1983 నుంచి 2011 వరకు రుణాలు తీసుకుని నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించి ఎంత మేర రుణం ఉన్నా ప్రభుత్వం నిర్ధేశించిన సొమ్ము కడితే పూర్తిగా మాఫీ చేసేలా ఓటీఎస్‌ (వన్‌టైం సెటిల్‌మెంట్‌)పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది వైకాపా ప్రభుత్వం. దీనిలో భాగంగా గ్రామాల్లో రూ.10వేలు, పురపాలికల్లో రూ.15 వేలు, కార్పొరేషన్‌ పరిధిలో రూ.20వేల చొప్పున సొమ్ములు చెల్లిస్తే శాశ్వత రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని నమ్మబలికారు. వారు అనుకున్న లక్ష్యం మేరకు ఖజానా నిండటంతో ఈ పథకాన్ని అర్ధంతరంగా నిలుపుదల చేశారు.

తిరస్కరిస్తున్న బ్యాంకులు

ఈ పథకంలో సొమ్ములు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే వచ్చే పత్రాలను ఏబ్యాంకుకు తీసుకెళ్లినా క్షణాల్లో రుణాలు ఇస్తారని, ఇతరులకు కూడా అమ్ముకోవచ్చన్నారు. కానుక కింద రిజస్ట్రేషన్‌ చేసే వెసులుబాటు ఉంటుందంటూ వైకాపా ప్రజాప్రతినిధులు ఊదరగొట్టారు. ఇది నిజమని నమ్మి డబ్బులు చెల్లించి పత్రాలు పొందిన వారు బ్యాంకులకు ఓటీఎస్‌ పత్రాలను తీసుకెళుతుంటే ఇవి ఎందుకూ పనికి రావని, వీటిపై రుణాలు మంజూరు చేయలేమని బ్యాంకు అధికారులు తిరస్కరిస్తున్నారు. దీంతో సొమ్ములు చెల్లించిన పేదలు జగన్‌మాటలు నమ్మి మోసపోయామంటూ బాధపడుతున్నారు. .

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని