logo

అంతన్నావ్‌.. ఇంతన్నావ్‌.. రేషన్‌ సరకులు ఎగ్గొట్టావ్‌!

రేషన్‌ సరకుల విషయంలో జగన్‌ సర్కార్‌ మాట తప్పింది.. మడం తిప్పింది. పేదలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా తొమ్మిది రకాల సరకులు రాయితీపై అందిస్తామని చెప్పి ఎగనామం పెట్టింది.

Published : 16 Apr 2024 04:23 IST

జగన్‌ సర్కార్‌లో పేదలకు దగా
ఇచ్చేది రెండు.. కందిపప్పునకూ ఎగనామం
న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్‌

2014 సంవత్సరానికి ముందు రేషన్‌ దుకాణంలో బియ్యంతో పాటు పంచదార, కిరోసిన్‌, కందిపప్పు, వంటనూనె, గోధుమపిండి, కారం, ఉప్పు, పసుపు పంపిణీ చేసేవారు. చంద్రబాబు పాలనలో ఎన్ని ఇస్తున్నారు? ఇదీ ప్రజా సంకల్ప యాత్రలో జగన్‌ ప్రశ్న.


2019.. అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రజాపంపిణీ వ్యవస్థను పూర్తిగా భ్రష్టుపట్టించారు. అయిదేళ్ల వైకాపా పాలనలో బహిరంగ మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. కందిపప్పు, వంటనూనె ధరలు పేద కుటుంబాలకు పెను భారంగా మారాయి. జగన్‌ సర్కార్‌ రేషన్‌ దుకాణాల ద్వారా పల్లెలకు కేవలం రెండే సరకులు ఇస్తోంది. పట్టణ ప్రాంతాలకు కొంత కాలంగా గోధుమ పిండిని సరఫరా చేస్తున్నారు.

రేషన్‌ సరకుల విషయంలో జగన్‌ సర్కార్‌ మాట తప్పింది.. మడం తిప్పింది. పేదలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా తొమ్మిది రకాల సరకులు రాయితీపై అందిస్తామని చెప్పి ఎగనామం పెట్టింది. కేవలం బియ్యం, పంచదార మాత్రమే చౌక దుకాణాల ద్వారా ఎండీయూ వాహనాలతో పంపిణీ చేస్తోంది. కందిపప్పును గత కొద్ది నెలలుగా పంపిణీ చేయడమే మానేసింది. పంపిణీ వాహనాలు ఇంటింటికీ వస్తాయా అంటే అదీ లేదు.


ఇంటింటికీ రేషన్‌ వట్టిమాటే!

వైకాపా అధికారంలోకి వచ్చాక.. ఇంటింటికీ రేషన్‌ పేరుతో ఎండీయూ వాహనాలను కేటాయించింది. ఒక్కో వాహనాన్ని రూ.8 లక్షలకు కొనుగోలు చేశారు. ఇలా ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.90 కోట్లను వాహనాల కొనుగోలు పేరుతో ఖర్చుచేశారు. ఇంటింటికీ రేషన్‌ ఇప్పటికీ పలుచోట్ల ఇవ్వడం లేదు. వీధుల్లో వాహనాలు పెట్టి సరకులు విక్రయిస్తున్నారు. చౌక దుకాణాల వద్ద గత ప్రభుత్వ హయాంలో ప్రతినెలా 95 శాతం కార్డుదారులకు సరకుల పంపిణీ జరిగేది. ఎండీయూ వాహనాలు వచ్చాక.. ప్రతినెలా 90 శాతానికి మించి సరకుల బట్వాడా జరగడం లేదు. కేవలం వైకాపా కార్యకర్తల కోసం ఎండీయూ వాహనాల వ్యవస్థను తెచ్చారనే ఆరోపణలున్నాయి.


రూ.40 కందిపప్పును రూ.67 చేశారు

మ్మడి జిల్లాలో కార్డుదారుకు రాయితీ కందిపప్పు 11 నెలలుగా సక్రమంగా పంపిణీ చేయడం లేదు. వాస్తవంగా 2019 వరకు చౌక దుకాణాల్లో రాయితీపై కందిపప్పు కిలో రూ.40 చొప్పున కార్డుకు రెండు కిలోలు ఇచ్చేవారు. వైకాపా అధికారంలోకి వచ్చాక.. ధర కిలో రూ.67కు పెంచేశారు. రెండు కిలోల బదులు కిలో ఇవ్వడం మొదలు పెట్టారు. ఇప్పుడదీ ఇవ్వడం లేదు. దీంతో పేదలు అధిక ధరలకు బయట కొనుగోలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.


పేదలపై రూ.210 కోట్ల భారం

మ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 17,76,533 బియ్యం కార్డులున్నాయి. ఒక కార్డుకు కిలో చొప్పున సరఫరా చేస్తే నెలకు 1,776 టన్నుల కందిపప్పు అవసరం. ప్రభుత్వం కిలో కందిపప్పు రూ.67కు పంపిణీ  చేసేది. సరఫరా లేకపోవడంతో పేదలు బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.180 చొప్పున కొనుగోలు చేసేందుకు అవస్థలు పడుతున్నారు. చౌక దుకాణంలో ఇచ్చే ధరతో పోల్చితే కిలోకు రూ.113 అదనం. గత 11 నెలల వ్యవధిలో ప్రభుత్వం సక్రమంగా సరఫరా చేయకపోవడంతో ఉమ్మడి జిల్లాలో బియ్యం కార్డుదారులైన పేదలపై రూ.210 కోట్ల భారం పడింది.


ప్రభుత్వానికి మిగులు రూ.240 కోట్లు

మ్మడి జిల్లాలో 1,129 ఎండీయూ వాహనాల పరిధిలో 2,856 చౌక దుకాణాలున్నాయి. నెలకు 1,776 టన్నుల కందిపప్పు అవసరంగా కాగా.. 11 నెలల వ్యవధిలో 19,536 టన్నుల సరఫరా చేయాల్సి ఉండగా.. కేవలం 2,410 టన్నులు మాత్రమే కార్డుదారులకు అందించారు. 17,126 టన్నులు పేదలకు చేరలేదు. ఇలా రూ.240 కోట్లు ప్రభుత్వం మిగుల్చుకుంది. ఈ ఏడాది నాలుగు నెలలు కందిపప్పు పంపిణీ మాటేలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని