logo

ఉద్యోగుల ఉసురు తగలదా.. జగన్‌..

నిరుద్యోగులతోనే కాదు.. ఉద్యోగులతోనూ జగన్‌ ప్రభుత్వం చెలాగాటమాడుతోంది. గత ఎన్నికల ముందు ఉద్యోగులు, నిరుద్యోగలకు ఎన్నో హామీలు ఇచ్చింది. వారి ఓట్లను గంపగుత్తగా వేయించుకుంది. తీరా అధికారంలోకి వచ్చాక హామీలను పెడచెవిన పెట్టింది.

Updated : 22 Apr 2024 06:54 IST

న్యూస్‌టుడే, కాకినాడ నగరం

నిరుద్యోగులతోనే కాదు.. ఉద్యోగులతోనూ జగన్‌ ప్రభుత్వం చెలాగాటమాడుతోంది. గత ఎన్నికల ముందు ఉద్యోగులు, నిరుద్యోగలకు ఎన్నో హామీలు ఇచ్చింది. వారి ఓట్లను గంపగుత్తగా వేయించుకుంది. తీరా అధికారంలోకి వచ్చాక హామీలను పెడచెవిన పెట్టింది. సీపీఎస్‌ రద్దుపైనా మాట తప్పింది. వారికి చెల్లించవలసిన ప్రయోజనాలపైనా మాట ఇచ్చి మోసం చేసింది. రోజుల్లో పరిష్కరిస్తానని చెప్పి.. ఏళ్లు గడుస్తున్నా.. పరిష్కారం లేదు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు మండిపడుతున్నాయి. నమ్మించి మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్‌కు తమ ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెడుతున్నారు.


అదనం కాదు.. హక్కులకూ దిక్కులేదు..

వివిధ సమస్యలపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ తలపెట్టిన నిరసన కార్యక్రమం (పాత చిత్రం)

ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా రెండు డీఏలు చెల్లించాల్సి ఉంది. ఆరు నెలలకు ఒక డీఏ చొప్పున ఇవ్వాలి.  ఈ డీఏలను చెల్లించడంలో జగన్‌ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది. కొన్నాళ్ల క్రితం వరకు ఉద్యోగులకు 4 నెలల డీఏ బకాయిలున్నాయి. ఎన్నికలు సమీపించడంతో హడావుడిగా రెండు డీఏ బకాయిల చెల్లింపునకు ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో ఒక డీఏ వచ్చే నెల జీతంతో కలిపి రానుంది. మిగతాది ఈ ఏడాది ఆగస్టులో జమ అయ్యేలా ఉత్తర్వులు ఇచ్చారు. తన పదవీ కాలం తర్వాత వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులను మభ్యపెడుతూ రెండు డీఏలను తానే చెల్లించేస్తున్నట్లుగా ముందస్తు ఉత్తర్వులు జారీ చేశారు. మరో రెండు డీఏ బకాయిలు అలాగే ఉండిపోయాయి. నెలనెలా జీతాలు ఇవ్వలేని స్థితి ఉండటంతో ఉద్యోగులు ఆ రెండు డీఏలపై ఆశలు వదలుకున్నారు.


ఉద్యోగులకు నవరత్నాలివే..

నిరసనలో భాగంగా ఎద్దుకు వినతిపత్రం అందజేస్తున్న అంగన్‌వాడీ సిబ్బంది

వైకాపా గత ఎన్నికలకు ముందు పేదల ఓట్ల కోసం నవరత్న పథకాలను ప్రకటించింది. పింఛన్లు, ఇళ్ల స్థలాలు, వైఎస్‌ఆర్‌ ఆసరా, భరోసా వంటి 9 పథకాలకు నవరత్నాలని పేర్లు చెప్పి వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. ఆ ఉద్యోగులకూ పలు హామీలు ఇచ్చింది. అయితే వారికి నవరత్నాలు అమలుకు బదులు నవ సమస్యలతో వేస్తోంది.

  • వైద్యబీమా పేరుతో ఉద్యోగుల నుంచి సొమ్ములు జమ చేసుకుని వాటిని ఆసుపత్రులకు చెల్లించడం లేదు. దీంతో ఉద్యోగులకు ఆసుపత్రుల్లో వైద్యం అందడం లేదు. మెడికల్‌ రీఎంబర్స్‌మెంట్‌కు కొర్రీలపై కొర్రీలు వేసి ఇబ్బంది పెడుతున్నారు.
  • సరెండర్‌ లీవులకు మూడేళ్లుగా బిల్లులు చెల్లించడం లేదు. బిల్లులకు గ్రీన్‌ ఛానెల్‌లో బూజుపట్టి మోక్షం లభించడం లేదు.
  • నాలుగేళ్లుగా ఒక్క డీఏను సక్రమంగా చెల్లించలేదు. పీఆర్‌సీ బకాయిలదీ అదే తీరు. ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్‌ను తగ్గించిన ఘనత ఈ ప్రభుత్వానిదే.
  • సీపీఎస్‌ను రద్దు చేయలేదు.. ఇందుకోసం ఉద్యోగుల వేతనాల నుంచి కేటాయిస్తున్న 10 శాతం సొమ్ము సైతం ఖాతాల్లో పడటం లేదు. ప్రభుత్వమూ తన వాటాను జమ చేయడం లేదు.
  • ఏపీజీఎల్‌ఐ, జీపీఎఫ్‌ బకాయిలు చెల్లించడం లేదు. దాచుకున్న సొమ్మును తిరిగి ఇవ్వడం లేదు. దీంతో పిల్లల చదువుల, పెళ్లిళ్లు, గృహ నిర్మాణం, తదితర ఖర్చుల కోసం ఉద్యోగులు ప్రైవేటు రుణాలపై ఆధారపడాల్సి వస్తోంది.
  • పింఛనర్లకు ఒకటో తేదీ నాటికి సొమ్ము అందడం లేదు. అప్పులు చేసి బతకాల్సి వస్తోంది. అదనపు క్వాంటమ్‌ను దెబ్బతీశారని వారు వాపోతున్నారు.
  • అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఎస్‌ఎస్‌ఏ కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదు. కనీస వేతనాలు లేవు. వేతనాల కోసం నిరసనలకు దిగితే ఎస్మా ద్వారా బెదిరిస్తున్నారు.
  • కొత్తగా ఉద్యోగ విరమణ చేసే వారికి వివిధ ఆర్థిక ప్రయోజనాలను నాలుగేళ్ల తర్వాత చెల్లిస్తామంటున్నారు.
  • ఉపాధ్యాయులకు అప్రంటీస్‌ విధానాన్ని పదేళ్ల క్రితం రద్దు చేశారు. దాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. ఇది కొత్త ఉద్యోగులకు ఆందోళన కలిగిస్తోంది.

జిల్లాలో పాఠశాలలు: 1269
ఉపాధ్యా యులు: 6 వేల మంది
ఇతర శాఖలకు చెందిన ఉద్యోగులు: 6 వేల మంది


ఇదేనా ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు
-మోర్త శ్రీనివాస్‌, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ

ఉద్యోగ, ఉపాధ్యాయులకు డీఏ బకాయిలు ఉంచడం తగదు. గత ఏడాది డీఏ బకాయిల చెల్లింపునకు మాత్రమే చర్యలు తీసుకున్నారు. అదీ ఒక డీఏ మాత్రమే మేలో జమ అవుతుంది. మిగతా ఆగస్టులో ఇస్తామని చెప్పారు. ఇది ఉద్యోగులను మోసం చేయడమే. ఇప్పటికే పీఆర్‌సీ పెండింగ్‌లో ఉంది. కష్టపడి పనిచేస్తోన్న ఉద్యోగులకు ఇదేనా ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని