logo

Guntur: సీనియర్‌ ఆచార్యుడిపై సహాయాచార్యుడి దాడి.. గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరిక

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సీనియర్‌ ఆచార్యులు అశోక్‌కుమార్‌పై అంబేడ్కర్‌ అధ్యయన కేంద్రంలో సహాయాచార్యుడిగా పనిచేస్తున్న డాక్టర్‌ అబ్రహం లింకన్‌ దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై శుక్రవారం అశోక్‌కుమార్‌ భార్య ఉపకులపతి రాజశేఖర్‌కు ఫిర్యాదు చేశారు.

Updated : 25 May 2024 08:39 IST

బాధితుడు ఆచార్య అశోక్‌కుమార్‌ 

ఎ.ఎన్‌.యు, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సీనియర్‌ ఆచార్యులు అశోక్‌కుమార్‌పై అంబేడ్కర్‌ అధ్యయన కేంద్రంలో సహాయాచార్యుడిగా పనిచేస్తున్న డాక్టర్‌ అబ్రహం లింకన్‌ దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై శుక్రవారం అశోక్‌కుమార్‌ భార్య ఉపకులపతి రాజశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. అబ్రహాం లింకన్‌ ఓ ప్రాజెక్టుపై అంబేడ్కర్‌ అధ్యయన కేంద్రంలో ఐదేళ్లు పనిచేసేందుకు విశ్వవిద్యాలయానికి వచ్చారు. విశ్వవిద్యాలయంలో ఓ కీలక అధికారికి బంధువు కావడంతో నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు ఏకంగా అంబేడ్కర్‌ అధ్యయన కేంద్రంలో పదవి కట్టబెట్టారు. అప్పట్నుంచి ఆయన ఆడిందే ఆటగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఐదేళ్ల ప్రాజెక్టు కోసం ఏఎన్‌యూకి వచ్చిన లింకన్‌కు జీతభత్యాలను సామాజిక న్యాయశాఖ ఇస్తోంది. గత కొంతకాలంగా తనకు జీతం రావడంలేదని, దిల్లీకి వెళ్లి వచ్చేందుకు కొంత నగదు ఇవ్వాలని అశోక్‌కుమార్‌ను అడుగగా..తాను ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న లింకన్‌ బుధవారం మళ్లీ ఆయన్ని గట్టిగా అడుగగా వ్యక్తిగత పనుల కోసం దిల్లీ వెళ్లేందుకు తాను ఎందుకు ఇవ్వాలని చెప్పగా దాడికి పాల్పడ్డారు. ఛాతిపై బలంగా కొట్టడంతో అశోక్‌కుమార్‌ కిందపడిపోయారు. గురువారం స్వల్ప గుండెపోటు రావడంతో ఆయన్ని కుటుంబసభ్యులు మణిపాల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు స్టెంట్స్‌ వేయాలని సూచించారు. శనివారం ఆయనకు స్టెంట్స్‌ వేసే అవకాశముందని కుటుంబసభ్యులు తెలిపారు. 

వివాదాలకు నిలయంగా అంబేడ్కర్‌ అధ్యయన కేంద్రం: అంబేడ్కర్‌పై వివిధ అంశాలపై పరిశోధనలు చేసేందుకు ఏఎన్‌యూలో అధ్యయన కేంద్రం ఏర్పాటు చేశారు. గతేడాది ఉత్తమ కేంద్రంగా తీర్చిదిద్దినందుకు అశోక్‌కుమార్‌ను సామాజిక న్యాయశాఖ అవార్డుతో సత్కరించింది. అలాంటి అధ్యయన కేంద్రంలో ఉన్నతాధికారుల పెత్తనం కొనసాగుతోంది. కొంత మంది అధికారులు వాళ్లకు అనుకూలంగా ఉన్న వారిని అందులో నియమించుకున్నారు. గతేడాది ఈ కేంద్రంలో దినసరి ఉద్యోగిగా పనిచేస్తున్న అబ్రహం వీసీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న నిన్ను చంపుతానని ఉపరిజిస్ట్రార్‌ యోబును వాట్సప్‌ కాల్‌లో  బెదిరించారు. ఈ ఘటనపై ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. పైగా యోబుకే షోకాజు నోటీసు జారీ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కలుగజేసుకొని అబ్రహం లింకన్‌ను కఠినంగా శిక్షించాలని తోటి అధ్యాపకులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని