logo

అరాచక రాజ్యం.. జనం ఆగమాగం : పిన్నెల్లిని సామాన్యులు నిలదీసిన వైనంపై చర్చ

పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులు సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు బూత్‌లు అధీనంలోకి తీసుకోవడం, ఈవీఎంలు ధ్వంసం చేయడం, గ్రామాల్లో ప్రతిపక్షాలపై విచక్షణ రహితంగా దాడులు చేయడం, తెదేపా నేతల వాహనాలు, ఆస్తులు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు బయట ప్రపంచానికి తెలియడంతో పల్నాడుపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

Updated : 24 May 2024 07:52 IST

 జిల్లాలోని ఘటనలపై సర్వత్రా  ఆందోళన
ఈనాడు, నరసరావుపేట

నరసరావుపేటలో తెదేపా కార్యకర్తలపై ఎమ్మెల్యే గోపిరెడ్డి అనుచరుల దాడి

పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులు సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు బూత్‌లు అధీనంలోకి తీసుకోవడం, ఈవీఎంలు ధ్వంసం చేయడం, గ్రామాల్లో ప్రతిపక్షాలపై విచక్షణ రహితంగా దాడులు చేయడం, తెదేపా నేతల వాహనాలు, ఆస్తులు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు బయట ప్రపంచానికి తెలియడంతో పల్నాడుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయిగేటు గ్రామంలో ఈవీఎం ధ్వంసం చేస్తున్న వీడియో బహిర్గతం కావడంతో ఆయనపై కేసు నమోదైంది. దీంతో అరెస్టు చేస్తారని అజ్ఞాతంలోకి వెళ్లి పరారీలో ఉన్నారు. ఈనేపథ్యంలో మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్‌రోజు వివిధ పోలింగ్‌ కేంద్రాల పరిధిలో పిన్నెల్లి సోదరులు, వారి అనుచరులు తెదేపా ఏజెంట్లు, కార్యకర్తలపై దాడులు చేసిన దృశ్యాలతో కూడిన వీడియోలు సామాజికమాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. వీటిని చూసిన ప్రజలు అసలు పల్నాడులో ఇంత అరాచకం జరుగుతోందా? ప్రజలు స్వేచ్ఛగా వారి ఓటును కూడా వినియోగించుకోలేని పరిస్థితులు ఉన్నాయా? స్వయంగా ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేస్తే అధికారులు, పోలీసులు ఫిర్యాదు ఇవ్వలేకపోయారా? ఇంతటి ఘోరమైన పరిస్థితులు పల్నాడులో ఉన్నాయా? అన్న చర్చ తెరపైకి వచ్చింది. వీడియోల్లో వైకాపా మూకల అరాచకాలను చూసిన ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వారి అభిప్రాయాలు పంచుకుంటున్నారు. మాచర్ల నియోజకవర్గంలోనే కాకుండా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో పట్టణ నడిబొడ్డున పోలింగ్‌ కేంద్రం ఎదుట తెదేపా అభ్యర్థి చదలవాడ అరవిందబాబు వాహనాలను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైకాపా కార్యకర్తలు ధ్వంసం చేయడం, తెదేపా కార్యకర్తలను నడిరోడ్డుపై తరుముతూ దాడిచేసి ఓటర్లను తీవ్ర భయాందోళనకు గురిచేసిన వీడియో ఒకటి గురువారం వెలుగులోకి వచ్చింది. 20ఏళ్ల కిందట ఫ్యాక్షన్‌ గొడవలు చూసిన నరసరావుపేట పట్టణవాసులు మళ్లీ అలాంటి గొడవలు చోటుచేసుకోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పోలింగ్‌ ముగిసినా కొనసాగుతున్న ఉత్కంఠ

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో అన్ని జిల్లాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు వివిధ ప్రాంతాల పర్యటనకు వెళ్లి ఉపశమనం పొందుతున్నారు. ఇందుకు భిన్నంగా పల్నాడు జిల్లాలో ఏరోజు ఏ గ్రామంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. పోలింగ్‌ తర్వాత చోటుచేసుకున్న ఘర్షణలతో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. దీనివల్ల వ్యాపారులు, ఇతర వర్గాలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం పోలీసుల పహారా, పెట్రోలింగ్‌తో ప్రస్తుతానికి శాంతిభద్రతలు అదుపులో ఉన్నా ఎన్నాళ్లీ పరిస్థితి అన్న ఆందోళన పల్నాడు ప్రజల్లో నెలకొంది. పోలింగ్‌రోజు, మరుసటిరోజు పలు గ్రామాల్లో గొడవలు జరగడం, ఇరువర్గాలు దాడులు చేసుకోవడంతో వందలమందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో కొందరిని అరెస్టు చేసి జైలుకు పంపారు. కొందరు గ్రామాలు వదిలి పరారీలో ఉన్నారు. కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ఎన్నికల వేళ జరిగిన గొడవలు వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.


తెగబడి... తిరగబడి..

వెల్దుర్తి మండలంలో కొత్తపుల్లారెడ్డిగూడెంలో వైకాపా మూకల హల్‌చల్‌ 

మాచర్ల నియోజకవర్గంలో నాలుగు పర్యాయాలుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో వైకాపా అధికారంలోకి రాగానే నియోజకవర్గాన్ని పిన్నెల్లి సోదరులు గుప్పెట్లో పెట్టుకుని అధికారాన్ని మరింతగా చెలాయించారు. వీరికి అడ్డుచెప్పేవారు లేకపోవడం, ప్రతిపక్షం తరఫున సమర్ధుడైన నాయకుడు లేకపోవడంతో రెచ్చిపోయారు. అధికార యంత్రాంగం పూర్తిగా వారి కనుసన్నల్లో పనిచేయడంతో ఏంచెబితే అది జరిగింది. రెండేళ్ల కిందట మాచర్ల తెదేపా ఇన్‌ఛార్జిగా జూలకంటి బ్రహ్మారెడ్డి రావడంతో తెదేపా శ్రేణులు ఒక్కతాటిపైకి వచ్చాయి. రెండేళ్లలో అటు పోలీసులు, ఇటు పిన్నెల్లి సోదరులు తెదేపా వారిని ఎన్నో ఇబ్బందులు పెట్టినా సహనంతో భరిస్తూ వచ్చారు. సార్వత్రిక ఎన్నికల వేళ వైకాపా అరాచకాలను అడ్డుకుని ఎదురొడ్డి అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో తెదేపా తరఫున ఏజెంట్లుగా కూర్చున్నారు. దీనిని జీర్ణించుకోలేని పిన్నెల్లి సోదరులు దాడులకు తెగబడ్డారు. ప్రజలు తిరగబడి ఓటుహక్కు వినియోగించుకోవడానికి కదలిరావడంతో వారిని అడ్డుకోలేకపోయారు. సామాన్య మహిళలు సైతం ఎమ్మెల్యే పిన్నెల్లిని నిలదీసి ప్రశ్నించారు. అన్నివర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో అసహనానికి గురైన పిన్నెల్లి సోదరులు గొడవకు దిగి పోలింగ్‌ శాతం తగ్గించాలని చూసిన పాచిక పారలేదు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వెలుగులోకి రావడంతో ప్రజలందరిలో చర్చ జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని