logo

రైతుకు గండెకోత

కృష్ణానదికి వరదతో కట్ట తెగి పంట భూములు కోతకు గురవుతున్నాయి. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములు కళ్ల ముందే నదిలో కలిసిపోతుండడంతో అన్నదాతలు పడుతున్న ఆవేదన వర్ణనాతీతం.

Published : 03 Feb 2023 05:25 IST

కృష్ణా కరకట్ట గండి పూడ్చేదెప్పుడూ?
నదిలో కలిసిపోతున్న పంట భూములు
ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, కొల్లూరు

అరవింద వారధికి ఎగువన నది వెంబడి పడిన గండి విస్తరించిన దృశ్యం

కృష్ణానదికి వరదతో కట్ట తెగి పంట భూములు కోతకు గురవుతున్నాయి. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములు కళ్ల ముందే నదిలో కలిసిపోతుండడంతో అన్నదాతలు పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. కట్ట బలహీనపడి ఏటా కొంతభూమి కోతకు గురై నదిలో కలిసిపోతోంది. రూ.కోట్ల విలువైన భూములు కోల్పోతున్న కర్షకులు నిస్సహాయ స్థితిలో మిన్నకుండిపోతున్నారు. కట్ట బలోపేతం చేసి భూములు కోతకు గురికాకుండా చూడాలని సాగుదారులు చేస్తున్న వినతులు బుట్టదాఖలవుతున్నాయి. ఇదీ బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని ఆరవింద వారధి ఎగువ భాగంలో నది వెంబడి ఉన్న భూములు ఉన్న రైతుల దుస్థితి.

కొల్లూరు మండలంలో కృష్ణానది పాయ నుంచి లంక గ్రామాలను అనుసంధానం చేసే అరవింద వారధి ఎగువభాగంలో నాణ్యమైన మట్టి లభిస్తోంది. అరవింద వారధికి ఎగువన సహజ సిద్ధంగా కట్టకు ఏర్పడిన గండి ద్వారా నది నుంచి నీరు ఒక పాయగా చీలి పెసర్లంక, ఆవులవారిపాలెం గ్రామాల మీదుగా పోతార్లంక శివారులో గాజుల్లంక వద్ద కృష్ణానది నుంచి చీలిన చినరేవులో కలుస్తుంది. మరోవైపు లంక భూముల నుంచి వర్షపు నీరు ఈ గండి నుంచి కృష్ణానదిలోకి వెళ్లడానికి వీలుగా గండి ఏర్పడింది. దీనిని ఆనుకుని ఇటుకల తయారీ కోసం కొన్నేళ్లుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఇటుకలకు డిమాండ్‌ పెరిగిన కొద్దీ ఇక్కడ మట్టి తవ్వకాలు పెరిగి కొందరు కట్టకు పక్కనే తవ్వకాలు చేయడంతో గండి బాగా విస్తరించింది. ఇక్కడి పొలాలను కొనుగోలు చేసిన ఇటుక వ్యాపారులు మట్టి ఎంత లోతు వరకు వస్తే అక్కడి వరకు తవ్వకాలు చేశారు. విద్యుత్తు స్తంభం కంటే లోతుకు ఇక్కడ తవ్వకాలు చేశారు. కట్టకు సమీపంలోనే అత్యంత లోతుకు తవ్వకాలు చేయడం వల్ల కట్ట బలహీనమై ఏటా గండి విస్తరిస్తోంది. నదికి వరద ఎక్కువగా ఉన్నప్పుడు గండి నుంచి భారీ స్థాయిలో నీరు వచ్చి పొలాలను కోతకు గురి చేస్తూ ప్రవహించడంతో భూములు కోతకు గురవుతున్నాయి. మరోవైపు కరకట్ట నుంచి లంక గ్రామాల్లోకి రాకపోకలు సైతం నిలిచిపోతున్నాయి. నదికి వరద సమయంలో నీటితో పాటు కొట్టుకొచ్చిన ఇసుక మేట వేసి ఈ ప్రాంతం ఎగుడుదిగుడుగా తయారైంది. ఏటికేడు గండి విస్తరించడంతో ఇటువైపు వచ్చే నీటి పరిమాణం పెరిగి లంక గ్రామాలకు సంకటంగా మారింది. ఈ నీరు పరిసర ప్రాంతాల్లోని ఇటుక బట్టీలను చుట్టుముట్టడంతో రూ.కోట్లలో నష్టం వాటిల్లుతోంది. గతేడాది వచ్చిన వరదకు ఇటుక బట్టీలతో పాటు పంట పొలాలు ముంపునకు గురై భారీ నష్టం వాటిల్లింది.

కట్ట కోతకు గురైన దృశ్యం


వరద వస్తే వణుకే..

కృష్ణానదికి 6 లక్షల క్యూసెక్కుల నీటి పరిమాణం దాటితే గండి నుంచి వచ్చే వరద నీటి ప్రవాహంతో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. దీంతో పాటు పంట పొలాలు కోతకు గురవుతున్నాయి. నది మధ్యలో ఉన్న భూములు అత్యంత సారవంతమై విలువైన వాణిజ్య పంటలకు నిలయంగా ఉన్నాయి. ఇక్కడ ఎకరం భూమి రూ.లక్షల ధర పలుకుతోంది. ఇక్కడ సాగు చేసేవారందరూ సన్న, చిన్నకారు రైతులే. అర ఎకరం, ఎకరం, రెండెకరాలలోపు భూములు ఉన్న రైతులు ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటి వారికి వరద వచ్చిన ప్రతిసారి పదిసెంట్ల నుంచి 20సెంట్ల వరకు భూమి కోతకు గురై నదిలో కలిసిపోవడంతో కొన్నాళ్లకు పూర్తిగా భూమి కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ సాగు చేసే కంద, అరటి, బొప్పాయి, పసుపు, తమలపాకులు, నిమ్మ ఇలా అత్యంత ఖరీదైన పంటలు ఉన్నాయి. ఇవి ముంపునకు గురైన ప్రతిసారి రైతులు రూ.కోట్ల విలువైన దిగుబడులు కోల్పోతున్నారు. ఇదే పరిస్థితి కొన్నాళ్లు కొనసాగితే తమ భూమి పూర్తిగా నదిలో కలిసిపోతుందన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. దీంతో కనిపించిన ప్రజాప్రతినిధులు, అధికారులకు తమ భూములు కాపాడాలని పదే పదే విన్నవిస్తున్నారు. వరద సమయంలో ప్రత్యక్షంగా రైతుల అవస్థలను చూసిన నేతలు, అధికారులు అప్పటికప్పుడు ఉపశమనం కలిగేలా హామీలు ఇవ్వడం మినహా ఇప్పటివరకు నిర్మాణాత్మకంగా చేపట్టిన చర్యలు శూన్యం. నేతల హామీలు నీటి మీద రాతల్లా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


పట్టాలెక్కని  ప్రణాళికలు

భవిష్యత్తులో గండి మరింత పెద్దది కాకుండా వరద సమయంలో భూములు కోతకు గురికాకుండా ఉండటానికి కృష్ణానది పరిరక్షణ విభాగం అధికారులు కొన్నేళ్లుగా ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. రక్షణ గోడ నిర్మించడం ద్వారా భూములు కాపాడాలని ప్రణాళికలు రూపొందించారు. తొలుత రూ.8.49 కోట్లతో అంచనాలు తయారు చేయగా ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి మోక్షం లభించలేదు. దీంతో ప్రస్తుతం రూ.10.44 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు పంపారు. వీటికి కూడా నిధులు విడుదల చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.


ప్రతిపాదనలు పంపాం
- కృష్ణారావు, కార్యనిర్వాహక ఇంజినీరు, కృష్ణానది పరిరక్షణ విభాగం

కొల్లూరు మండలంలో అరవింద వారధి ఎగువభాగంలో కట్టకు పడిన గండిని పరిశీలించాం. భూములు కోతకు గురికాకుండా శాశ్వత పరిష్కారం చూపడానికి ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని