logo

మిర్చికి ఘాటైన రేటు

జనవరి నుంచి మొదలైన ఈ ఏడాది మిర్చి సీజన్‌ ఆశాజనకంగా కొనసాగుతోంది. నల్లతామర పురుగు నేపథ్యంలో దిగుబడులపై స్పష్టత లేకపోవడంతో మార్కెట్‌కు వచ్చిన సరకును పోటీపడి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.

Published : 30 Mar 2023 05:28 IST

ఈనాడు-గుంటూరు

బస్తాలతో కిక్కిరిసిన గుంటూరు మిర్చి యార్డు

నవరి నుంచి మొదలైన ఈ ఏడాది మిర్చి సీజన్‌ ఆశాజనకంగా కొనసాగుతోంది. నల్లతామర పురుగు నేపథ్యంలో దిగుబడులపై స్పష్టత లేకపోవడంతో మార్కెట్‌కు వచ్చిన సరకును పోటీపడి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిస్థితి మార్చి మాసాంతం వరకు కొనసాగింది. నాణ్యమైన మిర్చికి ఎగుమతులు ఆశాజనకంగా ఉండటం, దేశీయంగా డిమాండ్‌తో రైతుకు మెరుగైన ధరలు లభిస్తున్నాయి. పచ్చళ్ల వ్యాపారులు, కారంపొడి తయారీదారుల నుంచి గిరాకీతో మంచి ధరలతోనే మార్కెట్‌ నడుస్తోంది. ఏటా జనవరి నుంచి మార్చి నెల వరకు ఎక్కువ సరకు యార్డుకు రావడంతో ధరలు తగ్గడం సాధారణం. అయితే ఇందుకు భిన్నంగా మెరుగైన ధరలతో సీజన్‌ కొనసాగుతోంది. ఏప్రిల్‌ నెలలోనూ ఏ మేరకు పంట మార్కెట్‌కు వస్తుందో అంచనాలు అందడం లేదు. పల్నాడు, ప్రకాశం, కర్నూలు జిల్లాల నుంచి కొంత సరకు నేరుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లడంతో గుంటూరు మార్కెట్‌కు ఆశించినంత సరకు రాలేదు. గత సంవత్సరాల్లో రోజుకు 2లక్షల బస్తాలు వచ్చిన సందర్భాలు చూడగా, ఈ ఏడాది ఒక్కరోజు కూడా ఆ పరిస్థితి కనిపించలేదు. ఏటా కంటే శీతల గోదాముల్లో నిల్వచేసే వారి సంఖ్య తగ్గి అందరూ నేరుగా మార్కెట్‌కు తీసుకురావడంతో ఊహించిన మేరకు సరకు వచ్చింది. ప్రత్యేక రకమైన బాడిగ రకానికి సీజన్‌ ఆరంభం నుంచి మంచి ధరలు దక్కుతున్నాయి. క్వింటా రూ.20వేల నుంచి రూ.29వేల వరకు రైతులకు లభించింది. సాధారణ రకమైన 341 మిర్చికి కూడా ఇదే మాదిరిగా గిరాకీ కొనసాగింది. తేజ రకం ఎప్పుడూ మిగిలిన రకాల కంటే అధిక ధర పలికేది. అయితే ఈ సీజన్‌లో తేజ రకం ఎగుమతులు ప్రారంభంలో ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మిగిలిన రకాలతో పోల్చితే కొంత తగ్గినా క్వింటాకు రూ.24 వేల ధర లభించడం కలిసొచ్చింది.

శీతల గోదాములకు తగ్గిన మిర్చి

గుంటూరు మిర్చియార్డుకు జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు ఎంత సరకు వచ్చినా ధరలు తగ్గకపోగా కొంత పెరుగుతుండటంతో రైతులు అమ్ముకోవడానికే మొగ్గుచూపారు. దీంతో శీతల గోదాముల్లో నిల్వ చేసే రైతుల సంఖ్య బాగా తగ్గింది. ఏటా మార్చి నెలాఖరు వరకు శీతల గోదాములకు 75లక్షల టిక్కీల వరకు వస్తుండగా, ఈఏడాది 35 లక్షల నుంచి 40 లక్షల టిక్కీలు మాత్రమే వచ్చాయి. గతంతో పోల్చితే ఇప్పటివరకు 50శాతం మాత్రమే నిండాయని యజమానులు చెబుతున్నారు. ఇటీవల వర్షాల నేపథ్యంలో దెబ్బతిని నాణ్యత తగ్గిన మిర్చిని నిల్వచేసే అవకాశాలు మరింత తగ్గాయి. దీంతో ఏప్రిల్‌ నెలలోనూ శీతలగోదాములకు వచ్చే సరకు పరిమాణం తగ్గుతుందన్న అంచనాలు ఉన్నాయి. మార్కెట్‌లో అధిక ధర లభిస్తుండటంతో వచ్చిన సరకు వచ్చినట్లే విక్రయాలు జరగడం, రోజువారీగా యార్డుకు వచ్చే మిర్చి పరిమాణం తగ్గడంతో యార్డులో సరకు నిల్వ ఉండడం లేదు.

తాలుకాయలు తళతళ

నాణ్యమైన మిర్చికి మంచి ధరలు లభిస్తుండటంతో అంతేస్థాయిలో తాలుకాయలకు కూడా ధరలు బాగున్నాయి. సగటున క్వింటా రూ.10వేలకుపైగా ధర లభిస్తుండగా గరిష్ఠంగా రూ.13వేల వరకు ధరలు పలుకుతున్నాయి. గతంలో ఎన్నడూ తాలుకాయలకు ఇంతటి ధర రాలేదని రైతులు చెబుతున్నారు. మార్కెట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా మిర్చి లభ్యత తగ్గడం, భవిష్యత్తులో సరకు రావడంపై సందిగ్ధం కొనసాగుతుండటంతో ముందస్తుగా వ్యాపారులు తాలుకాయలను పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. ఇది కర్షకులకు కలిసివస్తోంది. తాలు రూపంలో తక్కువ ధరకు విక్రయించాల్సి పరిస్థితి నుంచి మెరుగైన ధర లభించడంతో రైతులకు ఉపశమనం కలుగుతోంది. తాలుకాయలకు మార్కెట్‌లో డిమాండ్‌ కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు