logo

సుందరయ్య పురస్కారంతో బాధ్యత పెరిగింది: తమ్మారెడ్డి

సుందరయ్య పురస్కారంతో నాపై బాధ్యత మరింత పెరిగిందని సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య 20వ జాతీయ స్థాయి నాటికల పోటీలు శుక్రవారం రాత్రి ప్రారంభమయ్యాయి.

Published : 01 Apr 2023 05:38 IST

ప్రారంభమైన నాటికల పోటీలు

ఎస్‌-11 నాటికలో ఓ సన్నివేశం

యడ్లపాడు: సుందరయ్య పురస్కారంతో నాపై బాధ్యత మరింత పెరిగిందని సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య 20వ జాతీయ స్థాయి నాటికల పోటీలు శుక్రవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సుందరయ్య ఆశయాలకు అనుగుణంగా నడుచుకునే ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఎన్నో అవార్డులు, పురస్కారాలు పొందినా సుందరయ్య పురస్కారం లభించటం ఆనందంగా ఉందన్నారు. ముందుగా స్థానిక ఎంవీ చౌదరి కళావేదికపై సుందరయ్య చిత్రపటానికి అతిథులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తమ్మారెడ్డి భరద్వాజకు పుచ్చలపల్లి సుందరయ్య కళా పురస్కారం అందించి అభినందించారు. కార్యక్రమంలో రవిమారుతి, క్యూర్‌కేర్‌ ఆసుపత్రి ఎండీ(ఖమ్మం), సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి వై.రాధాకృష్ణ, ప్రజానాట్యమండలి నాయకులు కాళిదాసు, నిర్వాహకులు సురేష్‌బాబు ప్రసంగించిన వారిలో ఉన్నారు.

తొలిరోజు ప్రదర్శనలు..

దాంపత్య జీవితం గొప్పదనాన్ని చాటిచెప్పిన సందేశాత్మక కళారూపమే ఎస్‌-11 నాటిక. చైతన్య కళా స్రవంతి విశాఖపట్నం వారు ప్రదర్శించిన ఈ నాటికకు పి.బాలాజీనాయక్‌ దర్శకత్వం వహించారు. పి.వెంకటేశ్వరరావు రచించారు. మనిషికైనా, దేశానికైనా ద్వేషం ఎంతమాత్రం మంచిది కాదని, చివరికి అనర్థమే మిలుగుతుందని తెలియజేసే చైతన్యవీచిక ‘కొత్త పరిమళం’. మానవత్వం, విశ్వరూపం సౌందర్యం పంచిన కొత్త పరిమళంతో సరిహద్దులు లేని ప్రపంచం భావి తరాలకు అందించాలని ఆకాంక్ష ప్రేక్షకులను ఆకట్టుకుంది. శార్వాణీ గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం బోరివంక(శ్రీకాకుళం) బీఎంఎస్‌ పట్నాయక్‌ దర్శకత్వం వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని