logo

టైరు పంక్చరై చెట్టును ఢీకొన్న కారు

రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో విషాదం నింపింది. ఘటనలో తల్లిదండ్రులు మృత్యువాత పడగా  కుమారుడు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Published : 12 Apr 2024 04:13 IST

దంపతులు మృతి

కారులోనే ఇరుక్కుపోయిన మృతుడు రాజగోపాలరెడ్డి

వినుకొండ రూరల్‌, పట్నంబజారు, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో విషాదం నింపింది. ఘటనలో తల్లిదండ్రులు మృత్యువాత పడగా  కుమారుడు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వినుకొండ పోలీసుల కథనం ప్రకారం.. నంద్యాల జిల్లా  మునగాలకు చెందిన గంగారపు రాజగోపాలరెడ్డి(52), శివలక్ష్మి(45) దంపతులు. వీరు కుమారుడు రాకేశ్‌రెడ్డితో కలిసి రెండేళ్లుగా గుంటూరులోని ఆర్టీసీ కాలనీలో ఉంటూ ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నారు. స్వగ్రామంలో బ్యాంకు పని ఉండటంతో గురువారం వేకువన 4గంటలకు బయలుదేరారు. ఈ క్రమంలో కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం సమీపంలోని పెట్రోల్‌ బంకు వద్ద టైరుకు పంక్చర్‌ కావడంతో కారు అదుపుతప్పి చింతచెట్టును ఢీకొట్టింది. కారు నడుపుతున్న రాజగోపాలరెడ్డి అందులోనే ఇరుక్కుని చనిపోగా, అతని భార్య శివలక్ష్మి కారులోంచి ఎగిరి కిందపడడంతో మృతిచెందింది. రాకేశ్‌రెడ్డికి రెండు కాళ్లు విరిగి తీవ్రగాయాలతో కారులోనే ఇరుక్కుపోయాడు. హైవే సిబ్బంది వచ్చి బాధితుడిని వినుకొండలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాల తరలించారు. భార్యాభర్తల మృతదేహాలకు పంచనామా చేసి బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ సాంబశివరావు తెలిపారు.

మృతురాలు శివలక్ష్మి

రూ.లక్ష నగదు కనిపించలేదని ఆందోళన: బ్యాంకులో రుణానికి సంబంధించి రూ.1.20 లక్షలు నగదు కారులో తీసుకెళ్తున్నామని, దానిని తీసుకోమని రాకేశ్‌రెడ్డి తమ బంధువులకు చెప్పాడు. దీంతో వారు పోలీసులను అడగ్గా కారులో నగదు రూ.20 వేలు మాత్రమే ఉందని, మృతురాలి వద్ద ఉన్న బంగారం జాగ్రత్త పరిచామని, అన్ని విషయాలు కెమెరాలో రికార్డు చేశామని పోలీసులు చెప్పారు. రూ.లక్ష ఏమైనట్లు అని మృతుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు ఆర్టీసీ కాలనీలో విషాదఛాయలు  

రాజగోపాలరెడ్డి, శివలక్ష్మి మృతితో గుంటూరు ఆర్టీసీ కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి. బుధవారం రాత్రి రాజగోపాలరెడ్డి తన ఇంటి సమీపంలోని బంధువుల ఇంటిలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో కుటుంబసభ్యులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం తెల్లవారుజామున బయలుదేరి వెళుతూ ప్రమాదానికి గురై మృతి చెందడంపై బంధువులు విషాదంలో మునిగిపోయారు. రాజగోపాలరెడ్డి మృధుస్వభావని, చుట్టుపక్కల వారందరితో కలివిడిగా ఉండేవారని స్థానికులు పేర్కొన్నారు.

  ధ్వంసమైన కారు పరిశీలిస్తున్న పోలీసులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని