logo

ఇంకా వారం కాలేదా?

ఉద్యోగ విరమణ తర్వాత విశ్రాంత జీవితం ప్రశాంతంగా, నిశ్చింతగా గడిపేందుకు పెన్షన్‌ వారికి ఆధారం. అటువంటి పెన్షన్‌కు కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎస్‌) ద్వారా గండికొట్టారు.

Published : 12 Apr 2024 04:17 IST

ఓపీఎస్‌పై జగన్‌ మాట తప్పారని ఉద్యోగుల మండిపాటు

గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట సీపీఎస్‌ రద్దు చేయాలంటూ నిరసన(పాత చిత్రం)

నగరపాలకసంస్థ(గుంటూరు), కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: ఉద్యోగ విరమణ తర్వాత విశ్రాంత జీవితం ప్రశాంతంగా, నిశ్చింతగా గడిపేందుకు పెన్షన్‌ వారికి ఆధారం. అటువంటి పెన్షన్‌కు కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎస్‌) ద్వారా గండికొట్టారు. పాతపెన్షన్‌ స్థానంలో సీపీఎస్‌ను 2004 సెప్టెంబరు మొదటి తేదీ నుంచి అమలులోకి తెచ్చారు. అప్పటి నుంచి ప్రభుత్వంలో ఉద్యోగాలు పొందిన వారంతా సీపీఎస్‌ పరిధిలోకి వచ్చారు. ఇలా జిల్లాలో ప్రస్తుతం 13 వేల మంది సీపీఎస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారు. 2019లో వైకాపా పాదయాత్ర సందర్భంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక వారంలో సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి దీనిపై  కనీసం మాట కూడా మాట్లాడని సీఎం జగన్‌ తన సలహాదారులతోనే ఓపీఎస్‌ సాధ్యం కాదని, ఆర్థిక భారమౌతుందని అప్పట్లో తెలియక పాదయాత్రలో మాటిచ్చామని తప్పించుకునేందుకు చూస్తున్నారు. దీనిస్థానంలో గ్యారెంటీ పెన్షన్‌ స్కీం(జీపీఎస్‌) ప్రకటించడంపై ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జీపీఎస్‌ కూడా సీపీఎస్‌ తరహా విధానమేనని ఒప్పుకునేది లేదని, తప్పకుండా ఓపీఎస్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. సీపీఎస్‌ రద్దు చేస్తామని మోసగించిన వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

రోడ్డెక్కి నినదించినా కనికరించని సీఎం

సీపీఎస్‌ను రద్దు చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాలను కోరుతూనే ఉన్నారు. ప్రజలకు సేవ చేసేవారు రోడ్డున పడి నిరాహార దీక్షలు, ధర్నాలు చేసినా కనికరించలేదు. దశల వారీగా ఉద్యోగులు ఉద్యమించినా, వినతులు అందించినా అవన్నీ గాలికొదిలేసిన సీఎం జగన్‌ ఐదేళ్లుగా సీపీఎస్‌ ఉద్యోగుల ఆవేదనను మాత్రం పట్టించుకోలేదు. ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అంటూ పలికే జగన్‌కు సీపీఎస్‌ ఉద్యోగుల విషయంలో ఏం చేశారో చెప్పాల్సిన అవసరం ఉందంటూ ఉద్యోగ సంఘాలంటున్నాయి.


నమ్మి గెలిపించుకుంటే జీపీఎస్‌ అంటూ నాటకాలు

వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తామని ఆనాడు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు కనీసం దానిపై మాట్లాడింది లేదు. నాడు నమ్మి ఉద్యోగులంతా ఓట్లు వేశారు. గెలిచాక ఇది సాధ్యం కాదు..ఆర్థిక భారం అంటూ జీపీఎస్‌ విధానం తెచ్చారు. ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో తప్పకుండా అమలు చేయాల్సిందే. సీపీఎస్‌, జీపీఎస్‌ ఏదీ మాకు సమ్మతం కాదు. ఓపీఎస్‌ ఆర్థిక భారమంటున్న ప్రభుత్వం సలహాదారులు, వాలంటీర్లు, రకరకాల పేర్లతో ఎన్నో నిధులు ఖర్చు చేస్తున్నారు. పాత పింఛను విధానం తేవాల్సిందే. ఓట్‌ ఫర్‌ ఓపీఎస్‌ నినాదంతో ముందుకెళ్తున్నాం. 

సీహెచ్‌.ఆదినారాయణ, సీపీఎస్‌(యూటీఎఫ్‌) ఉపాధ్యాయుల సంఘం జిల్లా కన్వీనర్‌


హామీలు అమలు చేయకుంటే నమ్మకం కోల్పోతారు

ఉద్యోగుల విశ్రాంత జీవనానికి ఆర్థిక భరోసా ముఖ్యం. ఇది పాతపెన్షన్‌ విధానంతోనే సాధ్యం. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వలన నమ్మకం కోల్పోతారు. ప్రజాస్వామిక వ్యవస్థకు ఇది విఘాతం. సీపీఎస్‌తో ఉద్యోగి విశ్రాంత జీవనానికి ఆర్థిక భరోసా లేదు. ఉద్యోగి తమ జీవిత కాలంలో దాచుకున్న మొత్తం, ప్రభుత్వ నుంచి కంట్రిబ్యూషన్‌ మొత్తం స్టాక్‌ మార్కెట్‌లలో పెట్టుబడులు పెట్టి మార్కెట్‌ విలువల ఆధారంగా అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఉద్యోగి పదవీ విరమణ సమయంలో ఇస్తారు. దీనివలన నష్టపోయే ప్రమాదం ఉంది.

టి.భాస్కరరావు, యూటీఎఫ్‌ తుళ్లూరు కార్యదర్శి  


అయిదేళ్లుగా కాలం గడిపేశారు 

సీపీఎస్‌, జీపీఎస్‌లకు ఒప్పుకునేది లేదు. పాతపెన్షన్‌ విధానం పక్కాగా అమలు చేస్తామనే వారికే మద్దతు ఉంటుంది. గత 20 ఏళ్లుగా సీపీఎస్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాం. ప్రభుత్వం జీపీఎస్‌ పేరుతో తిరిగి ఉద్యోగులను మోసగించేందుకు ప్రయత్నించారు. అయిదేళ్లు దాటవేత ధోరణితోనే కాలం గడిపేశారు. సీపీఎస్‌ రద్దు గురించి సలహాదారులు కాకుండా ముఖ్యమంత్రే నేరుగా మాట్లాడిన పరిస్థితి లేదు. న్యాయమైన డిమాండ్‌ను అమలు చేయకుండా కాలం వెళ్లదీసిన వారిని ఇంటికి పంపి ఓపీఎస్‌ అమలు చేస్తామనే వారికే అవకాశం ఇస్తే మంచి జరుగుతుంది.

సీహెచ్‌.రాము, ఉపాధ్యాయుడు, తెనాలి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని