logo

‘వైకాపా రాక్షస పాలనను సాగనంపాలి’

వైకాపా రాక్షస పాలన సాగనంపడానికి ప్రజలతో పాటు తెదేపా కుటుంబ సభ్యులు సంసిద్ధులై ఉండాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి చెప్పారు.

Published : 12 Apr 2024 04:18 IST

చెక్కు అందజేస్తున్న నారా భువనేశ్వరి, మాజీ ఎమ్మెల్యే జీవీ

శావల్యాపురం: వైకాపా రాక్షస పాలన సాగనంపడానికి ప్రజలతో పాటు తెదేపా కుటుంబ సభ్యులు సంసిద్ధులై ఉండాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి చెప్పారు. చంద్రబాబు అరెస్టు సమయంలో పలువురు మృతిచెందగా బాధిత కుటుంబాలను ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా ఆమె పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి శావల్యాపురం మండలం వేల్పూరులోని బోయపాటి మణికంఠ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. మణికంఠ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం గ్రామంలోని కళామందిర్‌ కూడలి వద్ద ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌  పాలనలో 30,196 మంది మహిళలు అపహరణకు గురైతే ఇంతవరకు వారి ఆచూకీ లభించలేదన్నారు. తెదేపా కార్యకర్తలు, నాయకులు ఇచ్చిన బలం, ధైర్యంతోనే ప్రస్తుతం ముందుకు సాగుతున్నానన్నారు. ఎన్నికల్లో అందరూ చేతులు కలిపి ముందుకు నడవాలని సూచించారు. తోటచంద్రయ్య, నందం సుబ్బయ్య వంటి నేతలను వైకాపా వారు చంపడానికి వచ్చిన సమయంలో కూడా జై తెదేపా అన్నారని, అటువంటి వ్యక్తులు పార్టీ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టారని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో 203 మంది కార్యకర్తలు చనిపోయారని, ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా కలుస్తున్నానని తెలిపారు.  చంద్రబాబు ఏపీని దేశంలోనే నంబరు వన్‌ రాష్ట్రంగా ఉంచాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారని, ఏపీకి ప్రస్తుతం రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్‌ అని, రాజధాని కోసం అన్నదాతలు 33వేల ఎకరాలు ఉచితంగా ఇచ్చారని, అలాంటి వారు 1600 రోజులుగా దీక్షలు చేయాల్సి వస్తోందన్నారు. మీ బిడ్డలు, భావితరాల భవిష్యత్తు ఆలోచించి ఓటు వేయాలని తల్లిదండ్రులను కోరారు. చంద్రబాబు చేపట్టే పనులు అన్ని శాశ్వతంగా ఉంటాయని చెప్పారు. రాష్ట్రం, దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని, రానున్న ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ, తెదేపా పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జడ్పీటీసీ సభ్యురాలు పారా హైమావతి, తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని