logo

ప్రజా గోడుకు.. గళం నీవే చంద్రన్నన

జిల్లాలోని డెల్టా ప్రాంతంలో రైతాంగం సమస్యలను జగన్‌ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. మత్స్యకారుల ఇబ్బందులనూ పట్టించుకోలేదు.

Published : 12 Apr 2024 04:21 IST

తెదేపా అధినేతపై డెల్టావాసుల ఆశలు
నేడు వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన
ఈనాడు, బాపట్ల

ఎడాపెడా ఇసుక తవ్వకాల కారణంగా నదిలో గుంతలు

జిల్లాలోని డెల్టా ప్రాంతంలో రైతాంగం సమస్యలను జగన్‌ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. మత్స్యకారుల ఇబ్బందులనూ పట్టించుకోలేదు. చేతికొచ్చిన పంట మిగ్‌జాం తుపానుతో అందకుండా పోయింది. ఆ సమయంలో చంద్రబాబునాయుడు డెల్టా ప్రాంతంలో పర్యటించి రైతులకు కొండంత అండగా నిలిచారు. ప్రస్తుతం ప్రజాగళం సభల్లో పాల్గొనేందుకు శుక్రవారం ఆయన వేమూరు నియోజకవర్గం కొల్లూరు, రేపల్లె నియోజకవర్గం రేపల్లె పట్టణానికి వస్తున్నారు. దీంతో ప్రజలు, రైతాంగం, తెదేపా నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. గత తెదేపా ప్రభుత్వ హయాంలో కొల్లూరు మండలంలో ఎన్టీఆర్‌ పోతార్లంక ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి కొంతమేరకు పనులు పూర్తి చేసింది. తర్వాత వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పథకం కింద సాగవ్వాల్సిన వేలాది ఎకరాలకు నీరు సమస్యగా మారింది. లంక గ్రామాలకు అనుసంధాన రహదారులు, ఇతర వసతులు కల్పిస్తామన్న వైకాపా ప్రభుత్వ హామీ కలగానే మిగిలింది. రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నంలో మత్స్యకారుల ప్రయోజనాలకు సంబంధించిన హార్బర్‌ నిర్మాణం వంటివి విస్మరించటంతో ఆయా వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంత ప్రజల సమస్యలివి.

  • కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని 4950 ఎకరాలకు నీరందించేలా పోతార్లంక ఎత్తిపోతల పథకం పనులను తెదేపా ప్రారంభించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క అడుగూ ముందుకు వేయలేదు. ప్రస్తుతం 400 ఎకరాలకు మాత్రమే నీరందుతోంది. తెదేపా అధికారంలోకి రాగానే ప్రాజెక్టును పూర్తి చేయాలని రైతాంగం కోరుతోంది.
  • గాజుల్లంక, పెదలంక, ఈపూరు, జువ్వలపాలెం ప్రాంతాల్లో గత ఐదేళ్లుగా వైకాపా ముఖ్య ప్రజాప్రతినిధి తన కుమారుల్ని ముందు పెట్టి పెద్దమొత్తంలో ఇసుక తవ్వకాలు చేయటంతో ఆ ప్రాంతాల్లో భూగర్భజలాలు దారుణంగా పడిపోయాయి. అనధికార ఇసుక తవ్వకాలతో వైకాపా ప్రజాప్రతినిధి రూ.కోట్లు వెనకేసుకుని రైతులు, ప్రజల నోట్లో మట్టికొట్టారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల రాకపోకలకు ఉద్దేశించిన అరవింద వారధికి ఆ ఇసుక తవ్వకాలతో ప్రమాదం పొంచి ఉన్నా వైకాపా నాయకులు వ్యక్తిగత లబ్ధి చూసుకున్నారు. కొల్లూరు మండలాల్లోని నదీ పరివాహక ప్రాంతాల్లో అనధికారిక ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు పడిపోవటమే కాదు చాలా పొలాలు కోతకు గురై నదిలో కలిసిపోయి రైతులకు నష్టం సంభవించింది. సేద్యానికి ఇబ్బందికరంగా మారింది. కౌలు రైతుకు రెండో పంç పండితేనే గిట్టుబాటు అవుతుంది. ఇక్కడ భూగర్భజలాలు అడుగంటడం, ఆరుతడికి నీళ్లిచ్చే పరిస్థితి లేకపోవటంతో ఇంజిన్లు పెట్టుకుని పంటలు కాపాడుకోవాల్సి వస్తోంది. అందుకు ఎకరాకు రూ.5-6 వేలు అదనంగా ఖర్చవుతోంది. ఇదంతా కూడా వైకాపా నాయకులు చేసిన ఇసుక తవ్వకాల వల్లే తమకు ఈ పరిస్థితి అని రైతాంగం బోరుమంటోంది. ఈ సమస్యలకు మార్గం చూపాలని చంద్రన్నను అక్కడి ప్రజానీకం కోరుతోంది.

పోతర్లంక ఎత్తిపోతల పథకం

కాల్వల్లో పూడికలు, తూటికాడ పేరుకుపోయినా తొలగింపే లేదు. డెల్టా ప్రాంతంలో కాల్వలు శిథిలావస్థలో ఉన్నా వాటికి మరమ్మతులు చేయటం లేదు.

కౌలు రైతాంగం చాలా ఇబ్బందులో ఉంది. మొదటి పంట మిగ్‌జాంతో తుడిచిపెట్టుకు పోగా రెండో పంటకు ఆరుతడిగా నీళ్లు అందక దిగుబడులపై ప్రభావం చూపటంతో వచ్చే ఖరీఫ్‌కు సన్నద్ధమయ్యే పరిస్థితి వారికి లేకుండా పోయింది. కౌలు రైతు ప్రయోజనాలను జగన్‌ ప్రభుత్వం విస్మరించింది.

కొల్లూరు నుంచి గాజుల్లంకకు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఇసుక బట్టీలతో లంక గ్రామాల వాసులకు నిత్యం కునుకు ఉండటం లేదు. బట్టీల నుంచి విపరీతంగా పొగ వెలువడటంతో పరిసర గ్రామాల ప్రజలు శ్వాసకోశ, చర్మ సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారు.

తెనాలి-కొల్లూరు ప్రధాన రహదారి మినహా డెల్టా ప్రాంతంలో మిగిలిన గ్రామాలకు వెళ్లే రహదారులు మోకాల్లోతు గుంతలు పడి దారుణంగా ఉన్నా పట్టించుకోవటం లేదు.

జంపని చక్కెర కర్మాగారం మూతపడటంతో కార్మికులకు ఏకవిడత చెల్లింపుల పథకం కింద రూ.14 కోట్లకు నాలుగో వంతు మాత్రమే ఇచ్చింది.   మిగిలిన మొత్తాన్ని అందించకుండా కార్మికులను ఇబ్బంది పెడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని