logo

వారంటే మక్కువ.. వీరంటే తక్కువా..?

సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చి 25 రోజులు అవుతోంది.

Published : 12 Apr 2024 04:22 IST

కోడ్‌ అమల్లో అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చి 25 రోజులు అవుతోంది. ఎన్నికల కమిషన్‌ పరిధిలో పనిచేయాల్సిన అధికారులు అధికార వైకాపా పట్ల ఒకలా...ప్రతిపక్ష పార్టీల విషయంలో మరోలా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ప్రత్తిపాడు మండలం కొండేపాడులో తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థి బూర్ల రామాంజనేయులు అనుమతులు తీసుకుని గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోయవారిపాలెం గ్రామ సచివాలయం కార్యదర్శి చక్రవర్తి ప్రచారం వద్దకు చేరుకుని చరవాణిలో ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. గమనించిన తెదేపా నాయకులు  అనధికారికంగా ఫొటోలు, వీడియోలు మీరేందుకు తీస్తున్నారు..అది మీ బాధ్యత కాదుగా అని ప్రశ్నించగా, పంచాయతీ కార్యదర్శి ఆదేశించారని సమాధానమిచ్చారు. దీనిపై సదరు కార్యదర్శి శ్వేతతో రామాంజనేయులు మాట్లాడగా..ఎంపీˆడీవో దుర్గాప్రసాద్‌ ఆదేశాలతో తీయిస్తున్నామని బదులివ్వడం గమనార్హం. విషయాన్ని ప్రత్తిపాడు ఎన్నికల అధికారి పి.శ్రీకర్‌ దృష్టికి ‘న్యూస్‌టుడే’ తీసుకెళ్లగా, ఎంపీˆడీవోతో మాట్లాడతానని చెప్పారు.

ట్యాంకుపై పసుపు రంగు ఉందని కేసు.. ప్రత్తిపాడులో నీటి ఎద్దడి నేపథ్యంలో తండ్రి పేరుతో ట్రాక్టరు ట్యాంకు ద్వారా నీటిని సరఫరా చేస్తున్న నూతలపాటి అమర్‌నాథ్‌పై ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి కేసు నమోదు చేయించారు. ఆయన తండ్రి పరమేశ్వరరావు మృతి చెందినప్పటికీ గతంలో తెదేపా నాయకుడిగా ఉన్నారని, ఆయన చిత్రం ట్యాంకుపై అంటించి సరఫరా చేయడం కోడ్‌ ఉల్లంఘనే అని ఎంపీˆడీవో దుర్గాప్రసాద్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు చెప్పడం గమనార్హం.

అనుమతుల్లేకున్నా చర్యలు శూన్యం.. పెదనందిపాడులో గత నెల 28న వైకాపా ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్‌ కుమార్‌, నాయకులతో కలిసి రోడ్డు షో, ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీకి అనుమతులు లేవని గుర్తించి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో వైకాపా నాయకులు అధికారులతో వాగ్వాదానికి దిగడంతోపాటు లెక్కచేయకుండా ర్యాలీ కొనసాగించారు. ఈ క్రమంలో అధికారులు ప్రేక్షకపాత్ర వహించడం విమర్శలకు తావిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని