logo

లోక్‌సత్తా మద్దతుతో కూటమికి అదనపు బలం

లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్‌నారాయణ తెదేపా, జనసేన, భాజపా కూటమికి మద్దతు ప్రకటించటం వల్ల అదనపు బలం చేకూరిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు.

Published : 12 Apr 2024 04:23 IST

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌

మాట్లాడుతున్న నాదెండ్ల మనోహర్‌, పక్కన బాబ్జి తదితరులు

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్‌నారాయణ తెదేపా, జనసేన, భాజపా కూటమికి మద్దతు ప్రకటించటం వల్ల అదనపు బలం చేకూరిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. లోక్‌సత్తా పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి గురువారం తెనాలి వచ్చిన సందర్భంగా ఆయనతో కలిసి స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మనోహర్‌ మాట్లాడుతూ జయప్రకాష్‌నారాయణ ఎన్నో ఏళ్లుగా జాతీయ స్థాయిలో వ్యవస్థల విలువలు కాపాడటానికి తన వంతు కృషి చేస్తున్నారని, వైకాపా పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని గుర్తించి కూటమికి మద్దతు ప్రకటించారన్నారు. వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్‌ కోసం ప్రజాస్వామ్యవాదులందరూ ఏకమవుతున్నారని వివరించారు. భీశెట్టి బాబ్జి మాట్లాడుతూ వైకాపా పాలనలో రాష్ట్రం మత్తు ఆంధ్రప్రదేశ్‌గా తయారైందని, ఇటీవలె లక్ష కోట్ల విలువైన డ్రగ్స్‌ విశాఖ యార్డుకు వచ్చాయంటే పరిస్థితి ఏ తీరున ఉందో అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. తాను ఉత్తరాంధ్రవాసినని అక్కడ కొత్త పరిశ్రమలు రాక పోగా ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయని, గతంలో అనకాపల్లి మార్కెట్ నుంచి రోజూ లక్ష బెల్లం దిమ్మల విక్రయాలు జరిగేవని, అది ఇప్పుడు మూడు వేలకు పడిపోయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం గద్దె దిగకుంటే యువత భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందన్నారు. రాష్ట్ర ప్రగతి, యువత భవిష్యత్తు కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జయప్రకాష్‌నారాయణ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్త పర్యటనను తెనాలి నుంచి ప్రారంభించినట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని