logo

సీఎం జగన్‌.. ఆయన సామంతులకు కూల్చివేతలే తెలుసు

రానున్న ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానని మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నారా లోకేశ్‌ అన్నారు.

Published : 12 Apr 2024 04:24 IST

మంగళగిరిలో తటస్థులతో సమావేశమైన నారా లోకేశ్‌

తమ ఇంటిని కూల్చివేశారని లోకేశ్‌ వద్ద వాపోతున్న బాధిత కుటుంబం

మంగళగిరి, న్యూస్‌టుడే: రానున్న ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానని మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నారా లోకేశ్‌ అన్నారు. మంగళగిరికి చెందిన తటస్థ ప్రముఖులతో ఆయన గురువారం సమావేశమయ్యారు. పట్టణంలోని నాల్గో వార్డుకు చెందిన జంజనం మల్లేశ్వరరావు నివాసానికి వెళ్లి ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. నిర్మాణంలో ఉన్న తమ భవనాన్ని గత ఏడాది అక్టోబర్‌లో ఎమ్మెల్యే ఆర్కే ప్రోద్బలంతో అధికారులు కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఇక్కడి దేవాలయ భూముల్లో నివాసం ఉంటున్నామని, తాము ఇళ్లు నిర్మిస్తుండగా నిలిపివేయాలని దేవాలయ అధికారులు నోటీసులు జారీ చేయడంతో తాను హైకోర్టును ఆశ్రయించానని మల్లేశ్వరరావు వివరించారు. న్యాయస్థానం స్టే ఇచ్చిందని, సంబంధిత పత్రాలను తెచ్చేలోగానే అధికారులు నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేశారని వాపోయారు. దీనిపై లోకేశ్‌ స్పందిస్తూ జగన్‌ ఆయన సామంతులకు తెలిసింది కూల్చివేతలు మాత్రమే అని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక దేవాదాయశాఖ వారికి ప్రత్యామ్నాయ భూమి చూపించి దీర్ఘకాలంగా నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలిచ్చే విధంగా తాను చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేస్తామని, ముడి సరుకు రాయితీతోపాటు చేనేత వస్త్రాలకు మెరుగైన మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు. 14వ వార్డుకు చెందిన మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ కాండ్రు శ్రీనివాసరావు కార్యాలయాన్ని లోకేశ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనతో సమావేశమయ్యారు. మంగళగిరి చేనేతలపై తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు. మంగళగిరిలో 25 అత్యాధునిక మగ్గాలతో వీవర్స్‌శాల ఏర్పాటు చేసి టాటా సంస్థతో ఒప్పందం చేసుకుని ఉత్పత్తి అయిన వస్త్రాలకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తనను ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గ తెదేపా సమన్వయకర్త నందం అబద్ధయ్య, పట్టణ పార్టీ అధ్యక్షుడు దామర్ల రాజు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని