logo

చేష్టలుడిగి చూస్తున్నావా నేత

వైకాపా ప్రభుత్వ విధానాలతో చేనేత పరిశ్రమ అంపశయ్యపై కొట్టుమిట్టాడుతోంది. నేతన్న కార్మికులను ఆదుకుంటామని అధికారంలోకి వచ్చిన జగన్‌ నేతన్న నేస్తం ఒక్కటే ఇస్తూ తెదేపా హయాంలో చేపట్టిన పలు పథకాలు, రాయితీలకు మంగళం పాడారు.

Published : 12 Apr 2024 04:32 IST

చేతినిండా పనిదొరకని దుస్థితి
కుటుంబ పోషణకు వృత్తిని వీడుతున్న కార్మికులు

కమ్మరి కొలిమి.. కుమ్మరి చక్రం..
జాలరి పగ్గం.. సాలెల మగ్గం..

ఇలా చేతివృత్తుల జీవితాలు వైకాపా పాలనలో దుర్భరంగా మారాయి. గత ఎన్నికల్లో నేను ఉన్నాను.. నేను విన్నానంటూ జగన్‌ అన్నివర్గాలతో పాటు చేనేతలను నమ్మించారు. అధికారంలోకి వచ్చాక అరచేతిలో వైకుంఠం చూపించారు. ‘నేతన్న నేస్తం’ పేరుతో బురిడి కొట్టించి అంతకుముందు వరకు వారికి అందిన సంక్షేమ పథకాలకు కత్తెర వేశారు. రాయితీలన్నీ    నిలిపేసి చేనేతను కోలుకోలేని దెబ్బతీశారు. చేనేతకు జగన్‌ చేసిన నష్టం అంతా ఇంతా కాదు.

చీరాల మండలం ఈపురుపాలేనికి చెందిన సుబ్బారావు తన భార్యతో పాటు ఇంట్లో ఉన్న ఇద్దరు కుమారులు మగ్గంపైనే ఆధారపడి జీవించేవారు. నెలకు సరాసరి రూ.20 వేలపైనే సంపాదించేవారు. మార్కెట్‌లో నేత చీరలకు డిమాండ్‌ తగ్గింది. దీనివల్ల పని కల్పించేందుకు మాస్టర్‌ వీవర్లు ముందుకు రావడం లేదు. గతంలో నాలుగు బార్లు ఇచ్చి దానికి కూలీ కూడా వెంటనే ఇచ్చే వారు. ఇప్పుడు రెండు బార్లు ఇచ్చి చీరలు తయారైన తర్వాత కూలీ ఇస్తామని చెబుతున్నారు. కులవృత్తిని వీడడం ఇష్టలేక అలా పనిచేసినా నెలకు రూ.10వేలు కూడా చేతికి అందడంలేదు. దీంతో ఇద్దరు కుమారులు ఇతర పనులకు వెళుతున్నారు.

వేటపాలెం మండలం దేశాయిపేటకు చెందిన శ్రీనివాసరావు సొంతంగా పడుగు, పేక నూలు కొనుగోలు చేసి మగ్గంపై చీరలు తయారు చేసే వారు. ఇప్పడు వీటి తయారీకి ఉపయోగించే పట్టు, నూలు ధరలు పెరిగాయి. ఆ మేరకు వాటిని కొని చీరల నేసి మార్కెట్‌కి తీసుకెళితే తక్కువ ధరకు విక్రయించాల్సి రావడంతో గిట్టుబాటు కావడంలేదు. గతంలో అయితే కార్మికులకు ప్రభుత్వం నూలు, పట్టుపై రాయితీ ఇచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో నేతన్నలు ఇబ్బందులు పడుతున్నారు.

న్యూస్‌టుడే, చీరాల అర్బన్‌  

చేతినిండా పనిలేక కార్మికులు ఇతర పనులకు వెళ్లడంతో ఆమోదగిరిపట్నంలో ఖాళీగా ఉన్న మగ్గం

వైకాపా ప్రభుత్వ విధానాలతో చేనేత పరిశ్రమ అంపశయ్యపై కొట్టుమిట్టాడుతోంది. నేతన్న కార్మికులను ఆదుకుంటామని అధికారంలోకి వచ్చిన జగన్‌ నేతన్న నేస్తం ఒక్కటే ఇస్తూ తెదేపా హయాంలో చేపట్టిన పలు పథకాలు, రాయితీలకు మంగళం పాడారు. దీంతో కుటుంబ పోషణకు ఇబ్బందిగా ఉండడంతో అనేకమంది కులవృత్తిని వీడారు. కొందరైతే ఆత్మహత్యలు చేసుకున్నారు. ముడిసరకుల ధరలు పెరగడంతోపాటు తయారైన చీరకు ఆ మేరకు మార్కెట్‌లో ధర లేకపోవడంతో వస్త్ర ఉత్పత్తిదారులు కార్మికులకు సరిగా పని కల్పించని దుస్థితి నెలకొంది. దీంతో కార్మికులు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో నేత పరిశ్రమ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.

బాపట్ల జిల్లాలోని చీరాల, భట్టిప్రోలు, కనగాల, ఐలవరం, రాజోలు, రేపల్లె తదిర ప్రాంతాల్లో కేవలం 8800 మగ్గాలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఒకప్పుడు ఈసంఖ్య 22 వేలకుపైగా ఉండేది. ఇలా తగ్గిపోవడానికి కారణం ప్రభుత్వ విధానాలే. రంగులు, రసాయనాల ధరలు   పెరిగినా ఆ మేరకు మార్కెట్‌లో చేనేత వస్త్రాలకు గిరాకీ లేకపోవడతో కార్మికులకు మాస్టర్‌వీవర్లు పూర్తిస్థాయిలో పని కల్పించలేకపోతున్నారు. గతంలో నలుగురు సభ్యులున్న కుటుంబంలో నెలకు రూ.20 వేలు సంపాదించే వారు. ఇప్పుడు అందులో సగం కూడా రావడం లేదు. దీంతో కార్మికులు అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఇదే సమయంలో హోటళ్లు, బేల్దారి కార్మికులు, ఆటో డ్రైవర్లు, పెయింటింగ్‌ లాంటి పనులకు కార్మికులు వెళుతున్నారు. కులవృత్తిని వీడలేక అప్పుల వారి నుంచి ఒత్తిడి తట్టుకోలేక కొందరు బలవన్మరణాలకు పాల్పడడం నేతన్నల దుస్థితికి అద్దం పడుతోంది. ఎన్నికల సమయంలో నేతన్నలను ఆదుకోవడానికి అనేక పథకాలు తీసుకురావడమే కాకుండా మన ప్రాంతంలో తయారైన వస్త్రానికి ప్రత్యేక గుర్తింపు ఉండేలా చూస్తామని చెప్పిన జగన్‌ ఇప్పుడు దాన్ని పూర్తిగా విస్మరించారు. కేవలం నేతన్న నేస్తం కింద రూ.24 వేలు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. దాన్ని కూడా సొంత మగ్గం ఉన్న వారికే పరిమితం చేశారు. ప్రస్తుతం నేత కార్మికుడికి విద్యుత్తు వినియోగం  తప్పనిసరి. ఆ ఇంట్లో 300 యూనిట్లు కన్నా ఎక్కువగా వాడితే ఆ సాకుతో దాన్ని రద్దు చేస్తున్నారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉప వృత్తులకు మొండిచేయి

మగ్గం మీద వస్త్రం తయారు కావాలంటే రంగుల అద్దకం, అచ్చులు అతకటం, పన్నెలు కట్టడం, కండెలు చుట్టడం, ఆసుపోయడం, పడుగులు చేయడం, నాడెలు తయారు చేయడం వంటివి ఉండాలి. ఇవి చేనేత ఉపవృత్తుల కిందకు వస్తాయి. వీటిల్లో దాదాపు నాలుగువేల మందికిపైగా జిల్లాలో ఆధారపడి జీవిస్తున్నారు. అయితే నేతన్న నేస్తం వీరికి కూడా అందించాలని పలుమార్లు ప్రభుత్వానికి కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేశాయి. అయినా ప్రభుత్వం దీన్ని పెడచెవిన పెట్టడంతో వీరికి ఆ పథకం అందని పరిస్థితి.

గత ప్రభుత్వం హయాంలో నూలుపై దాదాపు 40శాతం రాయితీ ఉండేది. ఉత్పత్తులపై ఆప్కో విక్రయశాలల ద్వారా 30శాతం రిబేటు ఇచ్చి నేత వస్త్రాల కొనుగోలుని ప్రోత్సహించేవారు. సంఘాలకు పావలావడ్డీ పథకం అమలయ్యేది. క్యాష్‌ క్రెడిట్‌,  కో-ఆపరేటివ్‌ త్రిప్ట్‌ ఫండ్‌, మహాత్మాగాంధీ బునకర యోజన పథకం, ఐసీసీఐ లాంబార్డ్‌ ద్వారా ఆరోగ్య బీమా, ముద్ర రుణాలు,   హౌస్‌కమ్‌ వర్క్‌షెడ్‌ పథకం వంటివి అమలయ్యేవి. జగన్‌ జమానాలో వాటిని అటకెక్కించారు.


రాయితీలకు మంగళం

గత ప్రభుత్వ హయాంలో చేనేతలకు అమలు చేసిన రాయితీ పథకాలను ఈ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఏడాదికి రూ.24వేలు మాత్రమే ఇస్తోంది. నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న కుటుంబానికి ఇదీ ఎలా సరిపోతోంది. అదే చేతినిండా పని ఉంటే ఇబ్బంది ఉండదు. మగ్గంపై చీర తయారై బయటకు వచ్చేసరికి పవర్‌లూమ్‌లో తయారు చేసి మా కన్నా చవకగా మార్కెట్‌లో విక్రయిస్తుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

గుత్తి వెంకటేశ్వర్లు, చేనేత కార్మికుడు


మగ్గం వదిలేసి టీ దుకాణం

రెండేళ్ల క్రితం వరకు మగ్గం నడిపా. ఒకప్పుడు మాస్టర్‌ వీవర్లు ముందస్తుగా కూలీ డబ్బులు ఇచ్చే వారు. ఇప్పుడు ముందు పని చేయండి తర్వాత ఇస్తామని చెబుతున్నారు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇద్దరి పిల్లలు, భార్యను పోషించడం కష్టంగా మారింది. ఇక చేసేది లేక మగ్గం వదిలేసి టీ దుకాణం పెట్టుకున్నా. ఇప్పుడు ఫర్వాలేదు. కార్మికులకు సరైన పనిలేకపోవడంతో నాలా చాలామంది ఇతర పనులకు మళ్లారు.  

గౌరాబత్తుని వెంకటేష్‌


ఆత్మహత్యలు చేసుకున్న  కుటుంబాలను ఆదుకోవాలి

అప్పులు, అనారోగ్యంతో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను గతంలో ప్రభుత్వాలు ఆర్థికంగా ఆదుకునేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రంగులు, రసాయనాలు, నూలుపై జీఎస్టీ విధించడంతో వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. ప్రస్తుతం సాంకేతికంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా కార్మికులు తమ వృత్తిలో మిషన్లు వినియోగిస్తున్నారు. దీనికి తప్పనిసరిగా విద్యుత్తు అవసరం. అయితే వంద యూనిట్లు ఉచితంగా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు.

దేవన వీరనాగేశ్వరరావు, అధ్యక్షుడు, రాష్ట్ర చేనేత జన సమాఖ్య

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని