logo

ఏటా పెంచుడే.. పన్ను దంచుడే!

ఆస్తి పన్ను.. ఒకప్పుడు అయిదేళ్లకోసారి సమీక్షించేవారు.. నామమాత్రంగా పెంచేవారు.. జగన్‌ ప్రభుత్వ హయాంలో విధానం మారింది.. ఒక చేత్తో ఇస్తాం.. రెండో చేత్తో వడ్డిచ్చేస్తాం అన్నట్లుగా బాదుడే.. బాదుడు.. ఏటా ఆస్తి పన్ను పెంచే విధానానికి జగన్‌ శ్రీకారం చుట్టారు.

Published : 12 Apr 2024 04:36 IST

పట్టణ ప్రజలపై మోయలేని భారం
శరాఘాతంగా జగన్‌ ప్రభుత్వ విధానం
ఈనాడు, అమరావతి

ఆస్తి పన్ను.. ఒకప్పుడు అయిదేళ్లకోసారి సమీక్షించేవారు.. నామమాత్రంగా పెంచేవారు.. జగన్‌ ప్రభుత్వ హయాంలో విధానం మారింది.. ఒక చేత్తో ఇస్తాం.. రెండో చేత్తో వడ్డిచ్చేస్తాం అన్నట్లుగా బాదుడే.. బాదుడు.. ఏటా ఆస్తి పన్ను పెంచే విధానానికి జగన్‌ శ్రీకారం చుట్టారు. నగర, పురపాలికల్లో సౌకర్యాలు కల్పించలేదుగానీ ప్రజలపై పన్నుల భారం మోపి వారిని పీల్చి పిప్పి చేస్తున్నారు. చాలా మంది భవన యజమానులు సొంతిల్లు కన్నా అద్దె ఇళ్లల్లో ఉండడమే మేలనే అభిప్రాయంతో ఉన్నారంటే వారిపై పడిన ఆస్తి పన్నుల భారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

తెనాలి మున్సిపాల్టీ చినరావూరు పరిధిలో కొండావారివీదికి చెందిన కరణం వెంకటేశ్వరావుకు 2022కు ముందు ప్రతి ఆర్నెల్లకు రూ.377 చెల్లించేవారు. 2022 తర్వాత ఆర్నెల్లకు 660 చొప్పున వస్తోందని వివరించారు.
ఆయన పేరు వెంకటేశ్వర్లు. గుంటూరు రామన్నపేట ఒకటో వీధిలో ఆయనకు 70 గజాల స్థలంలో జీ+1 భవనం ఉంది. గతంలో ఆరు నెలలకు రూ.3వేల చొప్పున ఏడాదికి రూ.6వేల పన్ను వచ్చేది. వైకాపా ప్రభుత్వం వచ్చాక పన్ను భారం రూ.10వేలకు పెరిగింది. ఏటా ఈ భారం పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. సౌకర్యాలు కల్పించకుండా ఇంత ఘోరంగా బహుశా ఎక్కడా పాలకులు పన్నులు విధించి ఉండరేమోనని ఆయన అభిప్రాయపడ్డారు.
పొన్నూరు నేతాజీనగర్‌ నివాసి వేజండ్ల హనుమంతరావుకు పన్నులు పెంచక ముందు రూ.4500 ఆస్తి పన్ను చెల్లించేవారు. పన్నులు పెంచిన తర్వాత 6500 ప్రతి ఆర్నెల్లకు చెల్లిస్తున్నానని వివరించారు. పన్నుల బారమైతే మోపారు గానీ తమకు సౌకర్యాలు, వసతులు మాత్రం ఆమేరకు కల్పించకుండా నిర్లక్ష్యం వహించిందని చెప్పారు. పన్నుల పెంపుదలతో ఏటా పొన్నూరు. పురపాలికకు రూ.88 లక్షలు అదనంగా ఆదాయం వస్తోంది.
గుంటూరు నగరపాలికకు చెందిన కొల్లిశారదా కూరగాయాల మార్కెట్‌ వాణిజ్య సముదాయంలో షాపులకు ఒకప్పుడు భలే డిమాండ్‌ ఉండేది. దుకాణం లీజుకు దొరికితే చాలనుకునేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. షాపులకు లీజు కోసం ఆహ్వానిస్తే ఒక్కరూ పాల్గొనలేదు. వ్యాపారులు పన్నుల భారంపై భయపడడమే దీనికి కారణం. 2022లో పన్నులు పెంచక మునుపు ఏడాదికి రూ.6వేలు చెల్లించేవారు. ఇప్పుడది రూ.15వేలకు పెంచారు. పన్నులు రెట్టింపు అవ్వడంతో షాపులు అద్దెకు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు.

ఏ`టా బాదుడు..

గతంలో అద్దె విలువపై ఆస్తి పన్ను నిర్ధారించి డిమాండ్‌ నోటీసులు పంపేవారు. 2022 నుంచి ఆ విధానాన్ని వైకాపా ప్రభుత్వం ఎత్తివేసింది. ప్రజలకు వాతలు పెట్టేలా ఆస్తిమూల విలువపై పన్ను విధించే విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ విధానంలో ఏటా 15 శాతం మేర పన్ను పెంపు ఉంటుంది. అదే అద్దె విలువపై అయితే 5 శాతానికి మించి ఉండదని పురపాలక రెవెన్యూ వర్గాలు తెలిపాయి. ఇంత దారుణంగా పన్నుల పెంపు గతంలో ఎప్పుడూ చూడలేదని గుంటూరు నగరపాలక రెవెన్యూ అధికారి ఒకరు పేర్కొన్నారు.ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ ధరలు పెంచిన ప్రతిసారి ఆస్తి పన్ను పెరుగుతుంది. ఇలా ఏటేటా పన్నులు పెంచి వసూలు చేసే విధానం మరెక్కడా లేదు.


పేదలు ఎలా బతకాలి
సత్యనారాయణ

నేను సోడాబండి నడుపుకుంటూ కూడపెట్టుకున్న డబ్బులతో మూడేళ్ల కిందట 34 గజాలలో ఇల్లు కొనుగోలు చేశాను. మొదట ఇంటిపన్ను ఏడాదికి 3,100 వచ్చేది. గత రెండేళ్లుగా పన్నుపెంచేస్తూ రావడంతో ఇప్పుడు రూ. రూ.4,457లు కట్టాల్సి వచ్చింది. ఏటా పన్నులు పెంచేస్తూ పోతే పేదలు ఎలా బతకాలి.

న్యూస్‌టుడే, నెహ్రూనగర్‌


ఆర్థికంగా భారంగా మారింది
జంజనం సత్యనారాయణ, పాతమంగళగిరి

పాతమంగళగిరిలో 194 గజాల్లో రేకులషెడ్డుకు గతంలో రూ.450 కట్టేవాడిని. ఈ ప్రభుత్వం వచ్చాక దాని పన్ను రూ.4200 వేశారు. ఇది ఎలా సాధ్యం. స్థలం విలువ బట్టి పన్ను వేశామంటున్నారు. మూడేళ్లుగా పన్నులు కట్టలేకపోతున్నాం.


రెండు దశాబ్దాల నుంచి పెంపే లేదు
శ్రీనివాసరావు

రెండు దశాబ్దాల తర్వాత పన్నులు పెంచి వైకాపా ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారం మోపింది. సౌకర్యాలు మాత్రం ఆ స్థాయిలో కల్పించలేదు. ఇప్పటికీ నగరంలో చాలాచోట్ల కచ్చా రోడ్లే దిక్కు. ఆహ్లాదం కోసం ఒక్క ఉద్యానవనం అభివృద్ధి చేయలేదు. ఉదయాన్నే వచ్చి చెత్త తీసుకెళ్లరు. మురుగు కాల్వలు పూడికలు తీయరు. రోడ్లు నిర్మించరు. అయినా పన్నులు ఎడాపెడి పెంచి ప్రజలపై ఆర్థికభారాలు మోపటం దారుణం. ఈ పెంచిన పన్నులు చెల్లించలేక ఇల్లు అమ్మేసి అద్దె ఇంట్లో ఉందామనుకుంటున్నా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని