logo

హామీలు బూటకం... అంతా జగన్నాటకం..

గత ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి నియోజకవర్గానికి జగన్‌ వెళ్లారు. రైతులు, సామాన్యుల సమస్యలు పరిష్కరించేస్తానంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. వెనుకాముందు చూడకుండా హామీలు గుప్పించారు.

Updated : 12 Apr 2024 06:12 IST

సమస్యలు పరిష్కరించకుండానే మళ్లీ వస్తున్నారు
బహుపరాక్‌.. నమ్మారో మోసపోతారంతే..

‘‘మాట తప్పం.. మడమ తిప్పం’’

ప్రతిపక్ష నేతగా జగన్‌ తన పాదయాత్రలో ఊరూరా చెప్పిన మాటిది.

గత ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి నియోజకవర్గానికి జగన్‌ వెళ్లారు. రైతులు, సామాన్యుల సమస్యలు పరిష్కరించేస్తానంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. వెనుకాముందు చూడకుండా హామీలు గుప్పించారు. రాజధాని ఇక్కడే ఉంటుందని, తానూ ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని చెప్పారు. అమరావతిలోని అసైన్డ్‌ రైతులకు సమాన ప్యాకేజీ అన్నారు.. భూమిలేని నిరుపేద కూలీలకు రూ.5వేల పింఛను అన్నారు. నమ్మి ఓట్లేసిన జనాన్ని నిండా ముంచారు. అధికారంలోకి రాగానే అసలు స్వరూపాన్ని చూపించారు. నాలుక మడతపెట్టి ఇచ్చిన మాట, మడమ.. రెండూ తిప్పారు.

ఈనాడు, అమరావతి

రాష్ట్ర ప్రగతి కోసం భూములిచ్చిన రైతుల జీవితాలతో ఆటలాడుకున్నారు.. మూడు రాజధానుల ప్రకటన చేసి వారిని అగాధంలోకి నెట్టేశారు. నాలుగేళ్లుగా అన్నదాతలు దీక్షా శిబిరాల్లో నిరసనలు చేస్తున్నా కనీసం వారి డిమాండ్లపై స్పందించలేదు.
మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి.. ఇన్నాళ్లూ పోలీసుల వలయంలో చుట్టూ పరదాలు కట్టుకుని తిరిగిన జగన్‌.. ఇప్పుడు ‘మేం సిద్ధం’ యాత్రతో మళ్లీ జనం ముందుకు వస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా, అధికారం చేపట్టి ముఖ్యమంత్రిగా జగన్‌ పర్యటించిన నియోజకవర్గాల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ పూర్తిగా నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ బృందం ఆయా హామీలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. రైతులు, సామాన్యుల సమస్యలు ఎంతవరకు పరిష్కరించారన్నదానిపై ప్రత్యేక కథనం.


హామీ: ప్రత్తిపాడు నియోజకవర్గానికి ప్రతిపక్ష నేతగా 2018 మార్చి 19న వచ్చిన జగన్‌ గుంటూరు ఛానల్‌ పొడిగింపు, నల్లమడ వాగు ఆధునికీకరణ చేపట్టి పంట నష్టపోకుండా చేస్తానన్నారు.
ఎప్పుడు: సీఎం అయ్యాక 2022 జనవరి 1న పింఛన్ల పెంపు నేపథ్యంలో జరిగిన బహిరంగ సభలో గుంటూరు ఛానల్‌ పొడిగింపు సహా ఆరు హామీలు ఇచ్చారు.

ప్రస్తుత పరిస్థితి

గారపాడు- చింతపల్లిపాడు గ్రామాల మధ్య గుంటూరు వాహిని

  • వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడుసార్లు నల్లమడ వరదల వల్ల రైతులు పంటలు నష్టపోయినా వాగు విస్తరణ పట్టాలెక్కలేదు. గుంటూరు ఛానల్‌ భూసేకరణకు నోటిఫికేషన్‌ ఇచ్చినా రైతులకు పరిహారం విడుదల చేయలేదు. దీంతో అక్కడితో ఆగిపోయింది.
  • ప్రత్తిపాడులో రామవాగు నుంచి ప్రధాన రహదారి వెడల్పు, సెంట్రిల్‌ లైటింగ్‌ నిర్మాణానికి రూ.7 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా ఇప్పటికీ రూపాయి ఇవ్వలేదు.
  • ప్రత్తిపాడులో జలజీవన్‌ మిషన్‌ కింద రూ.11.07కోట్లు మంజూరు చేసినా పనులు ప్రారంభించలేదు. 
  • పెదనందిపాడులో క్రీడా వికాస కేంద్రం నిర్మాణం 
  • పెదనందిపాడు పీహెచ్‌సీ భవనం 
  • పెదనందిపాడులో మురుగుకాలువలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించలేదు.

దిగుబడి పడిపోయి..

గుంటూరు ఛానల్‌ పొడిగించకపోవడం వల్ల ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమానులో పంట దిగుబడులు తగ్గిపోయాయి. రైతులు ఆర్థికంగా నష్టపోయారు.

న్యూస్‌టుడే, ప్రత్తిపాడు


ఒక్క శాతం పనులూ చేపట్టలేదు..

హామీ: గుంటూరులో తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టి 55 శాతం అయిన భూగర్భ డ్రైనేజీ (యూజీడీ) నిర్మాణ పనులు పూర్తి చేస్తాం.
ఎప్పుడు: 2022లో మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి రోజు గుంటూరు వచ్చిన సందర్భంగా ఈ హామీ ఇచ్చారు. రూ.250 కోట్లు నిధులిస్తామన్నారు.

అసలేం జరిగింది

చెప్పిన నిధులు రాలేదు. జనం ఇబ్బందులు పడుతుండడంతో కార్పొరేషన్‌ నిధులతో గతంలో ఉన్న గోతులు మాత్రమే పూడ్చారు. యూజీడీ పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. వైకాపా ప్రభుత్వం వచ్చాక కనీసం ఒక్క శాతం కూడా అదనంగా పూర్తి చేయకపోవడం గమనార్హం. బిల్లులు రాలేదని షాపూర్‌జీ పల్లోంజి సంస్థ పనులు నిలిపేసి వెళ్లిపోయింది.

మురుగు పొంగి..

యూజీడీ పూర్తి కాక గుంటూరు వన్‌టౌన్‌, టూటౌన్‌లో కలిపి సుమారు 4 లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ ఇంటింటికీ సెప్టెక్‌ ట్యాంకులు పెట్టుకుని డ్రైనేజీ నీటిని అందులోకి వదులుతున్నారు. మ్యాన్‌హోల్స్‌ పొంగుతున్నాయి.


హామీ: 30 కి.మీ చుట్టుకొలతతో ‘గ్రేటర్‌ గుంటూరు’గా నగర విస్తరణ.
ఎప్పుడు: గత ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రతిపక్ష నేతగా వచ్చిన సమయంలో ఈ హామీ ఇచ్చారు.
ఆ ఊసే లేదు :  అధికారంలోకి వచ్చాక ఆ ప్రస్తావనే లేదు.

విలీనమైనవివిస్మరించి..

గ్రేటర్‌ మాట అటుంచితే కనీసం అప్పటికే విలీనమైన పది గ్రామాల్లో తాగునీరు, అప్రోచ్‌ రోడ్లు, వీధిదీపాలు, పారిశుద్ధ్యం సమస్యలు పరిష్కరించలేదు. పలకలూరులో క్వారీ రాళ్ల కోసం కొండల తవ్వకంతో స్థానికంగా కాలుష్య సమస్య వేధిస్తోంది.

న్యూస్‌టుడే, నగరపాలక సంస్థ


రాజధాని నిర్మాణం చేపట్టాలని మందడంలో రైతుల నిరసన

హామీ: రాజధానిలో అసైన్డ్‌ రైతులకు సమాన ప్యాకేజీ, భూమిలేని రైతు కూలీలకు పింఛను రూ.10వేలు ఉండాలన్నారు.
ఎప్పుడు: ప్రతిపక్ష నేత హోదాలో 2018లో రాజధానిలో పర్యటించినప్పుడు.

మూడు ముక్కలాట

అధికారంలోకి వచ్చాక సమాన ప్యాకేజీ మాటే ఎత్తలేదు. పైపెచ్చు మూడు రాజధానులు అంటూ మూడుముక్కలాట ఆడారు. భూములేని రైతుకూలీలకు ఎన్నికల్లో లబ్ధి ఎత్తుగడతో కోడ్‌ వచ్చేందుకు నెల ముందు రూ.5 వేలకు పింఛను పెంచారు.

రైతులకు మొండిచేయి

అసైన్డ్‌ రైతులకు ఒక్క ఏడాది కౌలు ఇచ్చారు. ఆ తరువాత నిలిపివేశారు. వ్యవసాయం చేసుకోలేక, స్థానికంగా ఉపాధి దొరకక వారు అవస్థలు పడుతున్నారు.

న్యూస్‌టుడే, తుళ్లూరు


హామీ: మంగళగిరి- తాడేపల్లి కార్పొరేషన్‌ బృహత్‌ ప్రణాళిక తయారు చేయాలని, రూ.1200 కోట్లు ఇస్తానని సీఎం హామీ ఇచ్చారు.
ఎప్పుడు: 2021లో సీఎం చెప్పినట్లుగా ఎమ్మెల్యే ఆళ్ల ప్రకటించారు.
ప్రస్తుత పరిస్థితి: రూ.1200 కోట్లు కాస్తా రూ.500 కోట్లకు కుదించారు. అదీ ఇవ్వలేకపోయారు. మళ్లీ అడిగితే రూ.125కోట్లు ఇస్తామన్నారు. దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. చివరకు రూ.18కోట్లు ఇచ్చారు. చేసిన పనులకు పూర్తిగా బిల్లులు రాకపోవడంతో ఎమ్మెల్యే ఆళ్ల పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం గమనార్హం. నేతలు బుజ్జగించడంతో తిరిగి వైకాపాలో చేరారు. జనం అవస్థలు: తాగునీటి, భూగర్భ డ్రైనేజీ వంటి ప్రధాన సమస్యలు పరిష్కారం కాలేదు.

న్యూస్‌టుడే, మంగళగిరి


హామీ: 

  • పురపాలిక భవన నిర్మాణం, 
  • ముస్లింలకు సామాజిక భవనం 
  • ఎస్సీలకు శ్మాశానవాటికల ఏర్పాటు
  • కొల్లిపరలో నాలుగు వరుసల రోడ్డు 
  • కొల్లిపరలో మార్కెట్‌ యార్డు నిర్మాణం

ఎప్పుడు: సీఎంగా 2023 ఫిబ్రవరి 28న తెనాలికి వచ్చి పై హామీలకు రూ.43 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు.
ఆ ఒక్కటీ అడక్కు: ఇప్పటికి 13 నెలలు పూర్తయినా ఒక్క హామీ కూడా నెరవేరలేదు.

భయం.. భయంగా..

పురపాలిక భవనం కట్టి ఆరు దశాబ్దాలు కావడంతో నెర్రెలిచ్చింది. భయంభయంగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.శ్మశానవాటికలు లేక దళితులు ఇబ్బంది పడుతున్నారు. కొల్లిపరలో మార్కెట్‌ లేక రైతులు విజయవాడ, తెనాలి రావాల్సి వస్తోంది. రవాణా ఖర్చులు భారంగా మారాయి.

న్యూస్‌టుడే, తెనాలి పట్టణం


దెబ్బతిన్న కొమ్మమూరు సాగు నీటి కాలువ లాకు

హామీ: పొన్నూరు నియోజకవర్గంలో కొమ్మమూరు, అప్పాపురం, హైలెవల్‌ ఛానల్స్‌ ఆధునికీకరణకు హామీ ఇచ్చారు.
ఎప్పుడు: 2018 మార్చి 14న పొన్నూరులో జరిగిన బహిరంగ సభలో ప్రతిపక్ష నేతగా ఈ హామీలు ఇచ్చారు.
ప్రస్తుత పరిస్థితి: అధికారంలో వచ్చాక వీటి ప్రస్తావన తీసుకురాకపోవడం గమనార్హం. ప్రతిపక్ష నేతగా మాత్రం అప్పటి తెదేపా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

నీరులేక అవస్థలు

పొన్నూరు శివారు నిడుబ్రోలు, మాచవరం, మురుకుదురు, జడవల్లి, ఆరమండ గ్రామాల్లోని 10వేల ఎకరాలకు సాగు నీరు ఈ ఏడాది అందలేదు. ఆయిల్‌ ఇంజిన్లు పెట్టి పంట తడిపారు. రైతులపై రూ.5కోట్ల భారం పడింది.    

న్యూస్‌టుడే, పొన్నూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని