logo

ప్రజా గళానికి బ్రహ్మరథం

జిల్లాలో వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో శుక్రవారం జరిగిన ప్రజాగళం సభలకు జనం పోటెత్తారు. తెదేపా-జనసేన-భాజపా కూటమి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావడంతో తెదేపా నాయకుల్లో ఉత్సాహం తొణికిసలాడింది.

Published : 13 Apr 2024 05:25 IST

 కొల్లూరు, రేపల్లె సభలకు పోటెత్తిన జనం
చంద్రబాబునాయుడుకు అడుగడుగునా ఘన స్వాగతం
ఈనాడు - బాపట్ల, న్యూస్‌టుడే - రేపల్లె, బాపట్ల, కొల్లూరు బృందం

జిల్లాలో వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో శుక్రవారం జరిగిన ప్రజాగళం సభలకు జనం పోటెత్తారు. తెదేపా-జనసేన-భాజపా కూటమి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావడంతో తెదేపా నాయకుల్లో ఉత్సాహం తొణికిసలాడింది. తొలుత వేమూరు నియోజకవర్గం కొల్లూరులో జరిగిన సభకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడును వేమూరు మార్కెట్‌యార్డు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ నుంచి వేలాది మంది కార్యకర్తలు ర్యాలీగా ఎదురేగి వెళ్లి బాబుకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి కొల్లూరు సభా ప్రాంగణం చేరుకునే వరకు అడుగడుగునా మహిళలు హారతులతో స్వాగతించారు. దారి పొడవునా పూలవర్షం కురిపించారు. ర్యాలీలో బాబు వెంట వేలాది వాహనాలు సాగాయి. సుమారు ముప్పావు గంట సేపు రోడ్‌షో నిర్వహించడంతో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు, కమలనాథులతో కొల్లూరు రహదారులు కిటకిటలాడాయి. స్ధానికంగా కృష్ణా డెల్టా ఆధునికీకరణకు గత తెదేపా ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తూ చంద్రబాబు ప్రసంగం కొనసాగింది. వైకాపా ప్రభుత్వ తీరుతో డెల్టా రైతాంగం దారుణంగా దెబ్బతిందని ఈ ఏడాది వారికి తుపాను వచ్చి పంటలు నష్టపోయినా పలకరించే వైకాపా నాథుల్లేరని చేసిన ప్రసంగానికి సభికుల నుంచి అనూహ్య స్పందన వ్యక్తమైంది. సౌమ్యుడు, నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి ఆనందబాబు అంటూ పరిచయం చేశారు. ఆనందబాబు ఏ పని అప్పగించినా సమర్థంగా పని చేస్తారని అలాంటి నాయకుడిని మీరు అత్యధిక మెజార్టీతో ఆశీర్వదించాలని కోరారు. నియోజకవర్గంలోని రోడ్లు, పోతార్లంక ఎత్తిపోతల పథకం, నీటి కొరత వంటి సమస్యలను తెదేపా అధికారంలోకి రాగానే పరిష్కరిస్తుందని హమీనిచ్చారు. దీంతో సభికులు జై బాబు.. అంటూ నినాదాలు హోరెత్తించారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి టి.కృష్ణప్రసాద్‌ నిజాయతీ అధికారిగా పనిచేశారని, సేవాగుణం  కలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తిని పార్లమెంట్‌కు పంపాలని కోరారు.

నేడు అభ్యర్థులతో సమీక్ష : ప్రజాగళం సభ ముగిసిన అనంతరం తెదేపా అధినేత చంద్రబాబు రేపల్లెలోని తెదేపా కార్యాలయంలో శుక్రవారం రాత్రి బస చేశారు. శనివారం ఉదయం తెదేపా అభ్యర్థులు, కీలక నేతలతో చంద్రబాబు అంతర్గత సమావేశాలు నిర్వహించి ప్రచారం సాగుతున్న తీరు, వైకాపాను ధీటుగా ఎదుర్కొని జిల్లాలోని అన్ని స్థానాల్లో ఎన్నికల్లో విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఉప్పూడి రోడ్డులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ నుంచి హెలీకాఫ్టర్‌లో చంద్రబాబు బయల్దేరనున్నారు.

దండుపాళ్యం బ్యాచ్‌ వేమూరుకొచ్చింది

మంత్రి మేరుగ నాగార్జున ఇసుకను ఎడాపెడా దోచేశాడని తెదేపా అధినేత చంద్రబాబు కొల్లూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆరోపించారు. దీంతో నియోజకవర్గ ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని గమనించి వేరే చోటికి పరారయ్యారన్నారు. ఇంకొకాయన ఎక్కడో కొండెపి నుంచి ఇక్కడికి వచ్చాడని ఆయనో ‘దండుపాళ్యం బ్యాచ్‌’ అని విమర్శించారు. అక్కడి పనికి రాని చెత్తను ఇక్కడకి పంపిస్తే అది మంచిదవుతుందా? అన్ని ప్రశ్నించారు. ఇక బాపట్ల ఎంపీ సురేష్‌ గురించి అందరికీ తెలుసునన్నారు. వీరంతా కలసి ప్రజల సంపదను దోచేశారని విమర్శించారు. వీళ్లు మళ్లీ ఓట్లు దండుకోవడానికి రకరకాల విన్యాసాలతో మీ ముందుకు వస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

రేపల్లెలో అట్టహాసంగా..

రేపల్లె పట్టణం చేరుకోవడానికి కొల్లూరు నుంచి రోడ్డు మార్గాన బయలుదేరగా దారి పొడవునా ఆయా గ్రామాల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నిర్దేశిత సమయం కన్నా రేపల్లె పట్టణానికి ఆలస్యంగా చేరుకున్నా కార్యకర్తలు వేలాదిగా పెనుమూడి వారధి వద్దకు తరలివచ్చి స్వాగతం పలికారు. అక్కడి నుంచి పట్టణంలోని సభా ప్రాంగణానికి చేరుకోవడానికి గంటకు పైగా పట్టింది. దారి పొడవునా మహిళలు హారతులు పట్టారు. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ మీకు అందుబాటులో ఉండే వ్యక్తి నిరంతరం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అని అతన్ని ఆశీర్వదించాలని కోరారు. వాన్‌పిక్‌ సిటీ, నిజాంపట్నం ఓడరేవు అభివృద్ది, డెల్టాలో కాలువల ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. శుక్రవారం రాత్రి చంద్రబాబు రేపల్లె పట్టణంలోనే బస చేశారు.

పులివెందుల, కడప సహా 160 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ స్థానాలు కూటమి కైవసం చేసుకోవాలని దేశంలో ఎన్డీయే కూటమి 400 సీట్లు గెలవబోతోందని అన్నప్పుడు సభికుల నుంచి బాగా స్పందన వచ్చింది. జగన్‌ నాసిరకం మందుతో కిడ్నీలు లాగేస్తున్నాడని చెప్పగానే ఓ కార్యకర్త బాటిల్‌ చూపారు. తమ్ముడు ఆ బాటిల్‌ ధర రూ.200 అవునా కాదా అంటూ ప్రశ్నించగా అవునంటూ సమాధానం వచ్చింది.

చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న మాజీ మంత్రి ఆనందబాబు, బాపట్ల ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్‌

వృద్ధుల ఆనందోత్సాహం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు