logo

అరగంట ‘సిద్ధం’.. 5 గంటల యుద్ధం

సీఎం జగన్‌ జిల్లాలో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభ అటు వైకాపా  కార్యకర్తలతో పాటు సాధారణ ప్రయాణికులను అష్టకష్టాల పాల్జేసింది. సీఎం సభలకు జనాదరణ లేకపోవడంతో ఎలాగైనా మందబలం చూపించుకోవడానికి వైకాపా నాయకులు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు.

Published : 13 Apr 2024 05:56 IST

జగన్‌ వస్తే జనానికి నరకమే 
 జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ ఇక్కట్లు

మహిళలకు తప్పని పాట్లు
 క్రమబద్ధీకరించలేక చేతులెత్తేసిన పోలీసులు 

వాహనాల మధ్యలో ఇరుక్కుపోయిన అంబులెన్స్‌

ఈనాడు, అమరావతి, జిల్లా పరిషత్తు, మేడికొండూరు, నగరంపాలెం, ఏటీ అగ్రహారం, పెదకాకాని, గుంటూరు రూరల్‌, గోరంట్ల న్యూస్‌టుడే : సీఎం జగన్‌ జిల్లాలో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభ అటు వైకాపా  కార్యకర్తలతో పాటు సాధారణ ప్రయాణికులను అష్టకష్టాల పాల్జేసింది. సీఎం సభలకు జనాదరణ లేకపోవడంతో ఎలాగైనా మందబలం చూపించుకోవడానికి వైకాపా నాయకులు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల నుంచి సుమారు 1150 బస్సులను కేటాయించారు. దీంతో ఆయా జిల్లాల్లోని ప్రధాన బస్టాండ్లలో బస్సులు లేక గమ్యస్థానాలకు చేరుకోలేక సాధారణ ప్రయాణికులు అవస్థలు పడ్డారు. సభలో సీఎం 26 నిమిషాలు మాత్రమే ప్రసంగించగా.. జనం మాత్రం సుమారు 5గంటల పాటు నరకం చూశారు.

కాలకృత్యాలకూ అవకాశం లేక..

ఏటుకూరు వద్ద జాతీయ రహదారిపై మూడు గంటల పాటు ట్రాఫిక్‌ స్తంభించిపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సభా ప్రాంగణానికి వచ్చిన వారు గంటల కొద్దీ జాతీయ రహదారి మీదనే వాహనాల్లో ఉండిపోయారు.వాహనాలు దిగిన వారు సైతం కాలకృత్యాలు తీర్చుకోవడానికి అవకాశం లేకపోయింది. చుట్టూ మగవారు ఉండడంతో మహిళలు కనీసం లఘుశంక తీర్చుకోవడానికి ఎటువెళ్లాలో తెలియక నరకం చూశారు. ఎరక్కపోయి వచ్చి చిక్కుకుపోయామని ఆవేదన చెందారు. సభా ప్రాంగణం వెలుపల సంచార మరుగుదొడ్లను ఏర్పాటు చేసినా అక్కడకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

జాతీయ రహదారిపై నిలిచిన ట్రాఫిక్‌

రెండు వైపులా 2.5 కి.మీ మేర బారులు

శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వర్షం కురవడంతో జాతీయ రహదారి పక్కన ఏటుకూరు సమీపంలోని పొలాల్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం బురదమయంగా మారింది. మధ్యాహ్నం 3గంటల సమయంలో జనాలను తీసుకొచ్చిన ఆర్టీసీ బస్సులు పార్కింగ్‌ ప్రదేశాల్లో ఎక్కడికక్కడ పొలాల్లో దిగబడిపోయాయి. దీంతో వెనుక వచ్చిన వాహనాల డ్రైవర్లు బస్సులను జాతీయ రహదారిపై రెండు వరుసల్లో నిలబెట్టేశారు. దీంతో జాతీయ రహదారి మీద ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితి. మూడో వరుసలో మాత్రమే వాహనాలు వెళ్లాల్సి రావడంతో జాతీయ రహదారి చిలకలూరిపేట వైపు రెండున్నర కిలోమీటర్లు, విజయవాడ వైపు వెళ్లే రహదారి వైపు మరో రెండున్నర కిలోమీటర్ల చొప్పున వాహనాలు బారులు తీరాయి. సాయంత్రం 6.30 గంటలకు కూడా బాపట్ల, ఇతర దూర ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో జనాలను తీసుకొస్తుండడంతో ట్రాఫిక్‌ కష్టాలు మరింత పెరిగాయి. సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఇబ్బందులు కొనసాగాయి.

ప్రత్యక్ష నరకం

జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి మధ్యాహ్నం 3గంటల నుంచి చేరుకున్నారు. అకాల వర్షంతో సభా ప్రాంగణం, చుట్టుపక్కల బురదమయం కావడం, జాతీయ రహదారి మీద బస్సులు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ స్తంభించడంతో ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం కనిపించింది. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించాల్సిన పోలీసులు చేతులెత్తేశారు. దీంతో సభకు వచ్చిన వారి ఇబ్బందులు రెట్టింపయ్యాయి. సీఎం జగన్‌ రాత్రి 7గంటలకు సభా ప్రాంగణానికి చేరుకోవడంతో ట్రాఫిక్‌ సమస్యలు మరింతగా పెరిగాయి. జనాలను సభకు తీసుకెళ్లడానికి ప్రాధాన్యం ఇచ్చిన అధికార పార్టీ నాయకులు వారికి సౌకర్యాలు కల్పించడంలో శ్రద్ధ చూపలేదనే విమర్శలు ఉన్నాయి.

పేరేచర్ల నుంచి గుంటూరు వెళ్లే దారిలో అనంతారం కూడలి వద్ద అస్తవ్యస్థంగా..

వాహనాల దారిమళ్లింపుతో చుక్కలు

పల్నాడు జిల్లా ధూళిపాళ్ల నుంచి సత్తెనపల్లి మీదుగా మేడికొండూరు మండలం, నల్లపాడు మీదుగా సీఎం జగన్‌ ఏటుకూరుకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12గంటలకు గుంటూరు నుంచి మేడికొండూరు మీదుగా పల్నాడు వెళ్లే ఆర్టీసీ బస్సులు, కార్లు, లారీల వంటి భారీ వాహనాలను ఫిరంగిపురం వైపు దారి మళ్లించారు.దీని వల్ల అటువైపు బస్సులు లేక ఆటోలు మాట్లాడుకుని వెళ్లాల్సి వచ్చింది. సాయంత్రం సీఎం పేరేచర్ల దాటి వెళ్లాక వాహనాలు నియంత్రించకపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. స్థానికంగా అర్ధగంట సేపు రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

తీగలు తొలగించి... విద్యుత్తు నిలిపేసి..

సీఎం బస్సు వస్తున్న నేపథ్యంలో మేడికొండూరు, పేరేచర్ల, కొర్రపాడు, జంగంగుంట్లపాలెం వద్ద ప్రధాన రహదారిపై మధ్యాహ్నం 12గంటలకు విద్యుత్తు తీగలు తొలగించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా లేక అవస్థలు పడ్డారు. తీవ్ర ఉక్కపోతకు గురయ్యారు. సాయంత్రం 5గంటలకు విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని