logo

సీపీఎస్‌ రద్దు చేయరు.. ప్రభుత్వ వాటా ఇవ్వరు..!

ఉద్యోగ, ఉపాధ్యాయులు కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎస్‌)ను పూర్తిగా రద్దు చేసి పాతపెన్షన్‌ విధానం(ఓపీఎస్‌) అమలు చేయాలన్న డిమాండ్‌తో తీవ్ర స్థాయిలో పోరాటాలు చేశారు.

Published : 13 Apr 2024 05:59 IST

జిల్లాలో వేలాది మంది ఉద్యోగులకు భారీగా ఆర్థిక నష్టం

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయులు కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎస్‌)ను పూర్తిగా రద్దు చేసి పాతపెన్షన్‌ విధానం(ఓపీఎస్‌) అమలు చేయాలన్న డిమాండ్‌తో తీవ్ర స్థాయిలో పోరాటాలు చేశారు. వారంలోనే రద్దు చేస్తామన్న సీపీఎస్‌ను రద్దు చేయ లేదు. సీపీఎస్‌లో భాగంగా ప్రాన్‌ ఖాతాలకు ఉద్యోగుల 10 శాతం వాటాతోపాటు ప్రభుత్వం వాటా 10 శాతం వేయాల్సి ఉన్నా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వాటా మొత్తం ఎప్పటికప్పుడు వేయకుండా నెలలపాటు జాప్యం చేస్తుండడంతో తీవ్ర ఆర్థిక నష్టం కలుగుతోందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాన్‌ ఖాతాలకు ఉద్యోగి 10 శాతం వాటాతోపాటు ప్రభుత్వం నుంచి 10 శాతం  జమ చేస్తే వాటిని స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడతారు. మార్కెట్‌ విలువ ఆధారంగా ఉద్యోగ విరమణ సమయంలో వారు దాచుకున్న మొత్తంలో 60 శాతం అందజేస్తారు. మిగిలిన 40 శాతంతో ప్రయివేటు పెన్షన్‌ స్కీంలో తప్పకుండా భాగస్వాములు కావల్సి ఉంటుంది. దీనితోపాటు సీపీఎస్‌ విధానంలో సర్వీస్‌ మొత్తంలో కేవలం మూడు సార్లు మాత్రమే 25 శాతం చొప్పున రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అందువలనే మొత్తంగా సీపీఎస్‌ విధానమే వద్దని ఓపీఎస్‌ అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. కానీ ప్రభుత్వం గ్యారెంటీ పెన్షన్‌ స్కీం అని సీపీఎస్‌ కంటే కూడా ఉద్యోగులకు ఇంకా అన్యాయంచేసే విధానం తెచ్చి బలవంతంగా అమలు చేయాలని చూస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.


ప్రాన్‌ ఖాతాలకు సకాలంలో ప్రభుత్వ వాటా జమ కావడం లేదు

సీపీఎస్‌ విధానంలో ఉద్యోగి వాటాతోపాటు ప్రభుత్వ వాటా కింద 10 శాతం మొత్తాన్ని సకాలంలో ప్రాన్‌ ఖాతాకు జమ చేయక పోవడం వలన ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతారు. కేంద్రం ఇటీవల ప్రభుత్వాల వాటా 14 శాతానికి పెంచగా అది ఏమేరకు అమలుకు నోచుకుంటుందో అర్థం కావడం లేదు. పాతపెన్షన్‌ స్కీంలో ఉద్యోగ విరమణ సమయంలో ఆఖరు నెల జీతంలో సగం పెన్షన్‌గా నిర్ణయించడంతోపాటు డీఏలు, పీఆర్‌సీ సిఫార్సులు, ఆరోగ్య బీమా తదితరాలన్నీ అమలు చేస్తారు. సీపీఎస్‌తో అవేం ఉండకపోవడం వలన ఉద్యోగులకు తీవ్ర ఆర్థికనష్టం వాటిల్లుతోంది.

జి.వెంకటేశ్వరరావు, యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి


రుణాలు తీసుకునేందుకూ షరతులే

పాతపెన్షన్‌ విధానంలో రుణాలు తీసుకోవడం ఉద్యోగి ఇష్టం. సీపీఎస్‌లో రుణాలు తీసుకోవడానికి అనేక షరతులు ఉన్నాయి. జీవిత సర్వీసులో కేవలం మూడు సార్లే అదీ ఉద్యోగి వాటా ఆ సమయంలో ఎంత ఉందో దానిలో 25 శాతమే రుణాలు తీసుకునేందుకు అనుమతి ఉంటుంది. ప్రాన్‌ ఖాతా మొత్తాలను షేక్‌ మార్కెట్‌లో పెట్టడం వలన అప్పుడు మార్కెట్‌ విలువ పడిపోతే దాన్ని ఉద్యోగే భరించాల్సి ఉంది. ప్రభుత్వం కొత్తగా తెచ్చి జీపీఎస్‌ విధానంలో కూడా సీపీఎస్‌లాగానే నిబంధనలు ఉన్నాయి.

సయ్యద్‌ నయీం, ఉపాధ్యాయుడు, తాడికొండ


పోరాటాలు చేస్తే కేసులు, అరెస్టులు

సీపీఎస్‌ రద్దు చేస్తామని ప్రభుత్వమే హామీ ఇచ్చి విస్మరించడంపై పోరాటాలు చేస్తుంటే కేసులు పెడుతున్నారు. అరెస్టులు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం. సీపీఎస్‌ ఉద్యోగులు చాలా మందికి ప్రొబెషన్‌ అయ్యాక కూడా ప్రాన్‌ ఖాతా ప్రారంభంలో జాప్యం జరిగింది. దీనివల్ల ఆర్థిక నష్టం జరిగిందంటే ఇక ప్రభుత్వ వాటా కూడా నిర్దేశిత సమయంలో వేయక పోవడం వలన ఈనష్టం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడో ఆరు నెలల కిందట వేయాల్సిన ప్రభుత్వ వాటా ఇప్పుడు వేసినట్లు మెసేజ్‌లు వస్తున్నాయి. ఈఎన్నికల్లో పార్టీలు ఓపీఎస్‌ తెస్తామని హామీ ఇవ్వాలి.

 షకీలాబేగం, సీపీఎస్‌ (యూటీఎఫ్‌) ఉపాధ్యాయ సంఘం జిల్లా కో.కన్వీనర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు