logo

జగనన్న కాలనీ ఖాళీ స్థలాలకు ఎసరు!

తక్కువ ధరకే జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు.. కాకపోతే ఎన్నికలు అయిన వెంటనే పట్టాలు మీ చేతుల్లో పెడతామంటూ ఓ గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) కాలనీలోని ఖాళీ ప్లాట్లకు ఎసరు పెట్టాడు

Published : 13 Apr 2024 06:03 IST

ఓ వీఈర్వో నిర్వాకం

కొత్తరెడ్డిపాలెం జగనన్న కాలనీ

తక్కువ ధరకే జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు.. కాకపోతే ఎన్నికలు అయిన వెంటనే పట్టాలు మీ చేతుల్లో పెడతామంటూ ఓ గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) కాలనీలోని ఖాళీ ప్లాట్లకు ఎసరు పెట్టాడు. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో మూడు లేఔవుట్లలో చేబ్రోలు, కొత్తరెడ్డిపాలెం, పాతరెడ్డిపాళేనికి చెందిన సుమారు 560 మందికి ఇళ్ల స్థలాలు అందజేశారు. ఇంకా కొన్ని ప్లాట్లు మిగిలిపోయాయి. వాటిని వీఆర్వో అమ్ముకుని సొమ్ము చేసుకునేందుకు తెరదీశాడు. గ్రామానికి కాలనీ దగ్గరగా ఉండటం.. 100 వరకు ఇళ్లు పూర్తై నివాసాలు ఉండటంతో కాలనీ కొంత అభివృద్ధి చెందుతుండటంతో అక్కడ స్థలాలు కొనుగోలు చేసేందుకు స్థానికులు ముందుకు వస్తున్నారు. ఇదే అదునుగా చేసుకున్న ఆ వీఆర్వో ప్రధాన రహదారి వెంట ఉన్న ప్లాట్లకు రూ. 50 వేలు చొప్పున, అంతర్గత రహదారి వెంట ఉన్న ప్లాట్లకైతే రూ.30 వేలు వంతున బేరం పెట్టాడు. ప్రస్తుతం నగదు చెల్లించి ఇంటి నిర్మాణాలు ప్రారంభించుకోవచ్చని, ఎన్నికల తరవాత ఇళ్ల పట్టాలు మీ పేరునే ఇస్తామని చెబుతున్నాడు. కావాలంటే నగదు చెల్లించే సమయంలో ఉన్నతాధికారులకు చేత మాట్లాడిస్తానని హామీ కూడా ఇస్తున్నాడు.

గతంలోనూ  ఇలా..

గతంలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన సమయంలో ఈ వీఆర్వో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు సచివాలయంలో రిజిస్ట్రేషన్‌ చేస్తున్న సమయంలో సుమారు 15 వరకు అవకతవకలు బయటపడ్డాయి. ఆన్‌లైన్‌లో లబ్ధిదారుడి పేర్లకు డీకే పట్టాలు పొందిన వారి వివరాల్లో తేడాలు ఉన్నట్టు తహసీల్దార్‌ గుర్తించారు. అప్పటికే పట్టాలు పొందిన కొందరు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నారు. బయటకు పొక్కితే తమ శాఖ పరువేపోతుందని.. ఎవరి పేరున అయితే డీకే పట్టాలు అందించారో వారి వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో సరిచేసి రిజిస్ట్రేషన్‌ చేశారు. బీ ఈ విషయమై తహసీల్దార్‌ రమాదేవిని వివరణ కోరగా అలా అమ్ముకునే అవకాశం లేదని, విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 ఇటీవల ఓ లబ్ధిదారుడు కాలనీలో ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుకను పక్కనే ఉన్న ఖాళీ ప్లాట్‌లో పోయించాడు. పనులు జరుగుతుండగా.. ఓ వ్యక్తి వచ్చి ఈ స్థలం తనదని, మీరు వెంటనే ఇసుకను తీసివేయాలన్నాడు. ఇది గతంలో ఎవరికీ మంజూరు చేయలేదు కదా.. మీది ఎలా అవుతుంది అని ఆరా తీస్తే అసలు విషయం బయటకు పొక్కింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని