logo

తెదేపా గూటికి మాజీ ఎమ్మెల్యే రావి

జిల్లాలో వైకాపాకు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. అధికార పార్టీ నుంచి వలస వెళ్లే నేతల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో ఆ పార్టీలో ఆందోళన నెలకొంది.

Published : 13 Apr 2024 06:04 IST

నేడు ప్రత్తిపాడులో చంద్రబాబు సమక్షంలో చేరిక
ఈనాడు, అమరావతి

 జిల్లాలో వైకాపాకు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. అధికార పార్టీ నుంచి వలస వెళ్లే నేతల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో ఆ పార్టీలో ఆందోళన నెలకొంది. శుక్రవారం చంద్రబాబు సమక్షంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా, ఆమె భర్త సురేష్‌కుమార్‌ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం గుంటూరులో పర్యటిస్తున్న సమయంలోనే వారు తెదేపాలో చేరడం గమనార్హం. మరోవైపు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ వైకాపా ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పని చేశారు. 2014లో వైకాపా తరఫున పొన్నూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా పని చేశారు. 2019లో పొన్నూరు నుంచి పోటీ చేస్తారని భావించారు. చివరి నిమిషంలో వైకాపా అధిష్ఠానం టికెట్‌ నిరాకరించింది. వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇవ్వడంతో కిలారి రోశయ్య గెలుపు కోసం పనిచేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన రోశయ్య క్రమంగా రావి వెంకటరమణ, ఆయన వర్గాన్ని దూరం పెట్టడంతో వ్యతిరేక వర్గంగా ఉండిపోయారు. మరోవైపు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో రావి వెంకటరమణ వర్గం అధిష్ఠానంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. పార్టీలో అంతర్గత పోరు నేపథ్యంలో రావి వెంకటరమణను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. తనను అకారణంగా ఎందుకు సస్పెండ్‌ చేశారో చెప్పాలని అధిష్ఠానాన్ని ప్రశ్నించినా సమాధానం లేదు. ఈ క్రమంలో ఆయన రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న విషయమై చర్చ మొదలైంది. వరుసగా కార్యకర్తలతో సమావేశాలు పెట్టి వారి అభిప్రాయాలు సేకరించారు. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్న ఆయన తెదేపా వైపు మొగ్గుచూపారు. తెదేపా నేతలు రావివెంకటరమణతో చర్చించి పార్టీలోకి ఆహ్వానించారు. ఈయన స్వగ్రామం ప్రత్తిపాడు నియోజకవర్గం అబ్బినేనిగుంటపాలెం కావడం, ప్రత్తిపాడు నుంచి 2004లో ఎమ్మెల్యేగా పనిచేయడంతో నియోజకవర్గంలో విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. పొన్నూరు నియోజకవర్గంలో 2014లో వైకాపా తరఫున పోటీ చేయడం, పదేళ్ల పాటు ఇన్‌ఛార్జిగా చేయడంతో అక్కడ కూడా తన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ప్రత్తిపాడు, పొన్నూరు నియోజకవర్గాల్లో రావి ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఏటుకూరు బైపాస్‌ నుంచి ర్యాలీగా ప్రత్తిపాడు చేరుకుని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో తెదేపాలో చేరనున్నారు. ఎన్నికల ప్రకటనకు ముందే వైకాపాకు చెందిన పలువురు జిల్లా స్థాయి నేతలు తెదేపా తీర్థం పుచ్చుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని