logo

మాటల్లో గారడీ.. చేతల్లో బురిడీ..

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు బ్యాంకులకు రుణాలు కట్టొదు. మన ప్రభుత్వం రాగానే రుణాలన్నీ మాఫీ చేస్తాం.. వడ్డీలేని రుణాలిస్తాం.. స్వయం ఉపాధి శిక్షణ ఇస్తాం..

Updated : 13 Apr 2024 09:26 IST

డ్వాక్రా మహిళలకు చేసిందేమిటి జగన్‌
బటన్‌ నొక్కినా ఖాతాల్లో జమ కాని ఆసరా నగదు
న్యూస్‌టుడే, సత్తెనపల్లి

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు బ్యాంకులకు రుణాలు కట్టొదు. మన ప్రభుత్వం రాగానే రుణాలన్నీ మాఫీ చేస్తాం.. వడ్డీలేని రుణాలిస్తాం.. స్వయం ఉపాధి శిక్షణ ఇస్తాం.. మీ పిల్లల చదువుకు, కుటుంబానికి ఆర్థిక, సామాజిక భరోసా ఇస్తామంటూ మాయమాటలతో జగన్‌ నమ్మించారు. అధికారంలోకి వచ్చాక డ్వాక్రా సంఘాల రుణాల మాఫీ విషయంలో మడత పేచీ పెట్టారు. సీఎం అయ్యేరోజుకు ఉన్న రుణాల్ని మాఫీ చేయకుండా 2019 ఏప్రిల్‌ 11వరకు ఉన్న రుణాలు మాత్రమే చెల్లించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో డ్వాక్రా సంఘాల్లోని సభ్యుల అభ్యున్నతికి కొత్తగా ఒక్క పథకం అమలు చేసింది లేదు. 

స్వయం ఉపాధి శిక్షణ ఏదీ..?

డ్వాక్రా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా తెదేపా ప్రభుత్వం పట్టణాల్లో మెప్మా, గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్‌ ద్వారా స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇప్పించింది. టైలరింగ్‌, ఎంబ్రాయిడరింగ్‌, బ్యూటీషియన్‌, కంప్యూటర్‌ కోర్సుల్లో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉచితంగా కుట్టుమిషన్లు అందజేశారు. ఒక్కో పట్టణంలో ఏటా 300 నుంచి 400 మంది, మండలాల్లో 200 నుంచి 300 మంది స్వయం ఉపాధి శిక్షణ పొంది ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. వైకాపా డ్వాక్రా మహిళల స్వయం ఉపాధిని ఎప్పుడో మరిచిపోయింది. ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క స్వయం ఉపాధి శిక్షణ శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. 

సున్నా వడ్డీ..  ఉత్తదే..

నా డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీకే రుణాలిస్తానని జగన్‌ గొప్పగా గత ఎన్నికల ప్రచారంలో చెప్పారు. నవరత్నాల్లో వైఎస్‌ఆర్‌ సున్నావడ్డీని ఒకటిగా చేర్చినా సక్రమంగా అందించలేకపోయారు. రుణం తీసుకున్నప్పుడు వడ్డీలేని విధంగా రుణాలివ్వకుండా ఏడాదికి ఒకసారి బటన్‌ నొక్కే విధానం పెట్టారు. సున్నావడ్డీ అర్హతకు ఎన్నో ఆంక్షలు పెట్టారు. దీంతో చాలా సంఘాలు, సభ్యులు సున్నా వడ్డీకి దూరమయ్యాయి. గతేడాది ఆగస్టులో జిల్లా వ్యాప్తంగా 41,400 సంఘాల్లోని 4,14,910 మందికి రూ.58.02 కోట్ల సున్నా వడ్డీ లబ్ధికి బటన్‌ నొక్కినా ఇప్పటికీ వేలాది సంఘాలకు లబ్ధి జమ కాలేదు. దీనికి సాంకేతిక కారణాలు, ఖాతాల్లో తప్పులంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారు.

వెలుగుచూసిన అవకతవకలు

డ్వాక్రా సంఘాలకు రుణాల పంపిణీతోపాటు సమాఖ్యల నిర్వహణలో చాలాచోట్ల అవకతవకలు బయటపడ్డాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ముప్పాళ్ల మండలంలోని చాగంటివారిపాలెం వెళ్లిన మంత్రి అంబటితో  బ్యాంకు లింకేజి రుణానికి రూ.లక్షకు రూ.2 వేలు లంచంగా తీసుకుంటున్నారని డ్వాక్రా మహిళ ప్రశ్నించింది. చాలాచోట్ల ఇవే ఫిర్యాదులు ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి వచ్చాయి. ఉద్యోగులు, గౌరవ వేతనంపై పనిచేసే వారు అడిగినంత ఇవ్వకుంటే రుణం నిలిపేసి ఇబ్బందులు పెడతారని ఇప్పటికీ డ్వాక్రా మహిళలు వాపోతున్నారు. సంఘాల పొదుపు నగదు అధికార పార్టీ నాయకుల సహకారంతో స్వాహా చేసిన ఘటనలు కూడా జిల్లాలో వెలుగు చూశాయి.

మహిళా సంఘాలకు  భవనాల నిర్మాణమేదీ?

ఉపాధి నిధులకుతోడు స్థానిక సంస్థల భాగస్వామ్యంతో మండలాల్లో మహిళా శక్తి భవనాల్ని తెదేపా ప్రభుత్వం నిర్మించింది. దీంతో అద్దె భవనాల నుంచి వాటికి చాలాచోట్ల విముక్తి లభించింది. జగన్‌ పాలనలో మహిళా శక్తి భవనాల నిర్మాణం ఊసే లేకుండా పోయింది.

రుణసాయం కేంద్రానికి వదిలేసి..

డ్వాక్రా సంఘాలకు బ్యాంకుల ద్వారా లింకేజి రుణాలు, రుణసాయం తెదేపా ప్రభుత్వ హయంలో గొప్పగా జరిగేది. ఏటా జిల్లాలోని సంఘాలకు రూ.200 నుంచి రూ.300 కోట్ల రుణ పంపిణీ లక్ష్యాన్ని నిర్దేశించి మెప్మా, సెర్ప్‌ అధికారులు, ఉద్యోగులను పరుగులు పెట్టించేవారు. వైకాపా ప్రభుత్వం బ్యాంకు లింకేజి రుణాలన్నీ కేంద్ర ప్రభుత్వంపైకి నెట్టేశారు. కొవిడ్‌ సమయంలో కేంద్రం డ్వాక్రా సంఘాల రుణ పంపిణీ లక్ష్యాన్ని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది. బ్యాంకులకు విరివిగా డ్వాక్రా సంఘాలకు రుణాలు ఇవ్వాలని ఆదేశాలు చేసింది. దీంతో బ్యాంకులు ఆర్థిక క్రమశిక్షణ పాటించే సంఘాలకు కోరినంత రుణాలు ఇస్తున్నాయి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుని అసలు సాయాన్ని ఎప్పుడో మరిచిపోయింది. ఉన్నతి పథకం కింద నిరుపేద కుటుంబాల్లోని మహిళల ఆర్థిక స్వావలంబనకు రుణాల్ని గత ప్రభుత్వం అందజేస్తే ఈ ప్రభుత్వం మమ అనిపించింది.


జగన్‌ను నమ్మరు

డ్వాక్రా మహిళలకు జగన్‌ అరచేతిలో వైకుంఠం చూపించారు. వారి ఆశలు అడియాసలు చేశారు. ఐదేళ్లలో వారి కోసం ఒక్క పథకాన్ని ప్రత్యేకంగా అమలు చేయలేదు. డ్వాక్రా రుణమాఫీకి ఆసరా అంటూ ఉత్తుత్తి బటన్‌లు నొక్కారు. ఎప్పుడో జనవరిలో నొక్కిన బటన్‌కు ఇప్పుడు కూడా డబ్బులు ఖాతాల్లో పడలేదు. స్వయం సహాయక సంఘాలతోపాటు వాటిలోని సభ్యులకు గుర్తింపు, గౌరవం చంద్రబాబుతోనే ఉంటాయి. మరోసారి జగన్‌ను డ్వాక్రా మహిళలు నమ్మే పరిస్థితి లేదు.

బీమినేని వందనాదేవి, డ్వాక్రా సంఘాల రాష్ట్ర నాయకురాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని