logo

కిలారీ.. మాట తప్పారు

పొన్నూరు 23వ వార్డు ఇందిరా కాలనీలో మురుగు కాలువ లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్ల కిందట ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికీ తిరిగారు.

Published : 13 Apr 2024 06:09 IST

డ్రెయిన్లు నిర్మించలేదు 
దోమల బెడదతో ప్రజల ఇబ్బంది 

29వ వార్డులో గృహాల మధ్య నిలిచిన మురుగు

పొన్నూరు, న్యూస్‌టుడే : పొన్నూరు 23వ వార్డు ఇందిరా కాలనీలో మురుగు కాలువ లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్ల కిందట ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికీ తిరిగారు. ఆ సమయంలో మురుగు కాలువ నిర్మాణ పనులు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. కొంత కాలం తర్వాత ఎమ్మెల్యే వెంకటరోశయ్య సిమెంటు మురుగుకాలువ నిర్మాణ పనులకు రూ. 5 లక్షలు మంజూరు చేసినట్లు ఆర్భాటంగా ప్రకటించారు. రోజులు గడుస్తున్నా పనులు ప్రారభించలేదు. వర్షం కురిస్తే మోకాలు లోతు నీటిలో రాకపోకలు నిర్వహిస్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

  •  వైకాపా నేతలు బడాయి మాటలతో కాలయాపన చేసి ప్రజా సమస్యలను పరిష్కరించలేదని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు. సిమెంటు మురుగుకాలువ నిర్మాణ పనులు చేపట్టమని స్థానికులు వైకాపా నేతలను కోరినా చూద్దాం.. చేద్దాంలే అంటూ మాటలతో మభ్య పెట్టారని పురప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
  •  పొన్నూరు 6, 10, 11, 14, 15, 17, 18, 23, 25, 29 వార్డుల్లోని తదితర కాలనీల్లో సిమెంటు మురుగు కాలువ నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో కాలనీ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణంలో సుమారు 15 కిలోమీటర్ల లోపు సిమెంటు మురుగు కాలువ పనులు చేపట్టినట్లు ఇంజినీరింగ్‌ అధికార గణాంకాలు చెబుతున్నాయి. మురుగు వెళ్లే మార్గం లేకపోవడంతో ఎక్కడ మురుగు అక్కడే నిల్వ ఉంటోంది. కొన్ని కాలనీల్లో మురుగు ఇళ్ల మధ్య చేరడంతో దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
  •  మురుగునీరు నిల్వ ఉండటంతో దోమల బెడదతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిడుబ్రోలు, డీవీసీ కాలనీ, ఓంకాలనీ, శంకర మఠం వెనక వైపు తదితర ప్రాంతాల్లో విష జ్వరాలు ప్రబలాయి. ఎక్కువ మంది రోగులు ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయించుకున్నారు.
  •  పొన్నూరు పరిధి 29వ వార్డు ఓం కాలనీలో కొంత కాలం కిందట సుమారు రూ.5 లక్షలు ఖర్చు చేసి పిమెంటు రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. డ్రెయిన్‌ పనులు చేపట్టకపోవడంతో మురుగు పోయే మార్గం లేక గృహాల మధ్య ఉన్న ఖాళీ సల్థాల్లోకి చేరుతోంది. ఈ కాలనీలో గతంలో విష జ్వరాలు ప్రబలి అనేక మంది మంచం పట్టారు.

    వర్షం వస్తే అవస్థలే

గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం కింద ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య మా వార్డులో పర్యటించినప్పుడు మురుగు కాలువ నిర్మించాలని కోరాం. పనులకు రూ. 5 లక్షలు కేటాయించామని చెప్పారు. రోజులు గడుస్తున్నా పనులు మాత్రం ప్రారంభించలేదు. వర్షం పడితే రాకపోకలు నిర్వహించడానికి చాలా ఇబ్బందిగా ఉంది.

గుమ్మడి సాల్మన్‌ రాజు 23వ వార్డు


దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నాం

మా వార్డులో సుమారు 20 ఏళ్ల కిందట ఇల్లు నిర్మించుకున్నాం. ఇప్పటి వరకు కచ్చా కాలువలను కూడా ఏర్పాటు చేయలేదు. ఇంటి వద్ద గుంతులు తీసుకున్నాం. మురుగు పారుదల లేక దుర్వాసనతో అనేక ఇబ్బందులు పడుతున్నాం. వాసనతో ఇంట్లో ఉండలేకపోతున్నాం. దీనిపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు

రాముల రమణమ్మ, 18వ వార్డు


దోమలతో ఉండలేకపోతున్నాం

పక్కా డ్రెయిన్లు లేక మురుగు ముందుకు కదలడం లేదు. చాలా రోజుల నుంచి దోమల బెడద ఎక్కువగా ఉంది. దోమ కాటు వల్ల జ్వరాలు వస్తాయని భయమేస్తోంది. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని పురపాలక సంఘ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం మోసం చేసింది.

పాములపాటి నరేంద్ర 11వ వార్డు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని