logo

మేం చేసిన నేరమేంటి.. ఈ నిరీక్షణేంటి?

తిరుమలలో దైవదర్శనం చేసుకుని వచ్చి మంగళగిరి వెళ్లాల్సిన శ్రీనివాస్‌ కుటుంబం శుక్రవారం గుంటూరులో బస్సు దిగింది. ఇక్కడ నుంచి పల్లెవెలుగు బస్సు కోసం నాలుగు గంటలు ఎదురుచూడాల్సి వచ్చింది.

Published : 13 Apr 2024 06:11 IST

సీఎం జగన్‌ గుంటూరు సభకు భారీగా ఆర్టీసీ సర్వీసులు
ప్రయాణికులకు తప్పని యాతన
ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట

నిర్మానుష్యంగా చిలకలూరిపేట బస్టాండ్‌

తిరుమలలో దైవదర్శనం చేసుకుని వచ్చి మంగళగిరి వెళ్లాల్సిన శ్రీనివాస్‌ కుటుంబం శుక్రవారం గుంటూరులో బస్సు దిగింది. ఇక్కడ నుంచి పల్లెవెలుగు బస్సు కోసం నాలుగు గంటలు ఎదురుచూడాల్సి వచ్చింది. చిన్నపిల్లలు ముగ్గురు ఉన్నారు. దూరప్రయాణం చేసి అలిసిపోయారు. బస్సుల్లేవు. ఎండ, ఉక్కపోతతో అల్లాడిపోయారు.

గుంటూరులోని ఏటుకూరు వద్ద వైకాపా శుక్రవారం నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభకు బస్సులు కేటాయించడంతో ప్రయాణికులకు ఆర్టీసీ సర్వీసులు లేక ఇబ్బందులు పడ్డారు. వైద్యం కోసం విజయవాడ, గుంటూరు వెళ్లాలనుకుని బయల్దేరిన వారు బస్టాండ్లలో చిక్కుకుపోయారు. వైకాపా సభకు ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్‌, పల్నాడు జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులను భారీసంఖ్యలో కేటాయించారు. ఈ ఐదు జిల్లాల నుంచి సుమారు వెయ్యి బస్సుల వరకు సభకు తరలాయి. దీంతో ఆయా జిల్లాల్లో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

వినుకొండ నుంచి విజయవాడ వెళ్లాల్సిన వారు బస్సుల్లేక మూడుగంటల పాటు బస్టాండ్‌లోనే చిక్కుకుపోయారు. వచ్చే అరకొర బస్సుల్లోనే కిక్కిరిసి వెళ్లారు. ఉక్కపోత, ఎండకు తోడు రద్దీ ఉండడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.

సత్తెనపల్లి నుంచి గుంటూరు మార్గంలో సీఎం జగన్‌ రోడ్‌షో ఉండడంతో బస్సులను నిలిపేశారు. కొన్నింటిని మళ్లించారు.  అత్యవసర పనుల నిమిత్తం బయల్దేరిన వారు సమయానికి గమ్యస్థానాలను చేరుకోలేకపోయారు. రెండు గంటలు ఆలస్యంగా ఇళ్లకు చేరుకున్నారు. మరోవైపు బస్సులు నిలిపేయడంతో ఎండ, ఉక్కపోతకు అల్లాడిపోయారు.

నరసరావుపేటలో ప్రయాణికుల ఎదురుచూపు

అధికంగా చెల్లించి..

ఈనెల 9న ఉగాది, 11న రంజాన్‌ పండగలొచ్చాయి. మధ్యలో 10వ తేదీసెలవు పెట్టి చాలామంది పట్టణాల నుంచి స్వగ్రామాలకు వెళ్లారు. పండగ సెలవులు ముగిశాయని శుక్రవారం సొంతూళ్ల నుంచి పట్టణాలకు బయల్దేరారు. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు ఆటోల్లో సామానులతో వస్తే బస్సుల్లేక ఎండల్లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. బస్సుల కోసం ఎండలోనే ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఎంతకూ బస్సులు రాకపోవడంతో అవస్థలు పడ్డారు. కొందరైతే రూ.50 ఛార్జీకి ఆటోల్లో రూ.100 చెల్లించి గమ్యస్థానాలకు చేరుకున్నారు. పల్లెవెలుగు బస్సులన్నింటినీ తరలించడంతో గ్రామాలకు బస్సులు రాలేదు. చాలామంది తమ రోజువారీ కార్యకలాపాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. కొందరు అధిక ఛార్జీలు చెల్లించి ఆటోల్లో వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని