logo

విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదయ్యా!

రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి ప్రసాద్‌కు గతంలో ఒకటో తేదీనే పింఛన్‌ సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ అయ్యేది. బీపీ, మధుమేహం సమస్యతో బాధపడుతున్న ఆయన నెల రోజులకు సరిపడా ఒకేసారి ఔషధాలు తెచ్చుకునేవారు.

Published : 18 Apr 2024 05:28 IST

జగన్‌ జమానాలో పింఛనర్ల జీవితాలు అతలాకుతలం
క్వాంటమ్‌ పింఛన్‌ మూడు శాతం తగ్గింపు
పెండింగ్‌లో డీఏలు.. రూ.లక్షల్లో నష్టం

రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి ప్రసాద్‌కు గతంలో ఒకటో తేదీనే పింఛన్‌ సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ అయ్యేది. బీపీ, మధుమేహం సమస్యతో బాధపడుతున్న ఆయన నెల రోజులకు సరిపడా ఒకేసారి ఔషధాలు తెచ్చుకునేవారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే ఆయనకు కష్టాలు ప్రారంభమయ్యాయి. పింఛన్‌ 10, 12 తేదీల్లో పడుతోంది. ఓ నెలలో 15 వరకు రాలేదు. సకాలంలో పింఛన్‌ పడక ఆందోళకు గురై బీపీ, మధుమేహం సమస్యలు మరింత పెరిగాయి. నెలవారీ చెల్లింపులు సకాలంలో చేయలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. డీఏలు పెండింగ్‌లో పెట్టడటం, ఫిట్మెంట్లో కోత విధించటం వల్ల ఐదేళ్లలో రూ.లక్షన్నరకు పైగా నష్టపోయారు.

  • విశ్రాంత ఉద్యోగి సుబ్బారావు పింఛన్‌ నుంచి ఆరోగ్య బీమా కింద ప్రభుత్వం నెలకు రూ.300 చొప్పున మినహాయించుకుంటోంది. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి హెల్త్‌కార్డు చూపిస్తే ఈ కార్డుతో వైద్యం చేయలేం. ముందుగా చెల్లించి తర్వాత ప్రభుత్వం నుంచి వైద్య బిల్లులు రీయింబర్స్‌మెంటు చేసుకోవాలని ఆసుపత్రి నిర్వాహకులు చెప్పారు. శస్త్రచికిత్స, వార్డులో ఉండి వైద్యం పొందినందుకు రూ.లక్షల్లో ఖర్చయింది. వైద్య బిల్లులకు నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి రీఎంబర్స్‌మెంటు మాత్రం ఇంకా రాలేదు. బిల్లు సొమ్ము ఎప్పుడు వస్తుందా అని ఆందోళన చెందుతున్నారు.

బాపట్ల, న్యూస్‌టుడే: సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో విశ్రాంత ఉద్యోగుల జీవితం దినదిన గండంగా మారింది. గతంలో ఠంచనుగా ఒకటో తేదీ పింఛన్‌ సొమ్ము అందేది. ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా జీవించేవారు. జగన్‌ గద్దె ఎక్కిన తర్వాత పింఛనర్లకు కష్టాల సుడిగుండాలు మొదలయ్యాయి. అసలు పింఛన్‌ ఎప్పుడు వస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. పింఛన్‌ నగదు పడక ఆందోళనకు గురై అది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపింది. కరవు భత్యం(డీఏ) కూడా ఒక్కసారే చెల్లించారు. రెండో డీఏ కోసం ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకొకసారి డీఏ ఇవ్వలేదు. ఎనిమిది డీఏలు రాక ఒక్కో పింఛన్‌దారుడు రూ.లక్షల్లో నష్టపోయారు. సీఎం జగన్‌ తమ జీవితాలతో చెలగాటమాడుతున్నారని వైకాపా పాలనలో మోసపోయామని పింఛన్‌దారులు తీవ్ర మనోవేద]నకు గురవుతున్నారు.

2019 నుంచి 2024 మధ్యకాలంలో..

  • వైకాపా వచ్చాక, 2019లో సీఎం జగన్‌ 27 శాతం పీఆర్సీ అని చెప్పి మొదట ఆరు నెలలు మాత్రమే ఇచ్చి తర్వాత నుంచి 20 శాతం అని చెప్పి రివర్స్‌ పీఆర్సీ చేసి ఇస్తున్నారు.
  • ప్రతీ నెలా ఒకటో తేదీన పింఛన్‌ రావడం అనేది ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా జరగలేదు. పదో తేదీ నుంచి 20 తేదీ మధ్యలో ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితి. చివరకు పింఛను సొమ్ము పడడమే మహాభాగ్యం అనుకునేలా చేశారు.
  • 2021 ఏప్రిల్‌ నుంచి 2022 డిసెంబరు వరకు 21 నెలల పీఆర్సీ బకాయిలు చెల్లించలేదు. 
  • 2018 జులై నుంచి ఇప్పటి వరకూ మొత్తం 185 నెలల కరవు భత్యం బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.  ‌్ర
  • 70 ఏళ్లలోపు పింఛనుదారులకు అదనపు భృతి ఇదివరకు 10 శాతం ఉండేది. ఇప్పుడు ఏడు శాతానికి కుదించారు. అలాగే 75 ఏళ్ల వారికి 15 శాతం ఉండేది. దీనిని 12 శాతానికి తగ్గించారు. 
  • పింఛనుదారులు చనిపోతే వారికి చెల్లించాల్సిన మట్టి ఖర్చులు గరిష్ఠంగా నెల పింఛను మంజూరు విధానాన్ని మార్చి, కేవలం రూ.25 వేలే చెల్లిస్తున్నారు.
  • మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు చెల్లించడం లేదు. ఈహెచ్‌ఎస్‌ కార్డులను నిర్వీర్యం చేశారు. ఆస్పత్రుల్లో నగదురహిత చికిత్సలు చేయడం లేదు.
  • డీఏలు ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా పింఛన్‌దారుల పింఛన్‌ సొమ్ము పెంచినట్లు చూపించి ఆదాయ పన్ను వసూలు చేయడం గమనార్హం.

రూ. మూడు లక్షలు నష్టపోయా

వైకాపా ప్రభుత్వ పాలనలో పింఛనర్లు తీవ్ర అన్యాయానికి గురయ్యారు. సకాలంలో పింఛన్‌ సొమ్ము చెల్లించడం లేదు. ఎప్పుడు వస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నాం. డీఏలు ఇవ్వకుండా మోసం చేశారు. కేవలం మూడు శాతం మాత్రమే ఫిట్మెంట్ మాత్రమే ఇచ్చారు. డీఏలు, ఫిట్మెంట్‌ రూపంలో ఐదేళ్లలో వ్యక్తిగతంగా నేను రూ.మూడు లక్షలు నష్టపోయా. హెల్త్‌కార్డు ఉన్నా అన్ని వ్యాధులకు వైద్యం చేయడం లేదు. మెడికల్‌ రీయింబర్స్‌మెంటు బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం చేస్తున్నారు.

చెరుకూరి సుబ్బారావు, పింఛనర్ల సంఘం అధ్యక్షుడు

క్వాంటమ్‌ పింఛన్‌  తగ్గించడం అన్యాయం

70 ఏళ్లు దాటిన పింఛన్‌దారులకు చెల్లించే క్వాంటమ్‌ పింఛన్‌ను పది శాతం నుంచి ఏడు శాతానికి ప్రభుత్వం తగ్గించింది. అదనంగా వచ్చే పింఛన్‌లో మూడు శాతం చొప్పున గత నాలుగేళ్లలో రూ.వేలల్లో నేను నష్టపోయా. పింఛన్‌ చెల్లింపులో బాగా జాప్యం చేయడం వల్ల రుణాల తాలూకూ ఈఎంఐలు సకాలంలో చెల్లించలేక ఇబ్బంది పడుతున్నాం.

జీవీ బ్రహ్మం, పింఛనర్ల సంఘం ఉపాధ్యక్షుడు

గత ప్రభుత్వ హయాంలో..

రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఆర్థిక లోటును లెక్కచేయకుండా 43 శాతం ఫిట్‌మెంట్‌తో చంద్రబాబు పదో పీఆర్సీ ఇచ్చారు. జూన్‌ 2014 నుంచి మార్చి 2015 వరకు 10 నెలల పీఆర్సీ బకాయిలు సుమారు రూ.2 వేల కోట్లు ఒకేసారి పింఛనుదారులు అందరికీ చెల్లించారు. విరమణ పొందే ఉద్యోగులకు రిటైర్‌మెంట్‌ తేదీకి 15 రోజుల ముందుగానే ట్రెజరీలో బిల్లుల చెల్లింపు కోసం అనుమతి ఇచ్చేందుకు ప్రత్యేక జీవో తెచ్చారు. అంతేకాకుండా ఉద్యోగ విరమణ రోజే పింఛను, గ్రాట్యూటీ, కమ్యూటేషన్‌, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, జీపీఎఫ్‌, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ తదితరాలు ఉద్యోగులకు సకాలంలో అందించారు. ప్రతి నెలా 31వ తేదీ సాయంత్రం లేదా ఒకటో తేదీన పింఛను ఇచ్చేవారు.

వైకాపా హయాంలో పింఛను సొమ్ముకు కోత

డబ్భై ఏళ్లు దాటిన పింఛనర్లకు ఔషధాల కొనుగోలు, ఇతర అదనపు ఖర్చులు కలిపి అదనంగా పది శాతం క్వాంటమ్‌ పింఛన్‌, 75 ఏళ్లు నిండితే 15 శాతం క్వాంటమ్‌ పింఛన్‌ చెల్లించారు. క్వాంటమ్‌ పింఛన్‌ రూపంలో అదనంగా పింఛన్‌ సొమ్ము లభించి వారికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఖర్చుల భారం పడలేదు. వైకాపా ప్రభుత్వ హయాంలో క్వాంటమ్‌ పింఛన్‌కు కోతలు విధించారు. విశ్రాంత ఉద్యోగి రామారావుకు వయస్సు 74 ఏళ్లు. 70 ఏళ్లు దాటిన పింఛన్‌దారులు అనారోగ్య సమస్యలతో పెరుగుతున్న ఔషధాలు, ఇతర ఖర్చుల కింద అదనంగా పది శాతం క్వాంటమ్‌ పింఛన్‌ పొందేవారు. సీఎం జగన్‌ క్వాంటమ్‌ పింఛన్‌ను పది శాతం నుంచి ఏడు శాతానికి తగ్గించారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా విశ్రాంత ఉద్యోగులకు ఖర్చులు పెరిగాయి. కానీ క్వాంటమ్‌ పింఛన్‌లో మూడు శాతం కోత విధించడం వల్ల నాలుగేళ్లలో రామారావు రూ.65 వేలు నష్టపోయాడు.

జిల్లాలో మొత్తం పింఛన్‌దారులు:  9,592 మంది
ప్రతి నెలా చెల్లిస్తున్న  పింఛన్‌ సొమ్ము: రూ.39.76 కోట్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని