logo

జీతాలకూ ఎదురుచూపులే..

జిల్లాలోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఫిబ్రవరి, మార్చి జీతాలు రాలేదు. ఏప్రిల్‌ నెల జీతంతో కలిపి రెండు నెలల బకాయిలు విడులవుతాయన్న నమ్మకం లేదు.

Published : 18 Apr 2024 05:35 IST

ఉపాధ్యాయ, ఉద్యోగులకు ప్రతి నెలా ఇబ్బందులు

  • జిల్లాలోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఫిబ్రవరి, మార్చి జీతాలు రాలేదు. ఏప్రిల్‌ నెల జీతంతో కలిపి రెండు నెలల బకాయిలు విడులవుతాయన్న నమ్మకం లేదు.
  • జిల్లా బీసీ కార్పొరేషన్‌ ఉద్యోగులకు గత ఏడాది 2023, అక్టోబరు నుంచి 2024, మార్చి నెల వరకు జీతాలు విడుదల కాలేదు. సిబ్బంది ఆర్థికంగా ఇబ్బంది పడడంతో జిల్లా అధికారి అందుబాటులో ఉన్న నిధుల నుంచి అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలలకు అడ్వాన్స్‌ కింద చెల్లించారు. వేతనాలు విడుదలైన తర్వాత తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
  • జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఉద్యోగులకు జనవరి నుంచి మార్చి, ఉపాధి హామీ ఉద్యోగులకు ఫిబ్రవరి, మార్చి నెలల జీతాలు జమ కాలేదు.

జిల్లాపరిషత్తు (గుంటూరు), కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నెలలో ఒకటో తేదీన జీతం తీసుకున్న సందర్భాలు వేళ్ల మీద లెక్కించాల్సిందే. ఒకప్పుడు నెలలో ఒకటో తేదీ వస్తుందంటే ఉద్యోగులకు జీతాలు వస్తాయన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు ఏ నెలలో జీతం ఆ నెలలో వస్తుందన్న నమ్మకం లేని పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఓ క్రమబద్ధమైన జీవన విధానాన్ని అనుసరిస్తుంటారు. నెలవారీ కుటుంబ ఖర్చులు, పిల్లల ఫీజులు ఇతరత్రా ఖర్చులను లెక్క వేసుకుని వ్యయం చేస్తుంటారు. అయిదేళ్లలో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు నెలలో 1న జీతాలు జమ చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. 5వ తేదీ తర్వాత వేస్తున్నారు. ఎక్కువ మందికి 10 నుంచి 20వ తేదీ లోపు విడుదల చేస్తుండటంతో బ్యాంకుల్లో గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఇతరత్రా అప్పులకు సంబంధించి నెల వారీ కిస్తీలు, ఈఎంఐలు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈఎంఐలు ఆయా తేదీల్లో చెల్లించకపోతే బ్యాంకులు అపరాధ రుసుం విధిస్తున్నాయి. దీనికితోడు రుణాత్మక పాయింట్లతో సిబిల్‌ స్కోర్‌ పడిపోయి భవిష్యత్తులో రుణాలు పొందడానికి అవరోధంగా మారుతోంది. పిల్లలుంటే.. పాఠశాల, కళాశాలల్లో టర్మ్‌ ఫీజులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. నెలలుగా జీతాలు విడుదల చేయకపోవడంతో కుటుంబాల అవసరాలు తీర్చడానికి ప్రైవేటు వ్యక్తులు, సూక్ష్మ రుణ సంస్థల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటున్నారు. 1 నుంచి 5వ తేదీ లోపు జీతాలు వస్తే అప్పులు తీర్చి మిగిలిన డబ్బులతో కుటుంబాలను పోషించుకోవచ్చని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

జాప్యంతో ఇక్కట్లు

మూడు నెలలకోసారి వేతనాలు విడుదల చేస్తుండడంతో ఇక్కట్లు పడుతున్నారు. విద్యార్థులకు ఆహార పదార్థాలు తయారు చేసేందుకు సరకులు సరఫరా చేసే వారికి నాలుగైదు నెలలకు బిల్లులు విడుదల చేస్తుండటంతో నిర్వహణ కష్టంగా మారింది. గురుకులాల్లో 13 ఏళ్లుగా పని చేస్తున్న ఒప్పంద ఉద్యోగులను రెగ్యులర్‌ చేయకపోవడంతో వందలాది మంది నష్టపోయారు. కేవలం సొసైటీలు పరిధిలో పని చేస్తున్నామనే కారణంతో ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే సదుపాయాలు, ఆర్థిక ప్రయోజనాలు అమలు చేయడం లేదు.

డి.మధుసూదనరావు, రాష్ట్ర గురుకులాల జేఏసీ ఛైర్మన్‌

సమస్యలు పరిష్కరించలేదు

సాంఘిక సంక్షేమ గురుకులాల ఉద్యోగులకు ఫిబ్రవరి, మార్చి నెలల జీతాలు విడుదల చేయలేదు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగ విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు వర్తింపజేయకపోవడంతో వందల మంది నష్టపోయారు. ఒప్పంద ఉపాధ్యాయులు, అధ్యాపకులను 010 పద్దు నుంచి జీతాలు తీసుకోవడం లేదనే కారణంతో రెగ్యులర్‌ చేయకపోవడం బాధాకరం. విశ్వవిద్యాలయాల బోధనేతర సిబ్బందికి మాత్రం 62 ఏళ్లకు పెంచారు. పార్ట్‌ టైం టీజీటీలకు రూ.18 వేలు, పీజీటీలు, జేఎల్స్‌కు రూ.24 వేలు చెల్లిస్తున్నారు. 2019 నుంచి మెడికల్‌ అలవెన్స్‌ రూ.900 చెల్లించడం లేదు. మూడేళ్ల నుంచి ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రినిపల్స్‌ పదోన్నతులు ఇవ్వకపోవడంతో నష్టపోతున్నారు. నివాసయోగ్యంగా లేని క్వార్టర్లకూ పూర్తి స్థాయి హెచ్‌ఆర్‌ఏ మినహాయించేలా ఉత్తర్వు తీసుకురావడంతో నష్టం జరుగుతుంది.

దాసరి ప్రభాకర్‌, ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని