logo

నారీ గళంతో జగన్‌ వెన్నులో వణుకు

నారీ గళంతో జగన్‌ వెన్నులో వణుకు పుట్టాలని తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌, గుంటూరు పశ్చిమ అభ్యర్థి గళ్లా మాధవి, తెలుగు మహిళ నాయకురాలు మాగంటి రూప, తెలంగాణ తెదేపా నాయకులు నన్నూరి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు.

Updated : 18 Apr 2024 05:56 IST

ప్రతి మహిళ ఓటు వేయాలి.. మరో పది మందితో వేయించాలి
తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌

పట్టాభిపురం (గుంటూరు), న్యూస్‌టుడే: నారీ గళంతో జగన్‌ వెన్నులో వణుకు పుట్టాలని తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌, గుంటూరు పశ్చిమ అభ్యర్థి గళ్లా మాధవి, తెలుగు మహిళ నాయకురాలు మాగంటి రూప, తెలంగాణ తెదేపా నాయకులు నన్నూరి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. గుంటూరు రింగ్‌రోడ్డులోని సిద్ధార్థ గార్డెన్స్‌లో నారీ గళం బుధవారం నిర్వహించారు. పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ‘మహిళా శక్తిని మహాశక్తిగా గుర్తించి రాజకీయ అవకాశాలు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కింది. మహిళల ఉన్నతికి చంద్రబాబు ఎంతో కృషి చేశారు. వారికి ఎనలేని గౌరవం తెలుగుదేశం ఇచ్చింది. జగన్‌ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళలంటే కనీసం గౌరవం లేకుండా పోయింది. రాజకీయంగా సోషల్‌ మీడియాకు ఒక సెన్సార్‌ బోర్డు ఏర్పాటు చేసినప్పుడే మహిళలు ధైర్యంగా రాజకీయాల్లోకి వస్తారు. నా ఊపిరి ఉన్నంత వరకు అమరావతిని, ఏపీని ఎవరూ ముట్టుకోలేరు’.. అని స్పష్టం చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి ఆన్‌లైన్‌ ద్వారా మాట్లాడుతూ ఎన్నికల్లో మహిళలు చురుకైన పాత్ర పోషించాలన్నారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. గళ్లా మాధవి మాట్లాడుతూ ‘జగన్‌కు నారీ గళం ఏధంగా ఉంటుందో ఈ ఎన్నికల్లో చూపించాలి. తెదేపాతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. మహిళల కోసం చంద్రబాబు ‘కలలకు రెక్కలు’ పేరుతో పథకాన్ని తీసుకొస్తున్నారు. వనితలు తలచుకుంటే ఏదైనా సాధించగలరు. రాజధాని అమరావతి మహిళా రైతుల్ని ఎంత దారుణంగా హింసించారో అందరూ చూసి నివ్వెరపోయారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. మొక్కవోని దీక్షతో ఉద్యమం కొనసాగిస్తున్నారు. అవకాశాలు రాకపోయినా, అవమానాలు ఎదురైనా మహిళలు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలి’.. అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పెమ్మసాని శ్రీరత్న, మాజీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, జనసేన మహిళ నాయకురాలు కన్నా రజని జ్యోత్స్న పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని