logo

అద్దంకి నియోజకవర్గంలో రీపోలింగ్‌ నిర్వహించాలి

అద్దంకి నియోజకవర్గంలో ఈ నెల 13న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం దక్కలేదని నియోజకవర్గ వైకాపా అభ్యర్థి పాణెం హనిమిరెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

Published : 17 May 2024 04:44 IST

జిల్లా ఎన్నికల అధికారికి వైకాపా అభ్యర్థి ఫిర్యాదు

బల్లికురవ, న్యూస్‌టుడే: అద్దంకి నియోజకవర్గంలో ఈ నెల 13న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం దక్కలేదని నియోజకవర్గ వైకాపా అభ్యర్థి పాణెం హనిమిరెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సంతమాగులూరు 5, 53వ పోలింగ్‌ కేంద్రాలు, అద్దంకి రూరల్‌ పరిధిలోని 120, 121, 195వ పోలింగ్‌ కేంద్రాలు, కొరిశపాడు మండలంలో 264వ కేంద్రం, బల్లికురవ మండలంలో 89 పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఓటర్లు తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోలేకపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయా కేంద్రాల్లో వైకాపా ఎన్నికల ఏజెంట్లను కూడా లేకుండా చేశారన్నారు.  ఓటర్లను ప్రలోభపెట్టడంతో పాటు వారి ఓటును బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధిలో తిరిగి ఎన్నికల నిర్వహించాలని కోరారు. ఈ విషయమై అద్దంకి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి టి.వి.సునీల్‌ను వివరణ కోరగా కలెక్టర్‌ ఆదేశాలతో ఆరోపణలు వచ్చిన పోలింగ్‌ కేంద్రాల్లో విధులు నిర్వహించిన సెక్టార్‌, పోలింగ్‌ అధికారుల నుంచి వివరణ కోరామన్నారు. వాస్తవంగా ఆరోపణలు వచ్చిన పోలింగ్‌ కేంద్రాల్లో ఎక్కడా ఎలాంటి ఘర్షణలు జరగలేదు. పోలింగ్‌ నిలిచిన దాఖలాలు లేవు. అయినా వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని ఆయన వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని