logo

సర్పంచులకు నిధులు, విధులు లేకుండా చేసిన ప్రభుత్వం

కేంద్రం నుంచి విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులు రూ.998.84 కోట్లను పంచాయతీలకు జమ చేయాలని ఏపీ పంచాయతీ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు కోరారు.

Published : 17 May 2024 04:47 IST

సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు

మాట్లాడుతున్న చిలకలపూడి పాపారావు, పక్కన లలితకుమారి, సాంబశివరావు, జాస్తి వీరాంజనేయులు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: కేంద్రం నుంచి విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులు రూ.998.84 కోట్లను పంచాయతీలకు జమ చేయాలని ఏపీ పంచాయతీ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు కోరారు. గుంటూరులోని సంఘ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తుతున్నా.. ప్రజలు ఇబ్బందులు చెబుతున్నా.. పంచాయతీ ఖాతాల్లో నిధులు లేకపోవడంతో సర్పంచులుగా తామేమీ చేయలేని స్థితిలో ఉన్నాం. కేంద్రం నుంచి నిధులు వచ్చి 45 రోజులు గడుస్తున్నా నేటికీ పంచాయతీలకు జమ చేయలేదు. ఉన్నతాధికారులను కలిసి విన్నవించగా త్వరలో జమ చేస్తామని చెప్పినా ఫలితం లేదు. వేసవిలో తాగునీటి సమస్యకు నిధులు సమస్య తలెత్తుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వాల్సిన 5వ ఆర్థిక సంఘం నిధులను ఇంత వరకు విడుదల చేయకపోవడం దారుణం. ఈ ప్రభుత్వాన్ని జూన్‌ 4న ఇంటికి పంపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. సర్పంచులకు కనీసం నిధులు, విధులు లేకుండా చేసింది’.. అని ధ్వజమెత్తారు. అఖిల భారత పంచాయతీ పరిషత్తు(న్యూదిల్లీ) జాతీయ ఉపాధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ ‘వైకాపా ప్రభుత్వం సర్పంచులకు నిధులు, విధులు లేకుండా చేసి ఉత్సవ విగ్రహాల్లాగా చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులంతా కలిసి అనేక రూపాల్లో ఉద్యమాలు చేసినా ప్రభుత్వం కేంద్ర ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు జమ చేయకపోవడం దుర్మార్గం. గతంలో ఇదే విషయమై కేంద్రం కమిటీని రాష్ట్రానికి పంపితే అప్పుడు తప్పు జరిగిందని నివేదించారు. మళ్లీ ఆ తప్పు జరగదని చెప్పిన అధికారులు నేటికీ పంచాయతీలకు నిధులు జమ చేయలేదు. ఈ విషయంపై ఈసీ దృష్టి సారించి పంచాయతీలకు నిధులు విడుదల చేసేలా చూడాలి. గ్రామ ప్రజలు ఓటుతో ఎన్నుకున్న సర్పంచులకు గౌరవ వేతనం రూ.3 వేలుంటే, ప్రభుత్వం నియమించుకున్న వాలంటీర్లకు రూ.5 వేల గౌరవ వేతనం ఉంది. అత్యంత తక్కువ గౌరవ వేతనాన్ని సర్పంచులకు ఇవ్వడం దారుణం’.. అని మండిపడ్డారు. రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు చందు వెంకట సాంబశివరావు, వెంగళాయపాలెం సర్పంచి నల్లపాటి లలితకుమారి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని