logo

ఎన్నికల రుసుముల్లో కోత!

సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు (పీఓ, ఏపీఓ), అదర్‌ పోలింగ్‌ ఆఫీసర్ల(ఓపీఓ)కు చెల్లించే రెమ్యునరేషన్‌లోనూ కొందరు రిటర్నింగ్‌ అధికారులు కోత విధించారు.

Updated : 17 May 2024 06:42 IST

ఇదేం వ్యత్యాసమని ఉద్యోగుల రుసరుస
ఆడిట్‌ లేకపోవడంతో ఆర్వోల ఇష్టారాజ్యమని విమర్శ
ఈనాడు, అమరావతి

సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు (పీఓ, ఏపీఓ), అదర్‌ పోలింగ్‌ ఆఫీసర్ల(ఓపీఓ)కు చెల్లించే రెమ్యునరేషన్‌లోనూ కొందరు రిటర్నింగ్‌ అధికారులు కోత విధించారు. ఈ రుసుములు ఆయా జిల్లాలు, నియోజకవర్గాలకు వేర్వేరుగా ఉన్నాయి. దీంతో ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది. ఎన్నికల వ్యయాలకు ఆడిట్‌ ఉండదు. ఉన్నతాధికారులు రాసిందే లెక్కగా ఉంటోంది. ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం చెల్లింపులు చేయకుండా ఉమ్మడి గుంటూరులోని పలు నియోజకవర్గాల్లో కోత విధించారు. కొన్ని జిల్లాల్లో పీఓ, ఏపీఓలకు రూ.2400, 2250 కూడా చెల్లించారు. ఉమ్మడి గుంటూరు మొత్తంగా పరిశీలిస్తే గరిష్ఠంగా మంగళగిరి నియోజకవర్గంలో మాత్రమే పీఓ, ఏపీఓలకు రూ.2050 చెల్లించారు. పల్నాడు జిల్లాలో మరీ తక్కువగా రూ.1750 మాత్రమే చెల్లించారు. ఇలా వ్యత్యాసాలు నెలకొనడంతో ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఇచ్చే అరకొర రుసుముల్లోనూ కోత పెట్టడం ఏమిటని ఉద్యోగవర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

కత్తిమీద సాములా విధులు..

అసలు ఎన్నికల విధులు అంటేనే ఉద్యోగులకు చాలా ప్రతిష్ఠాత్మకం. ఏమాత్రం తేడాలొచ్చినా వారి కొలువులకు ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి విధులను అనేక ఇబ్బందులను అధిగమించి నిర్వహిస్తారు. వేళకు తిండీ తిప్పలకు నోచుకోకపోయినా విధులు మాత్రం పక్కాగా నిర్వహించాలి. ఏ తేడా వచ్చినా వారే బాధ్యులవుతారు. కొందరు భోజనాలు కూడా చేయకుండా విధులు నిర్వహించారు. ఆ భోజనాలు అందాయా లేదా అనేది కొందరు రిటర్నింగ్‌ అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అయినా విధులు నిర్వహించినందుకు తమకిచ్చే కొద్దిపాటి రుసుముల్లో వ్యత్యాసాలు దుర్మార్గమని ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు.

  • పీఓ, ఏపీఓలకు రెండు రోజుల శిక్షణ, ఆ తర్వాత పోలింగ్‌ విధులు నిర్వహించినందుకు రూ.2400, ఇతర పోలింగ్‌ అధికారుల్లో ఫస్టు పోలింగ్‌ అధికారికి రూ.800 చొప్పున ఇవ్వాలి. ఈ విధంగా ఉమ్మడి గుంటూరులో ఒకటి, రెండు నియోజకవర్గాల్లో మాత్రమే చెల్లింపులు చేశారు. మిగిలిన చోట్ల రూ.300 నుంచి రూ.500 వరకు కోత విధించారు. ఒక నియోజకవర్గంలో ఒకలా మరోచోట ఇంకోలా చెల్లింపులు చేయడం ప్రస్తుతం ఉద్యోగుల్లో చర్చనీయాంశమవుతోంది. ఈ కోతలు ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
  • మంగళగిరిలో ఆర్వోగా జిల్లా సంయుక్త పాలనాధికారి వ్యవహరించారు. అక్కడ పీఓ, ఏపీఓలకు రూ.2050, ఇతర పోలింగ్‌ అధికారులకు రూ.800 పూర్తిగా చెల్లించారు. ఆపై నియోజకవర్గంలో పోలింగ్‌ విధులకు హాజరైన ప్రతి ఉద్యోగికి భోజనాలు, అల్పాహారం అందించే విషయంలో చాలా చొరవ తీసుకున్నారు. ఆ విధంగా మిగిలిన నియోజకవర్గాల్లో చొరవ ప్రదర్శించలేదని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు.
  • ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఓపీఓలు నలుగురైదుగురు ఉంటారు. నియోజకవర్గంలో సగటున 800 నుంచి వెయ్యి మంది వరకు ఓపీఓలు ఉంటారు. ఇన్ని వందల మందికి ఆర్వోలు కోతలు విధించడంపై ఉద్యోగవర్గాలు తప్పుబడుతున్నాయి.
  • గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో ఓపీఓలకు రూ.800కు బదులు రూ.750 చేతిలో పెట్టారు. సగటున ఒక్కో ఉద్యోగికి రూ.50 తగ్గించారు.
  • తాడికొండ, పొన్నూరు. ప్రత్తిపాడు, తెనాలి నియోజకవర్గాల్లో పీఓ, ఏపీఓలకు రూ.2050కు బదులు రూ.1750 మాత్రమే చెల్లించారు. ఒక్కో ఉద్యోగికి రూ.300 తక్కువ చెల్లించారు. అదేవిధంగా ఓపీఓ విధులు నిర్వహించిన ఉద్యోగులకు రూ.800కు కేవలం రూ.500 చెల్లించారు.
  • పల్నాడు జిల్లాలో పీఓ, ఏపీఓలకు రూ.1750, ఫస్టు ఓపీఓకు రూ.750 మిగిలిన వారికి రూ.500 చొప్పున జిల్లా వ్యాప్తంగా పొంతన లేకుండా చెల్లింపులు చేశారని ఉద్యోగులు చెబుతున్నారు.
  • బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో పీఓ, ఏపీఓకు రూ.1750, ఓపీఓకు రూ750 చెల్లించారు. ఇక్కడ కూడా పీఓ, ఏపీఓలకు రూ.300, ఓపీఓలకు రూ.50 చొప్పున తగ్గించి ఇచ్చారు.

తెలంగాణలో ఇలా..

తెలంగాణలో ఎన్నికల విదులు నిర్వహించిన సిబ్బందికి రెమ్యూనరేషన్‌ పీఓ, ఏపీఓలకు రూ.3150, ఓపీఓలకు రూ.1500 ఇచ్చారు. కనీసం ఆ స్థాయిలో చెల్లించకపోయినా పీఓ, ఏపీఓలకు రూ.2000కు తగ్గకుండా ఓపీఓలకు రూ.800కు తగ్గకుండా ఇస్తే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదని ఉద్యోగవర్గాలు పేర్కొన్నాయి.

విధి నిర్వహణ పత్రాలేవి?

ఉద్యోగులకు ఎన్నికల విధులు నిర్వహించినందుకు డ్యూటీ సర్టిఫికెట్లు ఇస్తారు. అవి చాలా నియోజకవర్గాల్లో అందించలేదు. ప్రధానంగా టీచర్లకు ఈఎల్స్‌ ఉండవు. ఎన్నికల విధులు నిర్వహించినట్లు ధ్రువపత్రం ఉంటే ఆ రోజులకు ఈఎల్స్‌ చెల్లిస్తారు. ఆ దృష్ట్యా వెంటనే వాటిని ఇవ్వాలని కోరుతున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో అయితే అక్కడ ఆర్వో ఉద్యోగుల డ్యూటీ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. అదే విధంగా జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో కూడా అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని